పోటీపై ట్విస్ట్.. మమత కోసం త్యాగం.. అనూహ్య నిర్ణయం

Update: 2021-05-22 11:30 GMT
పశ్చిమ బెంగాల్ అంతటా గెలిచి.. తను పోటీచేసిన నందిగ్రామ్ స్థానంలో మాత్రం టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఓడిపోయారు. అందుకే ఇప్పుడు ఆమె సీఎం అయినా కూడా ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే సీఎం పోస్టుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. శాసనమండలి బెంగాల్ లో లేకపోవడంతో ఈ అనివార్యత ఏర్పడింది.

అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. ఆమె పోటీ చేసేందుకు వీలుగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే శోభన్ దేబ్ ఛటోపాధ్యాయ తన పదవికి రాజీనామా చేశారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన కోల్ కతాలోని భవానీపూర్ నుంచి కాకుండా.. తనకు సవాల్ విసిరి బీజేపీలో చేరిన పాత మిత్రుడు సువేందు అధికారిపై నందిగ్రామ్ లో పోటీచేశారు మమత. తృటిలో ఆయన చేతిలో ఓడిపోయారు. బెంగాల్ లో తృణమూల్ గెలిచి మమత ఓడిపోవడం సంచలనమైంది.

ఈ క్రమంలోనే తన పాత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచే మమతా బెనర్జీ మళ్లీ అసెంబ్లీకి పోటీచేయబోతున్నారు.  మొన్నటి ఎన్నికల్లో ఆ స్థానంలో తృణమూల్ అభ్యర్థిగా శోభన్ దేబ్ చటోపాధ్యాయ పోటీచేసి గెలిచాడు. పార్టీ అధినేత్రి కోసం త్యాగం చేస్తూ ఆయన భవానీపూర్ సీటుకు రాజీనామా చేశారు. శుక్రవారం రాజీనామాను స్పీకర్ బిమాన్ కు అందజేశారు.

ప్రస్తుతం భోభన్ దేబ్ మమత కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం విశేషం. అయితే ఆయన కూడా ఆరునెలల్లోగా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నిక కానున్నారు. మరో రెండు ఖాళీ అయిన స్థానాల్లో శోభన్ దేవ్ ను నిలబెట్టడానికి మమత రెడీ అయ్యారు. ఇక తన పాత నియోజకవర్గం నుంచే మరోసారి మమత పోటీచేయనున్నారు.
Tags:    

Similar News