మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల తిరుగుబావుటా.. ప్రత్యేకంగా ఐదుగురి భేటీ

Update: 2022-12-19 08:41 GMT
ప్రస్తుతం రాజకీయాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యేలదే పెత్తనం.. జిల్లాలపై అయితే మంత్రులది పట్టు.. ఇలాంటి నేపథ్యంలో సీనియర్లు ఉన్నచోట చాలా వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి. అధికారంలో ఇలాంటి సహజమని సరిపెట్టుకున్నా.. కొన్నిసార్లు విభేదాలు వీధినపడుతుంటాయి. అలాంటి ఆధిపత్య పోరే ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో నెలకొంది.

ఆ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మల్కాజిగిరి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాష్‌రెడ్డి, వివేకానంద్‌, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు ఈ భేటీలో పాల్గొన్నారు.

దూలపల్లిలోని మైనంపల్లి నివాసంలో ఈ సమావేశం జరిగింది. దీనికి ఎమ్మెల్యేల పీఏలు సహా అత్యంత సన్నిహితులను కూడా దూరంగా ఉంచినట్లు తెలిసింది. పార్టీ పదవులు, నియోజకవర్గ అభివృద్ధి విషయాల్లో మంత్రి మల్లారెడ్డి వైఖరిపై వారంతా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు సమావేశమై ఆయా అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

4 ఇతర పార్టీల వారే..

కాగా, మల్లారెడ్డిపై తిరుగుబావుటా ఎగురవేసిన వారిలో నలుగురు ఇతర పార్టీల వారే. మైనంపల్లి హనుమంతరావు మెదక్ జిల్లాలో టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడినుంచి ఎమ్మెల్యేగానూ గెలిచారు. 2014 తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. కూన వివేకానంద, గాంధీ, మాధవరం కూడా టీడీపీ నుంచి వచ్చినవారే. అయితే, మారిన పరిస్థితుల్లో వీరు టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ గాలికి తోడు సొంత బలంతో మరోసారి కూడా గెలిచారు.

అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే.. వీరు మంత్రి మల్లారెడ్డితోటే టీడీపీలో వీరు కొనసాగారు. 2014 తర్వాత మల్లారెడ్డి సహా వీరంతా కలిసే టీఆర్ఎస్ లో చేరారు. ఇంతలో మరి ఎక్కడ చెడిందో కానీ.. ఆయనతో విభేదించారు. ఆయన ఒక్కరే బీఆర్ఎస్ మల్లారెడ్డిపై తిరుగుబావుటా ఎగురవేసిన వారిలో బేతి సుభాష్ రెడ్డి ఒక్కరే తొలినుంచి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) లో ఉన్నారు. ఉప్పల్ నుంచి 2018లో గెలిచారు. అంతకుముందు ఓడినా పార్టీనే నమ్ముకుని ఉన్నారు.

అటువైపు చూస్తే.. మల్లారెడ్డి సహా టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరినవారిలో మల్లారెడ్డి ఒక్కరినే మంత్రి పదవి వరించింది. ఆనేక సమీకరణాల్లో మైనంపల్లికి పదవి రాలేదు. గాంధీదీ అదే పరిస్థితి. మాధవరంనకు సామాజిక సమీకరణాలు అడ్డొచ్చాయి. వివేకానంద పార్టీలో కీలకంగా ఉన్నా.. అమాత్య యోగం దక్కాల్సి ఉంది. వ్యక్తిగతం అంటూ మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేల సమావేశం మీడియాలో సంచలనంగా మారుతోంది. అయితే, దీనిని వారు పూర్తి వ్యక్తిగతంగా చెప్పుకొంటున్నారు. ఇదే విషయం మీడియా ప్రతినిధులకూ చెబుతున్నారు. కానీ, పీఏలను కూడా రానివ్వకుండా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చూద్దాం.. ఈ విషయం ఎంత వరకు వెళ్తుందో..? బీఆర్ఎస్ అధిష్ఠానం ఏం చెబుతుందో..?    




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News