చిక్కుల్లో ఎమ్మెల్యే శ్రీదేవి.. ఆడియో టేప్ కలకలం!

Update: 2020-11-08 13:17 GMT
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చిక్కుల్లో పడ్డారు. ఆమె మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి  తాజాగా ఒక ప్రముఖ న్యూస్ చానెల్ బయటపెట్టింది. సొంత పార్టీ కార్యకర్తలే శ్రీదేవి అక్రమాలు చేస్తోందని.. అవినీతికి పాల్పడుతోందని ఆమె మాట్లాడిన ఒక ఆడియోను లీక్ చేశారని తెలుగు టాప్ న్యూస్ చానెల్ కథనంలో పేర్కొంది. ఈ ఆడియో సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.

సదురు న్యూస్ చానెల్ కథనం ప్రకారం.. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మొట్టమొదటి సారి గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీచేసి గెలిచారు. వైసీపీకి చెందిన నియోజకవర్గ కార్యకర్తలు ఆమెపై పలు ఆరోపణలు చేస్తున్నారని అందులో ఉంది. అవినీతిని  ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే శ్రీదేవి కేసుల  పేరుతో కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

తాడికొండ నియోజకవర్గంలో ఇసుక, లిక్కర్, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ ఎమ్మెల్యే శ్రీదేవి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని నిన్నటి వరకు ఆమె వెంట నడిచిన వారే ఆరోపించారు.  ఈ మేరకు మీడియాతో మాట్లాడిన వారు ఇటీవల అందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా బయటపెట్టారు. స్వయంగా ఎమ్మెల్యే శ్రీదేవి కార్యకర్తలతో ఇల్లీగల్ బిజినెస్ లపై మాట్లాడిన ఆడియో టేపులను ఆమె సొంత పార్టీ కార్యకర్తలే విడుదల చేయడం కలకలం రేపుతోంది. ఇప్పుడీ ఆరోపణలు సంచలనమయ్యాయి.

ఇప్పటిదాకా ఆమె అనుచరులుగా ఉన్న సందీప్, సురేష్ లు పేకాట నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే శ్రీదేవి దూరంగా పెట్టినట్టు చానెల్ పేర్కొంది. అయితే ఎమ్మెల్యే శ్రీదేవి స్వయంగా పేకాట క్లబ్ లపై ఆఫర్ ఉందని.. కార్యకర్తలతో మాట్లాడిన ఆడియోను తాజాగా వారు బయటపెట్టారని చానెల్ తెలిపింది. ఇప్పుడీ ఆడియో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ఆడియోను బయటపెట్టి కార్యకర్తలు ఇప్పుడు సంచలనం రేపారు. ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుడితో మాట్లాడిన ఆడియో టేపు బయటపడడంతో ఆమె చిక్కుల్లో పడ్డారు.

దీనిపై ఎమ్మెల్యే శ్రీదేవి స్పందించారు. తన ఆడియో టేపులంటూ జరుగుతున్న ప్రచారం తప్పు అని.. తన గొంతుతో తప్పుడు ఆడియోలు సృష్టించారని ఎమ్మెల్యే శ్రీదేవి మీడియాకు వివరణ ఇచ్చారు. అంతేకాదు తనకు సురేష్, సందీప్ లతో ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే శ్రీదేవి మీడియాతో తెలిపారు. కొందరు తనపై కుట్రపన్ని ఈ ఆడియో టేపులు సృష్టించారని ఆమె ఆరోపించారు. వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tags:    

Similar News