ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఇప్పటికైతే గులాబీ అధిక్యమే

Update: 2021-03-19 05:45 GMT
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఒక కొలిక్కి వచ్చినట్లే. నల్గొండ.. ఖమ్మం.. వరంగల్ (నల్గొండ) స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయ్యింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది. అదే సమయంలో హైదరాబాద్ .. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ (హైదరాబాద్) జిల్లాలకు జరిగిన ఎన్నిక ఓట్ల లెక్కింపు ఆరోరౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి.

ఇప్పటివరకు వెల్లడైన ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. హైదరాబాద్ తో పోలిస్తే నల్గొండలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా మంచి అధిక్యతలో ఉండగా.. హైదరాబాద్ ఎన్నికలో మాత్రం కాస్త తక్కువగా ఉన్నారు. హైదరాబాద్ ఎన్నికలో రౌండ్ రౌండ్ కు చెల్లని ఓట్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆరో రౌండ్ పూర్తి అయ్యేసరికి.. 19914 ఓట్లు కావటం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి వచ్చిన 29627(ఆరో రౌండ్ కు) ఓట్లకు దగ్గర దగ్గరగా చెల్లని ఓట్లు ఉండటం విశేషం.

చెల్లని ఓట్లలో ఎక్కువగా టీఆర్ఎస్ కు పడాల్సినవేనని చెబుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి నెంబరు 4 కావటం.. ఆమెకు ఒక్కరికే ఓటు వేయాలన్న ఉద్దేశంతో.. ఆమె పేరు ఎదుట ‘‘1’’ వేయాల్సింది కాస్తా పొరపాటున ‘‘4’’ నెంబరు వేయటంతో.. ఓటు మురిగిపోయింది. చెల్లని ఓట్లలో ఎక్కువగా ఇలాంటి తప్పే జరిగిందంటున్నారు.

మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలని నేపథ్యంలో.. రెండో ప్రాధాన్యత క్రమంలో లెక్క తేల్చనున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం నల్గొండలో పల్లా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే అధిక్యత ఎక్కువగా ఉండటంతో.. రెండో ప్రాధాన్యత ఓట్లలో పల్లాను అధిగమించాలంటే ఆయన ఇప్పటికే వచ్చిన ఓట్లను దాటి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టమని చెబుతున్నారు.

ఇక.. హైదరాబాద్ స్థానం లెక్కనే ఆసక్తికరంగా మారింది. క్రమపద్దతిలో రౌండ్ .. రౌండ్ కు కొంచెం చొప్పున అధిక్యత పెంచుకుంటూ వెళుతున్న వాణిదేవికి.. ఆరో రౌండ్ ముగిసే సరికి.. ఏడు వేల చిల్లర ఓట్ల అధిక్యత ఉంది. ఇంత స్వల్ప అధిక్యత.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో లెక్క తేడా కొట్టేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలైన రెండు.. మూడు గంటలకు ట్రెండ్ ఎలా ఉందన్న విషయంపై క్లారిటీ వచ్చే వీలుందని చెబుతున్నారు.
Tags:    

Similar News