మోదీ దండ‌యాత్ర‌!... బాబు భ‌ల్లాల దేవుడ‌ట‌!

Update: 2019-04-01 16:22 GMT
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నిజంగానే దండ‌యాత్ర చేశార‌నే చెప్పాలి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రెండు సార్లు ఏపీకి వ‌చ్చిన మోదీ... తాజాగా నేడు మూడో సారి కూడా వ‌చ్చేశారు. తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నిక‌ల బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రైన మోదీ.... ఏపీలోని అధికార పార్టీ టీడీపీ, ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడ‌పై త‌న‌దైన శైలిలో దండెత్తారు. అధికార పార్టీతో పాటు విప‌క్ష వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపైనా త‌న‌దైన విమ‌ర్శ‌లు గుప్పించిన మోదీ... అస‌లు కేంద్రంలో అధికారంలో ఉన్న త‌మ ప్ర‌భుత్వం ఏపీకి ఏమేం చేసింద‌న్న విష‌యాల‌పై కాస్తంత సుదీర్ఘంగానే మాట్లాడిన మోదీ... ఏపీ పాలిటిక్స్‌పై దండ‌యాత్ర చేశార‌నే చెప్పాలి. ఏపీకి జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టుతో పాటు రోడ్లు, విమానాశ్ర‌యాలు, ఏపీలో అమ‌ల‌వుతున్న కేంద్ర ప‌థ‌కాలు, ఇటీవ‌లే క‌ల‌క‌లం రేపిన డేటా చోరీ తదిత‌ర అన్ని అంశాల‌పైనా మోదీ స్ట్రైట్‌గానే విమ‌ర్శ‌లు సంధించారు. చంద్ర‌బాబును భ‌ల్లాల దేవుడిగా అభివ‌ర్ణించిన మోదీ.. అధికారం కోసం చంద్ర‌బాబు ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేద‌ని కూడా మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పోలవ‌రం ప్రాజెక్టును ఏ ప్ర‌భుత్వాలు కూడా చేప‌ట్ట‌క‌పోగా... అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని గుర్తించామ‌ని చెప్పిన మోదీ... ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్ర‌క‌టించామ‌ని చెప్పారు. ఇప్ప‌టిదాకా ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.7 వేల కోట్ల‌ను మంజూరు చేశామ‌ని కూడా మోదీ చెప్పుకొచ్చారు. కాకినాడలో కొత్తగా ఏర్పాటైన పలు ప్రాజెక్టులను తామే మంజూరు చేశామని అన్నారు. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాలకు అంతర్జాతీయ హోదా ఇచ్చింది తమ ప్రభుత్వమేనని మోడీ అన్నారు. సాగరమాల, జలమార్గాలు, జాతీయ రహదారులు - రైల్వేలు - ఎయిర్ వేస్ ఇవన్నీ తమ ఎన్డీఏ ప్రభుత్వమే రాష్ట్రానికి కేటాయించిందని చెప్పారు. ఇంత మేర నిధులు విడుద‌ల చేస్తున్నా పోల‌వ‌రం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కావ‌డం లేద‌ని మోదీ ప్ర‌శ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధుల‌ను ప్రాజెక్టు నిర్మాణానికి కాకుండా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స్వంత ప్ర‌యోజ‌నాల కోసం మ‌ళ్లిస్తోంద‌ని మోదీ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు.

జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం పూర్తి కావాలంటే.. కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి అని చెప్పిన మోదీ...ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చేశారని, దాన్నుంచి డబ్బులు పిండుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రానికి గుండెకాయ వంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ ప్రజలను దారుణంగా మోసానికి గురి చేస్తోందని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా సుమారు రూ.7000 కోట్లను తాము చంద్రబాబు ప్రభుత్వానికి మంజూరు చేశామని అన్నారు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేశారో నిజాయితీగా చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉన్నాయా? అని మోదీ నిలదీశారు. అస‌లు పోలవరం ప్రాజెక్టును టీడీపీ  ప్రభుత్వం పూర్తి చేయాలని అనుకోవట్లేదని  మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము పంపించిన నిధులను చంద్ర‌బాబు స‌ర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. వాటిని పక్కదారి పట్టించి, మెక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్దేశపూరకంగా పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనా నిర్మాణాలను గణనీయంగా పెంచేశారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు టీడీపీకి, చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని మ‌రో సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఏటీెఎం నుంచి డబ్బులు రాబట్టుకున్నట్టు చంద్ర‌బాబు కూడా పోల‌వ‌రం ప్రాజెక్టు నుంచి నిధులను పిండుకుంటున్నార‌ని నిప్పులు చెరిగారు. కమిషన్ల కోసం అంచనాలను భారీగా పెంచేశారని చెప్పారు.

