రాజీనామాతో సీనియర్లకు నోట మాట రాకుండా చేసిన సీతక్క

Update: 2022-12-19 04:39 GMT
పదవుల మీద ప్రేమే తప్పించి.. తమకు పేరు ప్రఖ్యాతుల్ని.. పదవుల్ని.. డబ్బుల్ని తీసుకొచ్చిన పార్టీకి పని చేయాలని.. దానికి విధేయులుగా ఉండాలని కష్టంతో అవకాశాల్ని సొంతం చేసుకోవాలన్న దాని కంటే కూడా జట్లు కట్టేసి.. రచ్చ చేసేసి పార్టీని ఎమోషనల్ బ్లాక్ చేయాలన్న సీనియర్లకు దిమ్మ తిరిగే షాకిచ్చారు కాంగ్రెస్ నేత కమ్ ఎమ్మెల్యే సీతక్క. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయనేతలకు కొదవ లేదన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా.. రాజకీయాలు మనీ మేకింగ్ మెషిన్లుగా మార్చుకునే నేతలకు భిన్నంగా వ్యవహరించే అతి కొద్ది నేతల్లో సీతక్క ఒకరు.

సాదాసీదా జీవితంతో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నప్పటికీ అలాంటి షోకులు కనిపించని అరుదైన నేతగా సీతక్కకు పేరుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల పేరుతో జరుగుతన్న రచ్చ వేళ.. తన అనూహ్య నిర్ణయంతో ఆమె అందరికి షాకిచ్చారు.

వేరే పార్టీ నుంచి వచ్చిన వారే పదవులు ఇస్తున్నారని.. ఏళ్లకు ఏళ్లుగా పార్టీలో ఉన్న వారిని పట్టించుకోవటం లేదంటూ దరిద్రపుగొట్టు వాదనను తెర మీదకు తీసుకొచ్చిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు రేవంత్ వర్గానికి చెందిన వారు దిమ్మ తిరిగే షాకిచ్చారు. తనను వేలెత్తి చూపిస్తున్న వారి నోట మాట రాని రీతిలో ఎమ్మెల్యే సీతక్క రియాక్టు అయ్యారు.తన పీసీసీ పదవికి రాజీనామా చేసిన ఆమె.. కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను నికార్సైన కార్యకర్తను కాకపోవటంతోనే తాను పార్టీ గురించి బహిరంగంగా విమర్శలు చేయటం లేదన్న పంచ్ ను వేశారు సీతక్క. తమ పదవులు సీనియర్లకు ఆటంకంగా, అసంతృప్తిగా అనిపించాయి కాబట్టే రాజీనామాలు చేశామని  చెప్పిన ఆమె..

''నా రాజీనామాతో పార్టీని ఇబ్బంది పెట్టాలని అనుకోవటం లేదు. వాళ్లకు భయపడి పదవుల్ని వదిలేయలేదు. సీనియర్ల బాధను అర్థం చేసుకొని రాజీనామాలు చేశాం. మేం సంక్షోభాలను క్రియేటే చేయాలనుకోవటం లేదు. మమ్మల్ని నాలుగైదు పార్టీలు తిరిగి వలస వచ్చామని విమర్శలు చేయటం బాధ కలిగింది. అలాంటి విమర్శలు విన్నప్పుడు గుండె తరుక్కుపోతుంది'' అంటూ ఘాటుగా రియాక్టు అయిన ఆమె.. తన పీసీపీ పదవిని పూచిక పుల్లలా తీసి పక్కన పెట్టేశారు.

తన రాజీనామా సందర్భంగా మరింత ఘాటు చురకను ఆమె సంధించారు. గడిచినఏడాదిలో రేవంత్ నాయకత్వంలో చేపట్టిన కార్యక్రమాల్లో మొత్తం ఎంత మంది సీనియర్ నాయకులు పాల్గొన్నారన్న విషయాన్ని చూడాలన్న ఆమె.. 'ఆ లెక్కను ఒక్కసారి చూస్తే విషయం మొత్తం అర్థమవుతుంది. పదవుల పట్ల అసంతృప్తి ఉంటే జాతీయ నాయకత్వంతో తేల్చుకోవాలి. మేం పదవుల కోసం రాలేదు. కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు వచ్చాం. అసత్య ప్రచారాల్ని పట్టుకొని మమ్మల్ని వలస నేతలు అంటారా?' అంటూ సీనియర్లను తన మాటలతో ఉతికి ఆరేశారు. మరి.. సీతక్క వ్యాఖ్యలకు సీనియర్ నేతలు నోరు తెరుస్తారో? మౌనంగా ఉంటారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News