ఆ రెబెల్ లీడ‌ర్ ఎంట్రీకి స‌ర్వం సిద్ధం

Update: 2017-07-27 07:46 GMT
త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ రాజ‌కీయం మ‌రోమారు ర‌స‌కందాయంలో ప‌డేలా క‌నిస్తోంది. పార్టీ చీలిక ర‌చ్చ ముగిసి ఏకతాటికి వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌క‌పోవ‌డంతో రెబ‌ల్ నేత త‌న చ‌ర్య‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమితులవ‌గా...అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్లటంతో పార్టీ ఉప కార్యదర్శిగా దినకరన్‌ బాధ్యతలు స్వీకరించిన సంగ‌తి తెలిసిందే. అయితే రెండాకుల చిహ్నాన్ని పొందేందుకు ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో దినకరన్‌ అరెస్టు అయ్యారు. తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన దినకరన్‌ మళ్లీ పార్టీ పనులలో పాల్గొంటానని ప్రకటించారు. కానీ కొన్నాళ్లపాటు కాస్త వెనక్కి తగ్గారు.

అయితే ఈ స‌మ‌యంలోనే అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు విలీనం అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఈ ఎపిసోడ్‌ ను గ‌మ‌నించిన దిన‌క‌ర‌న్ అన్నాడీఎంకే రెండు వర్గాల విలీనానికి 60 రోజులు వేచి ఉంటానని చెప్పారు. అనంతరం పార్టీ పనులలో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. ఈ నేపథ్యంలో రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఇంతవరకు రాలేదు. బెసంట్‌ నగర్‌ లోని ఆయన ఇంట్లో పార్టీ నిర్వాహకులు - ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ఆయన పెట్టిన గడువు ఆగస్టు 5వ తేదీతో ముగియనుంది. ఇచ్చిన గడువు పూర్తి కాబోతున్నందున టీటీవీ దినకరన్‌ వచ్చే నెల కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. రాయపేటలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి దిన‌క‌రన్ ఆగ‌స్టు 5వ తేదీన వచ్చి పార్టీ పనులలో నిమగ్నమవుతారని ఎమ్మెల్యే తంగ తమిళ్‌ సెల్వన్‌ పేర్కొన్నారు.

ఆగ‌స్టు 5న ప్రధాన కార్యాలయానికి వచ్చి పార్టీ కార్యకలాపాల్లో దినకరన్‌ పాల్గొంటారని ఆయ‌న వ‌ర్గానికి చెందిన  ఆండిపట్టి ఎమ్మెల్యే తంగ తమిళ్‌ సెల్వన్‌  చెప్పారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నాయకులు, కార్యకర్తలను కలిసేందుకు అవకాశం ఉందని తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌కు దిన‌క‌ర‌న్ సిద్ధ‌మ‌య్యే స‌మ‌యంలోనే ఆయ‌న వెంట మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం, ప్ర‌స్తుత సీఎం ప‌ళ‌నిస్వామి వ‌ర్గంలోని ప‌లువ‌రు ఎమ్మెల్యేలు, నేత‌లు నడిచే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News