అధ్యాత్మిక ప్రోగ్రాంకు వచ్చి తెలుగు సినిమాను ప్రశంసించటమా?

Update: 2022-02-06 03:30 GMT
హాజరయ్యే ప్రోగ్రాంకు అనుగుణంగా ప్రసంగం ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరించారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులోని ముచ్చింతలో ఏర్పాటు చేసిన భారీ రామానుజుడి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు విచ్చేసిన మోడీ.. ప్రసంగించారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆ విగ్రహానికి పూజలు చేసిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన వేదిక మీద ప్రసంగించారు.

తన ప్రసంగంలో అనూహ్యంగా తెలుగు సినిమా ప్రస్తావన తీసుకొచ్చి ఆశ్చర్యానికి గురి చేశారు. సాధారణంగా తాము ఏ తరహా కార్యక్రమానికి హాజరైతే.. అందుకు తగ్గట్లుగా మాట్లాడటం చేస్తుంటారు ప్రముఖులు. అందుకు భిన్నంగా ప్రధాని మోడీ మాత్రం.. తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తావన తీసుకురావటం విశేషం. రామానుజుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన వేళలో.. తెలుగు సినిమాపై ప్రధాని బోలెడన్ని ప్రశంసలు కురిపించారు.

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందన్న ఆయన.. సిల్వర్ స్క్రీన్ మీద తెలుగు సినిమా అద్భుతాల్ని క్రియేట్ చేస్తుందని వ్యాఖ్యానించారు. సిల్వర్ స్కీన్ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. తెలుగు భాష.. చరిత్ర ఎంతో సుసంపన్నమైనదన్నారు. అధ్యాత్మిక వేదిక మీద తెలుగు సినిమా ప్రస్తావన తీసుకురావటం సినీ వర్గాల్ని ఆనందంతో ముంచెత్తేసింది. సాధారణంగా తాను హాజరైన కార్యక్రమానికి తగ్గట్లు మాట్లాడే ప్రధాని నరేంద్ర మోడీ రోటీన్ కు భిన్నంగా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రధాని నరేంద్ర మోడీ నోటీ నుంచి తెలుగు సినిమా ప్రస్తావన.. దాని గొప్పతనం గురించి ప్రశంసలు రావటంతో తెలుగు సినిమా వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల ప్రసంగ చిట్టి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినిమాతో పాటు.. కాకతీయుల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావటం గర్వకారణమన్న ఆయన.. పోచంపల్లి చేనేత వస్త్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని గడించిన వైనాన్ని ప్రస్తావించారు. మొత్తంగా చూస్తే.. తాను ప్రస్తుతం ఉన్న గడ్డకు సంబంధించిన విశేషాలు తనకు తెలుసన్నట్లుగా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా పరిశ్రమకు ప్రశంస బాగానే ఉన్నా.. అందుకు ఇది సరైన వేదిక కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.


Tags:    

Similar News