యూటర్న్ బాబు ఎవరికి లబ్ది చేకూర్చడానికి పోలవరం అంచనాలు పెంచేస్తున్నారని మోడీ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలవరం నిధులను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోలవరానికి ఖర్చు చేయాల్సిన నిధులను తీసుకెళ్లి, కొత్తగా ఏర్పడిన రాజకీయ మిత్రుల చేతుల్లో పోస్తున్నారని మోడీ విమర్శించారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అవినీతికి పోలవరం ప్రాజెక్టు అతి పెద్ద ఉదాహరణ అని చెప్పారు. ఇలాంటి మోసగాళ్ల నుంచి ఇలాంటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే.. రాష్ట్రం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని అన్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం తాము చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ 2పై చంద్రబాబు, టీడీపీ సహా మహా కూటమి పార్టీలు చేసిన వ్యాఖ్యలు మన దేశ జవాన్లను కించపరిచాయని మోదీ అన్నారు. చంద్రబాబు, ఆయన సహచర నాయకులు చేసిన వ్యాఖ్యానాలపై పాకిస్తాన్ పండగ చేసుకుంటోందని చెప్పారు. భారత్ లో కూడా తమను సమర్థించే వాళ్లు ఉన్నారని పాక్ ప్రభుత్వం సంబర పడుతోందని చురకలు అంటించారు. ఈ సంద‌ర్భంగా మోదీ చంద్ర‌బాబుతో పాటు జ‌గ‌న్ ను కూడా వ‌దిలిపెట్టలేదు. టీడీపీ గానీ, జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ గానీ.. ఆధునికాంధ్రను, నవ్యాంధ్రను నిర్మించలేరని అన్నారు. ఆయా నాయకులంతా అవినీతిలో పడి కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. అగ్రవర్ణాల పేదల కోసం రిజర్వేషన్ వల్ల ఏపీలో చాలామంది లబ్ది పొందారని మోదీ తెలిపారు.

యూటర్న్ బాబు స్థితి.. భళ్లాల దేవుని తరహాలో తయారైందని మోదీ విమర్శించారు. భల్లాల దేవుని తరహాలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చంద్ర‌బాబు అనేక కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నారని అన్నారు. ఏదో రకంగా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చంద్ర‌బాబు మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని, నమ్మించి మోసం చేశారని మోదీ విమర్శించారు. ఇక చివ‌ర‌గా ఇటీవ‌ల తెలుగు రాష్ట్రాల మ‌ధ్య హాట్ టాపిక్‌గా మారిన డేటా చో్రీపైనా మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ సైబర్ క్రైమ్ లకు పాల్పడుతోందని ఆరోపించిన మోదీ.... సేవా మిత్ర యాప్ ద్వారా అక్రమాలు చేస్తోందని చెప్పారు. టీడీపీ ఎవరికీ సేవ చేయట్లేదని, వారు ఎవరికీ మిత్రులు కాదని చెప్పారు. పెద్ద ఎత్తున డేటాను చోరీ చేస్తున్నారనే సమాచారం తన వద్ద ఉందని కూడా మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ డేటా చోరీ వల్ల రాష్ట్ర భద్రత ప్రమాదంలో పడినట్టేనని మోదీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మొత్తంగా పోల‌వ‌రం నుంచి డేటా చోరీ దాకా ప్ర‌తి అంశాన్ని ప్ర‌స్తావించిన మోదీ... ఏపీ పాలిటిక్స్‌పై ఏకంగా దండ‌యాత్ర చేశార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Tags:    

Similar News