మోడిలో కూడా మొదలైన 'రైతు’ కలవరం

Update: 2020-12-21 17:30 GMT
నూతన వ్యవసాయ చట్టాల అమలు విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడిలో కలవరం మొదలైనట్లే అర్ధమవుతోంది. ఈనెల 25వ తేదీన మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్ పేయ్ జయంతి సందర్భంగా రైతుల సంఘాలతో మోడి సమావేశం అవుతున్నారు. మోడి సర్కార్ రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమం అందరికీ తెలిసిందే. ఇప్పటికి 25 రోజులుగా రైతుసంఘాలు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రోజురోజుకు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న విషయం తెలిసిందే.

ఉద్యమాన్ని నియంత్రణలోకి తీసుకోవాలని కేంద్రప్రభుత్వం ఒకవైపు ప్రయత్నిస్తుంటే ఉద్యమంతో కేంద్రప్రభుత్వాన్ని రైతు సంఘాలు మరోవైపు వణికించేస్తున్నాయి. ఇప్పటికి కేంద్రమంత్రులకు, రైతుసంఘాల ప్రతినిధులతో నాలుగుసార్లు జరిగిన చర్చలు ఫెయిలయ్యాయి. ఒకవైపు చర్చలు ఫెయిలవుతుంటే మరోవైపు కేంద్రంపై వ్యవసాయ చట్టాల రద్దుకు కేంద్రంపై ఒత్తిడి పెరిగిపోతోంది.

ఇప్పటికే వివిధ రంగాల్లోని ప్రముఖులు తాము అందుకున్న పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను కేంద్రానికి తిరిగిచ్చేస్తున్నారు. పంజాబు రాష్ట్రంలోనే సుమారు 20 మంది తమ పురస్కారాలను తిప్పి ఇచ్చేయటం కూడా కేంద్రంపై ఒత్తిడికి మరో కారణం అవుతోంది. మొదట్లో పంజాబులో మొదలైన ఆందోళన చివరకు హర్యానా, రాజస్ధాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు పాకి చివరకు ఉద్యమంగా మారిపోయింది.

మొదట్లో రైతు ఉద్యమాన్ని మోడి చాలా తేలిగ్గా తీసుకున్నారు. అయితే పంజాబ్ నుండి ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రానికి పాకటంతో ఉద్యమ సెగ బాగా పెరిగిపోయింది. దాంతో హడావుడిగా కేంద్రమంత్రులను రంగంలోకి దింపినా ఉపయోగం కనబడలేదు. కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతుసంఘాలను ఏమీ అనలేక చివరకు ప్రతిపక్షాలనే తప్పు పడుతున్నారు.

రైతుల ఉద్యమం ఆగకపోవటంతో దేశవ్యాప్తంగా ప్రెస్ మీట్లు, సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇది కూడా లాభం లేదని అనుకోవటంతో చివరకు తానే 25వ తేదీన రైతులతో తానే వ్యక్తిగతంగా సమావేశం అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయంతోనే ఉద్యమం సెగ మోడికి ఎంతలా తగులుతోందో, ఎంతలా కలవరం మొదలైందో అందరికీ అర్ధమైపోతోంది.
Tags:    

Similar News