ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ పేలింది

Update: 2015-11-02 08:09 GMT
ఇవాల్టి రోజున ఏం ఉన్నా లేకున్నా.. చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఉండని వారు కనిపించరు. మనిషి శరీరంలో ఒక భాగంగా మారిపోయిన సెల్ ఫోన్ ఇప్పుడు ప్రాణావసరంగా మారిపోయిన పరిస్థితి. అయితే.. ప్రాణావసరంగా మారిన సెల్ ప్రాణాల్నే తీసిన దురదృష్టకర సంఘటన తాజాగా చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పాలెం తండాలో ఛార్జింగ్ పెడుతుండగా సెల్ ఫోన్ పేలి పోవటంతో ఒక యువకుడు ఘటనాస్థలంలోనే మరణించాడు.

ఛార్జింగ్ పెట్టేందుకు మోహన్ అనే యువకుడు ప్రయత్నించారు. ఛార్జింగ్ పెట్టేంతలో ఫోన్ ఒక్కసారిగా పేలిపోవటం.. ఫోన్ కి అత్యంత సమీపంలో ఉండటంతో మోహన్ అక్కడికక్కడే మరణించిన దుస్థితి. ఊహించని ఘటనతో షాక్ తిన్న స్థానికులు విషాదంలోకి మునిగిపోయారు. ప్రాణవాయువుగా మారిన సెల్ ఫోన్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణం తీస్తుందన్న విషయం తాజా ఘటన రుజువు చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ని అలానే ఉంచి మాట్లాడటం.. తడి చేతులతో ఛార్జింగ్ పెట్టే ప్రయత్నం చేయటం.. వైరింగ్ సరిగా లేని చోట్ల ఛార్జింగ్ చేయటం.. చార్జింగ్ పెట్టిన ఫోన్లు విపరీతంగా వేడెక్కిపోతుంటే వాటిని అదే పనిగా వాడటం లాంటివి చేయకూడదని చెబుతున్నారు. సెల్ ఫోన్ ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని.. నిర్లక్ష్యం అస్సలు ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్ తో ఏమైనా చేయొచ్చు. అదే సమయంలో సెల్ ఫోన్ మనల్ని ఏమైనా చేస్తుందన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు సుమా.
Tags:    

Similar News