యాదగిరి గుట్టలో మోడీ...

Update: 2016-04-06 10:01 GMT
తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం విశేష ప్రాధాన్యంగా తీసుకుని అభివృద్ధి చేస్తున్న యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అనుకోని అతిథి వచ్చారు. బుధవారం యాదగిరి గుట్టను మోడీ సందర్శించి ఆలయంలో పూజలు చేశారు. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా... ప్రధాని మోడీ వస్తే హడావుడి లేకపోవడమేంటనుకుంటున్నారా... పాకిస్థాన్ ను ఆకస్మికంగా పర్యటించినట్లుగా యాదగిరి గుట్టలో కూడా ఆకస్మికంగా పర్యటించారా అనుకుంటున్నారా...? అదేం కాదు... ఈ మోడీ ప్రధాని మోడీ కాదు. ప్రధాని మోడీకి సోదరుడైన ప్రహ్లాద్ మోడీ. అవును... ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ బుధవారం యాదగిరి గుట్ట ఆలయానికి వచ్చారు.
    
తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలోని శ్రీలక్ష్మి నరసింహస్వామిని ప్రధాన మంత్రి సోదరుడు ప్రహ్లాద్ మోదీ బుధవారం దర్శించుకోగా ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ, యాదాద్రికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా ఈ పుణ్య క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
    
కాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే యాదాద్రిని భారీ స్థాయిలో అభివృద్ధి చేయడానికి కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఈ ఆలయంపై దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ కారణంగా ఇప్పటికే యాదగిరి నరసింహుని ఆలయానికి మునుపటి కంటే ఆదరణ పెరిగింది. ప్రముఖులు, ఇతర రాష్ట్రాల భక్తులు పెరిగితే పర్యాటకంగానూ ఇది మరింతగా పాపులర్ కావడం ఖాయం.
Tags:    

Similar News