ప్రొటోకాల్ ప‌క్క‌న‌పెట్టిన మోడీ...ఢిల్లీ చౌక్ పేరు మార్పు

Update: 2018-01-15 01:15 GMT
ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ ప్రొటోకాల్ పక్క‌న‌పెట్టేశారు. దానికి విరుద్ధంగా ఢిల్లీలోని విమానాశ్రయానికి స్వయంగా వెళ్లి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారాకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో చేతులు కలిపారు. ఆలింగనం చేసుకున్నారు. అనంతరం చేతులు పట్టుకొని అభివాదం చేశారు. ఇజ్రాయిల్ ప్ర‌ధాని ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆయన భారత్‌కు చేరుకున్నారు. ఆయన వెంట భార్య సారా, ముంబై ఉగ్రదాడి(26/11)లో తల్లిదండ్రులను కోల్పోయిన యూదు బాలుడు 11 ఏళ్ల‌ మోషె హాల్ట్స్‌బర్గ్, ఇజ్రాయెల్ వ్యాపారులు ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని భారత్ పర్యటనకు రావడం పదిహేనేళ్ల‌ తర్వాత ఇదే మొదటిసారి. 2003లో అప్పటి ప్రధాని ఏరియిల్ షరోన్ భారత్‌లో పర్యటించారు.

భారత్ ప్రపంచ శక్తి అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కితాబునిచ్చారు. వ్యాపార, భద్రత, సాంకేతిక, పర్యాటక రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. గత ఏడాది మోడీ ఇజ్రాయెల్‌లో పర్యటించిన తర్వాత వీరి మధ్య సత్సంబంధాలు మరింత మెరుగయ్యాయి. నెతన్యాహు 130 మంది వాణిజ్య ప్రతినిధులతో కలిసి భారత్ పర్యటనకు వచ్చారు. నెతన్యాహు ఆదివారం రాత్రికి మోడీ ఇచ్చిన విందులో పాల్గొన్నారు.

`మిత్రమా.. భారత్ గడ్డపై కాలు మోపినందుకు శుభాకాంక్షలు. మీ చారిత్రక పర్యటన మమ్మల్ని ఆనందంలో ముంచెత్తింది. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి మీ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుంది` అని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.'స్యయంగా విచ్చేసి నాకు స్వాగతం పలికిన ఆప్త మిత్రుడు మోడీకి ధన్యవాదాలంటూ నెతాన్యాహూ ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఆయన ఇచ్చిన స్వాగతం నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఉభయదేశాల మధ్య సబంధాలను ఇద్దరం కలిసి సరికొత్త ఎత్తులకు తీసికెళ్తాం' అని ఆ ట్వీట్‌లో నెతన్యాహు పేర్కొన్నారు. అంతకుముందు ఇజ్రాయెల్ నుంచి బయలుదేరేముందు నెతన్యాహు జెరూసలేంలో విలేకరులతో మాట్లాడుతూ భారత్ పర్యటనలో భాగంగా పలు అంశాలపై చర్చించడంతోపాటు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేస్తాయి అని చెప్పారు. తన పర్యటన వల్ల ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడుతాయని, ఇజ్రాయెల్ భవిష్యత్త్‌కు కూడా ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

కాగా, భారత్ పర్యటన సందర్భంగా నెతన్యాహు ఢిల్లీ, ఆగ్రా, గుజరాత్, ముంబై ప్రాంతాల్లో పర్యటించనున్నారు. గుజరాత్ పర్యటన సందర్భంగా మోడీ, నెతన్యాహు రోడ్ షో నిర్వహించనున్నారు. ముంబైలో 26/11 ఉగ్రదాడి ప్రాంతాన్ని కూడా నెతన్యాహు సందర్శిస్తారు. ఇజ్రాయెల్ అధికార వర్గాలు మాట్లాడుతూ భారత్‌తో భాగస్వామ్యంలో భాగంగా రానున్న నాలుగేండ్లలో ఇజ్రాయెల్ 68.6 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టనుందని వివరించాయి.

ఇదిలా ఉండ‌గా...ఇజ్రాయిల్ ప్ర‌ధానికి మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌రో తీపి క‌బురు అందించారు. ఢిల్లీలోని తీన్‌మూర్తి చౌక్ పేరు.. ఇజ్రాయెల్‌లోని హైఫా నగరం పేరును కలుపుకొని తీన్‌మూర్తి హైఫా చౌక్‌గా మారింది. ఆదివారం ప్రధాని మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ మేరకు తీన్‌మూర్తి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని పేరు మార్పునకు శ్రీకారం చుట్టారు. అనంతరం అక్కడే ఉన్న సందర్శక పుస్తకంలో సంతకాలు చేశారు. శతాబ్దం కిందట ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంలో జరిగిన యుద్ధంలో అద్భుతంగా పోరాడిన భారత్‌లోని హైదరాబాద్, జోద్‌పూర్, మైసూర్‌లకు చెందిన ముగ్గురు అశ్వికదళ సభ్యుల విగ్రహాలను ఢిల్లీలో ఏర్పాటుచేశారు. ఈ ప్రదేశాన్ని తీన్‌మూర్తి చౌక్‌గా పిలుస్తారు.
Tags:    

Similar News