రేవంత్ చెప్పినా విష్ణులో చ‌ల‌నం లేదా..!

Update: 2021-12-07 06:35 GMT
జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని.. కార్య‌క‌ర్త‌ల‌కు మొహం చాటేస్తున్నాడ‌ని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ఎన్నిక‌ల స‌మ‌యంలోనే బ‌య‌ట క‌నిపిస్తాడ‌ని.. తండ్రి పేరు చెప్పుకొని టికెట్ తెచ్చుకొని ఓడిపోతుంటాడ‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో కూడా ఉంద‌ని చెప్పుకుంటున్నాయి. రాజ‌కీయాల ప‌ట్ల సీరియ‌స్‌నెస్‌గా ఉంటున్నాడ‌ని.. ఇది గ‌మ‌నించి రేవంత్‌రెడ్డి ప‌లు సూచ‌న‌లు చేసినా విష్ణులో చ‌ల‌నం లేద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం.

దివంగ‌త మ‌హా నేత పి జ‌నార్ద‌న్‌రెడ్డి త‌న‌యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి. దేశంలోనే అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఖైర‌తాబాద్ నుంచి ఐదు సార్లు గెలిచి త‌న స‌త్తా ఏమిటో చాటుకున్నారు జ‌నార్ద‌న్‌రెడ్డి. 1978 నుంచి కాంగ్రెస్ పార్టీతోనే రాజ‌కీయ జీవితం ప్రారంభించి.. మ‌ర‌ణించే వ‌ర‌కు కూడా ఆ పార్టీనే అంటిపెట్టుకున్నారు.

వివిధ మంత్రిత్వ శాఖ‌లు నిర్వ‌హించారు. ఒక‌సారి సీఎల్పీ లీడ‌ర్‌గా కూడా ప‌నిచేశారు. కార్మిక మంత్రిగా పేదల‌కు గుర్తుండిపోయే ప‌నులు చేసి ప్ర‌జ‌ల మ‌నిషిగా పేరు తెచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ గుడి నిర్మాణం కూడా పీజేఆర్ ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగింది.

పీజేఆర్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రాక‌ముందు ప‌లు కార్మిక సంఘాల అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. అప్పుడు కార్మికుల‌కు త‌ల‌లో నాలుకగా ఉండేవారు.

కార్మిక మంత్రిగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని వేల మంది ప్ర‌జ‌ల‌కు ఇళ్లు క‌ట్టించి వాళ్ల మ‌న‌సులో చిర‌స్థాయిగా నిలిచిపోయారు. ఆ ప్రేమ‌తోనే ఆయ‌న‌ను ఖైర‌తాబాద్ నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు గెలిపించుకున్నారు ప్ర‌జ‌లు. 2007లో బోయిన్‌ప‌ల్లిలో నిర్వ‌హించిన పార్టీ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు వెళుతుండ‌గా గుండెపోటు వ‌చ్చి మ‌ర‌ణించారు.

2008లో తండ్రి మ‌ర‌ణంతో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో ఖైర‌తాబాద్ నుంచి విష్ణువర్ద‌న్‌రెడ్డి విజ‌యం సాధించారు. ఇక్క‌డ విష్ణు గెలుపు కంటే తండ్రిపై జ‌నాలు చూపించిన అభిమాన‌మే కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. ఆ త‌ర్వాత 2009లో జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో ఖైర‌తాబాద్ నుంచి జూబ్లీహిల్స్ విడిపోయి ప్ర‌త్యేక నియోజ‌క‌వ‌ర్గంగా ఏర్ప‌డింది.

2009లో కొత్త‌గా ఏర్ప‌డిన జూబ్లీహిల్స్ నుంచి విష్ణు కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి గెలిచారు. అప్ప‌టి నుంచి విష్ణు నియోజ‌క‌వ‌ర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. అయినా 2014, 2018 ఎన్నిక‌ల్లో టీడీపీ, టీఆర్ఎస్ నుంచి బ‌రిలో దిగిన మాగంటి గోపీనాథ్ చేతిలో ప‌రాజ‌యం పొందారు. ఇది విష్ణు స్వ‌యంకృత‌మే కార‌ణమ‌ని పార్టీ శ్రేణులు చ‌ర్చించుకుంటున్నాయి.

ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలోనే బ‌య‌ట‌కు వ‌స్తాడ‌ని.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ముఖం చాటేస్తాడ‌ని.. సీరియ‌స్ పొలిటీషియ‌న్ కాద‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవ‌ల రేవంత్ తెలంగాణ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టాక ఒక‌సారి విష్ణును క‌లిసి ప్రోత్స‌హించారు.

అయినా కూడా విష్ణు సీరియ‌స్ రాజ‌కీయాలు చేయ‌డం లేద‌ని.. ఇలాగైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఎదురుదెబ్బ‌లు త‌గిలే అవ‌కాశం ఉంద‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉన్నందున విష్ణు ఇప్ప‌టికైనా మేల్కోవాల‌ని.. ప్ర‌జ‌ల్లో తిరిగి భ‌రోసా ఇవ్వాల‌ని కార్య‌క‌ర్త‌లు వేడుకుంటున్నారు.
Tags:    

Similar News