మోడీ రాక‌.. చంద్ర‌బాబుకు ప్రాధాన్యం ద‌క్కేనా..?

Update: 2022-11-10 03:54 GMT
ప్ర‌స్తుతం ఇదో హాట్ టాఫిక్‌. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఈ నెల 11న విశాఖ‌ప‌ట్నానికి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో కీల‌క‌మైన నాయ‌కుడు.. మాజీ సీఎం చంద్ర‌బాబుకు ప్రాధాన్యం ద‌క్కుతుందా?  లేదా? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. కొన్ని రోజుల కింద‌ట ఆయ‌న ప్ర‌ధానిన‌రేంద్ర మోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేవ‌లం ఒక్క నిముషమే మోడీతో మాట్లాడేందుకు అవ‌కాశం ల‌భించింది. అయితే.. ఈ సంద‌ర్భంగా మోడీ.. మీరు త‌ర‌చుగా ఢిల్లీకి రావాల‌ని చంద్ర‌బాబుకు చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే..ఇది జ‌రిగి నాలుగు మాసాలు గ‌డిచినా చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు కూడా మోడీని క‌లుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. కానీ, ఇప్పుడు ప్ర‌ధాని నేరుగా విశాఖ‌కు వ‌స్తున్నారు. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మా ల‌కు శంకుస్థాప‌న కూడా చేస్తున్నారు.

ఇలాంటి నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు ఆహ్వానం అందుతుందా?  అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ఇప్పుడు ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లి వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నా యి.

ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తికి ప్ర‌ధాని మోడీనే శంకుస్థాప‌న చేశారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు దాని విష యంలో ఆయ‌న ప‌ట్టించుకోలేదు. మరోవైపు మూడు రాజ‌ధానులు అంటూ వైసీపీ ప్ర‌భుత్వం హ‌డావుడి చేస్తోంది. దీంతో ఏపీలో ఏం జ‌రుగుతోంద‌నే విష‌యంపై కేంద్రం కూడా ఆరాతీసింది. అయిన‌ప్ప‌టికీ.. మూడు రాజ‌ధానుల విష‌యంపై ఇప్ప‌టి వ‌రకు ఎలాంటి ప్ర‌క‌ట‌నా జారీ చేయ‌లేదు. మ‌రి ఈ విష‌యంలో కేంద్రం ఉద్దేశం ఏంటి? ఏంచేయాల‌ని అనుకుంటోంద‌నేది ఇప్ప‌టికీ చ‌ర్చ‌గానే ఉంది.

ఇప్పుడు మోడీనే ఏపీకి వ‌స్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు ఆహ్వానం ఉంటుందా? ఉండ‌దా? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం ప్ర‌ధాని అధికారిక కార్య‌క్ర‌మాల‌పైనే వ‌స్తున్నా.. ఆయ‌న ఒక రాత్రి విశాఖ‌లోనే ఉండ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుతో ఆయ‌న చ‌ర్చించే అవ‌కాశం ఉంటుంద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, బీజేపీ వ‌ర్గాలు మాత్రం ఎలాంటి అప్పాయింట్‌మెంట్ లేద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. అప్పాయింట్‌మెంట్ ఇస్తే.. మాత్రంటీడీపీకి పండ‌గ వ‌చ్చిన‌ట్టేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News