కరోనా ఎఫెక్ట్: దేశంలో పనిచేయని 4 కోట్ల మొబైళ్లు

Update: 2020-04-25 13:45 GMT
కరోనా వైరస్ తో మనుషుల ప్రాణాలే కాదు.. చాలా రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ తో ఉద్యోగ, ఉపాధి పోయి కోట్ల మంది రోడ్డున పడ్డారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చేసింది.

లాక్ డౌన్ తో కరోనా కేసులు కట్టడి అయినా దాని పర్యవసనాలు మాత్రం దారుణంగా ఉండబోతున్నాయి. కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. లాక్ డౌన్ ఇలాగే కొనసాగితే మే నెలాఖరు నాటికి దేశంలోని 4 కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు మాయం కానున్నాయని ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ (ఐసీఈఏ) సంచలన విషయాన్ని తెలిపింది.

లాక్ డౌన్ తో మొబైల్ షాపులు, రిపేర్ షాపులు, ఆన్ లైన్ ఈకామర్స్ సంస్థలను మూసివేశారు. దీంతో ఇప్పటికే మొబైళ్లలో లోపాలు, బ్రేక్ డౌన్ లు, పనిచేయని వాటిని పక్కనపడేశారు. వాటి స్థానంలో కొత్తవి కొందామంటే షాపులన్నీ బంద్ చేసి ఉన్నాయి. ఇక విడిభాగాల విక్రయాలు లాక్ డౌన్ లో లేక చాలా మంది మొబైళ్లు మూగబోయాయి.

ఇప్పటికే లాక్ డౌన్ తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు 2.5 కోట్ల మంది ఫోన్లు నిరుపయోగంగా మారాయని ఐసీఈఏ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 85 కోట్ల మొబైల్ ఫోన్లు ఉన్నాయని.. ప్రతీ నెలకు 2.5 కోట్ల అమ్మకాలు జరిగేవని తెలిపారు.

మే నెలాఖరు నాటికి 4కోట్ల మొబైళ్లు దేశంలో పనిచేయని పరిస్థితి తలెత్తనుంది. దీంతో నిత్యావసరాలుగా అత్యవసర జాబితాలో మొబైల్ ఫోన్లను గుర్తించి మొబైల్ విక్రయాలు, విడిభాగాల విక్రయాలకు అనుమతి ఇవ్వాలని ఐసీఈఏ సూచించింది.
Tags:    

Similar News