మన్మోహన్ బాబులకు ఉన్న దమ్ము మోడీ జగన్ లకు లేదా...?

Update: 2022-07-27 11:30 GMT
కేంద్రంలో నరేంద్ర మోడీ. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఇద్దరూ ఒక విషయంలో మాత్రం కచ్చితంగా గట్టి పోలికకు సరితూగుతారు. ఈ ఇద్దరు మీడియాతో దూరం బాగా పాటిస్తారు. ఈ ఇద్దరూ ఇప్పటిదాకా  మీడియాని ఫేస్ చేసి ఎరగరు. మరి ఒకరు దేశాధినేత. మరొకరు రాష్ట్రాధినేత. ఈ ఇద్దరి మీద మీడియా మొత్తం ఫోకస్ చేస్తూ ఉంటుంది. వారు చెప్పే  విషయాలను తెలుసుకోవాలని కోట్లాదిమంది చూస్తూ ఉంటారు.

కానీ ఎందుకో ఈ ఇద్దరూ మీడియాను చూసేందుకు ఇష్టపడరని చెబుతారు. మోడీ కేంద్రంలో ఎనిమిదేళ్లుగా ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఆయన తన ప్రధాని పదవిలో మీడియాను ఏనాడూ ఫేస్ చేసి ఎరగరు. ఒక్క డైరెక్ట్ ప్రెస్ మీట్ లేదంటే లేదు అని చెప్పాలి. ముందుగా నిర్ణయించిన మేరకు ప్రశ్నలు మాత్రమే మోడీకి ఇస్తారు. దాన్ని మాత్రమే మీడియా అడగాలి.

ఇదిలా ఉంటే జగన్ సైతం తన మూడేళ్ల పదవీ కాలంలో మీడియాను అసలు ఫేస్ చేయలేదు. ఇది జగన్ మీద ఉన్న అతి పెద్ద కంప్లైంట్. ఇక్కడ ఒక చిత్రం చెప్పుకోవాలి. జగన్ ఒక మీడియాకు అధిపతి. మరి మీడియా గురించి అన్నీ తెలిసిన మనిషిగా ఆయన ఉన్నారు. కనీసం తన సొంత మీడియాకు కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వలేదు అని చెప్పాలిక్కడ.

జగన్ బయటకు వస్తారు బహిరంగ సభలలో మాట్లాడతారు. అలాగే ఆయన సమీక్షా సమావేశాలలో అధికారులతో మాట్లాడినా మంత్రి వర్గంలో మాట్లాడినా దాన్ని బ్రీఫింగ్ చేసి మీడియకు వేరే వాళ్ళు ఇస్తారు తప్ప జగన్ మీడియాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎరగరు. మరో వైపు చూస్తే జగన్ సీఎం అయ్యాక పలు మార్లు ఢిల్లీకి వెళ్లారు. ఆయన ప్రధానిని, ఇతర కేంద్ర మంత్రులను పెద్దలను కలుస్తూ వచ్చారు. అయితే ఆయన వారితో ఏం మాట్లాడిందీ సీఎం ఆఫీస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం తప్ప జగన్ నేరుగా మీడియాకు ఏ విషయం చెప్పిన దాఖలాలు ఇప్పటిదాక లేదు.

మరి వీరిద్దరికీ ముందు పనిచేసిన వారి తీరు చూస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది. మోడీకి ముందు పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ అయితే ఎన్నో సార్లు మీడియాతో మాట్లాడారు. డైరెక్ట్ ప్రెస్ మీట్లు అనేకం ఆయన నిర్వహించారు. మీడియా నుంచి ఏ రకమైన ప్రశ్నలు వచ్చినా దానికి ధీటైన సమాధానం ఆయన చెబుతూ వచ్చారు.

అదే విధంగా చంద్రబాబు. ఆయనకు మీడియా బేబీ అన్న పేరు ఎటూ ఉంది. మీడియాతో ఎక్కువ సేపు గడిపేందుకు ఆయన ఇష్టపడతారు. తనకు వ్యతిరేకంగా ప్రశ్నలు ఎవరు అడిగినా కూడా ఆయన గట్టిగా జవాబు చెప్పగలరు, తనను తాను సమర్ధించుకోగలరు. ఒక విధంగా తన టాలెంట్ ని ఎక్కువగా మీడియా ముందు చూపించిన నేతగా చంద్రబాబు ఉంటారు. మీడియాలో బాబుకు ఉన్నంత కవరేజి హైప్ వేరే నాయకుడికి ఉండదు అంటే ఆయనకు మీడియాతో ఉన్న బంధం అలాంటిది మరి అనుకోవాలి.

మరి ఆ ఇద్దరితో పోలిస్తే మోడీ కానీ జగన్ కానీ ఎందుకు మీడియాకు ముఖం చాటేస్తారు అన్న ప్రశ్న వస్తుంది. ఈ ఇద్దరూ మీడియాతో మాట్లాడే దమ్ము లేదా అన్న ప్రశ్న కూడా వస్తోంది. మొత్తానికి చూస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టం. మీడియా అటు జనాలకు ఇటు నాయకులకు వారధి. దాన్ని ప్రభుత్వ అధినేతలు ఎంతగా ఉపయోగించుకుంటే అంతగా జనాలకు అనేక విషయాలు తెలుస్తాయి. ఈ విషయంలో మోడీ జగన్ ఆలోచనలు ఏమిటో మరి అన్న మాట అయితే వినిపిస్తోంది.
Tags:    

Similar News