వైసీపీ ఎమ్మెల్యేపై సీఎం జగన్ కు షాకింగ్ నివేదిక!?

Update: 2021-08-10 10:30 GMT
తిరుగులేని అధిక్యతతో.. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటం ద్వారా హిస్టరీని క్రియేట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నాటి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో ఉన్న ఆయన.. మంత్రులు.. పార్టీ ఎమ్మెల్యేల పని తీరు గురించి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు. అధికారం చేతికి వచ్చిన తర్వాత పార్టీ నేతల పని తీరు ఎలా ఉంది? నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి సమాధానంగా తాను తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థను వినియోగించిన ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేల పని తీరుపై సమాచారాన్ని సేకరించినట్లుగా చెబుతున్నారు.

ప్రభుత్వం పవర్లోకి వచ్చి రెండేళ్లు అయిన నేపథ్యంలో ఎమ్మెల్యేల పనితీరుపై రూపొందించిన నివేదిక తాజాగా తాడేపల్లికి చేరినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికలోని అంశాలు షాకింగ్ గా మారాయి. కొన్నినియోజకవర్గాల్లో మంత్రుల కుమారులు.. ఎమ్మెల్యే పిల్లలు దూకుడుగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు బయటకు వచ్చాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే సోదరుడు చెలరేగిపోతున్నారని.. తమ పరిధిలో ఎక్కడ ఏ పని జరగాలన్నా కప్పం చెల్లించాలని పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు.

అదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎంపీ.. వారి పిల్లలు కూడా ఇదే రీతిలోనే వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అనంతపురం.. కర్నూలు జిల్లాలకు సంబంధించిన మంత్రులు.. పలువురు ఎమ్మెల్యేల కుటుంబాల మీద కూడా నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లుగా నివేదికలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎమ్మెల్యేకు తెలీకుండా ఏమీ జరగదని.. అన్ని వారి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లుగా ముఖ్యమంత్రి సలహాదారు ఒకరు వివరించినట్లుగా చెబుతున్నారు.

మంత్రులు.. ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న విషయంపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికి కౌన్సిలింగ్ చేయటం ద్వారా దారికి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.త్వరలో జిల్లాల వారీగా నేతలతో ముఖ్యమంత్రి మాట్లాడతారన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News