ఇంట ఓడి రచ్చ గెలుస్తున్న మోడీ.. ఎందుకిలా?

Update: 2023-05-25 11:13 GMT
ఇంట గెలిచి రచ్చ గెలవన్నది సామెత. ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో సీన్ ఇప్పుడు రివర్సులో ఉంది. రచ్చ గెలుస్తున్న ఆయన.. ఇంట మాత్రం నిరసనల మంటల్ని ఎదుర్కొంటున్నారు. దేశ ప్రధానమంత్రులుగా ఇప్పటివరకు ఆ కుర్చీలో కూర్చున్న వారిలో ఎవరికి కూడా అంతర్జాతీయంగా మోడీకి ఉన్నంత పలుకుబడి లేదన్నది నిజం. అయితే.. ఆ వాస్తవాన్ని ఒప్పుకోవటానికి మన దేశంలో చాలామంది మేధావులు.. బుద్ధజీవులకు సుతారం ఇష్టం ఉండదు. మంచిని మంచిగా.. చెడును చెడుగా చూసే ధోరణి చాలామందికి ఇష్టం ఉండదు. ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత.. అందుకు భిన్నమైన స్టాండ్ తీసుకోవటం ఏమిటన్నట్లుగా వారి తీరు ఉంటుంది. ఇది కూడా మేధావులు మోడీ సాధించిన విజయాల్ని ఒప్పుకోవటానికి ఇష్టపడరు.

ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మోడీ దూసుకెళ్లిపోతున్నారు. నిజానికి ఆయన తాజా విదేశీ పర్యటనకు ముందు ఆయన గ్రాఫ్ కాస్తంత డౌన్ గా ఉందన్నది వాస్తవం. జీ7 శిఖరాగ్ర సమావేశాలతో మొదలైన మోడీ హవా.. అంతకంతకూ పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. ఉక్రెయిన్ అధ్యక్షుడికి సైతం వ్యక్తిగత మాట ఇచ్చిన వైనం చూసిన ప్రాశ్చాత్య దేశాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకంటే.. సూపర్ పవర్ గా ఉన్న చైనా.. అమెరికా అధ్యక్షులు సైతం ఇంత ఓపెన్ గా ఇలాంటి మాటలు చెప్పేందుకు ఆలోచిస్తారు. అందుకు భిన్నంగా మోడీ తీరు వారిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోడీ రేంజ్ ఎంతన్న విషయాన్ని నలుగురి ముందు చెబితే.. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బనీస్ మరో అడుగు ముందుకు వేసి.. ఆయన గొప్పతనం ఏమిటన్నది వేలాది మంది నడుమ 'మోడీ ఈజ్ బాస్' అనేయటం ద్వారా మోడీ ఎంత శక్తివంతుడైన విషయం ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.

ఇది జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఆయన ఇంట(భారతదేశం) ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీద ప్రారంభించటాన్నిససేమిరా అంటున్నాయి. రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీద కాకుండా ప్రధాని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు. మోడీ నిర్ణయం ప్రజాస్వామ్యం మీద దాడిగా అభివర్ణిస్తున్నారు.

దేశంలోని 19 పార్టీలు ఉమ్మడి ప్రకటన చేశాయి. దాని సారాంశం.. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా ఓపెన్ చేయటానికి తాము ఒప్పుకోమని. పార్లమెంటు నిర్మాణం రాజ్యాంగ విలువలతో జరిగిందని.. అందుకు భిన్నంగా మోడీ చేతుల మీదుగా ప్రారంభానికి తాము ఒప్పుకోమని 19 పార్టీలు ఉమ్మడి ప్రకటన చేశాయి. ఈ పందొమ్మిది పార్టీల్లో మోడీ నీడను సైతం సహించలేనన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్ అధినేతగా ఉన్న బీఆర్ఎస్ లేకపోవటం గమానార్హం. ఈ నెల 28న (ఆదివారం) జరిగే పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లుగా కాంగ్రెస్ తో సహా పందొమ్మిది రాజకీయ పార్టీలు స్పష్టం చేస్తున్నాయి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంటు అంటే రాష్ట్రపతి.. రాజ్యసభ.. లోక్ సభ అని అర్థమని.. రాష్ట్రపతి దేశాధినేత మాత్రమే కాదు.. పార్లమెంటులో సమగ్రభాగమని ప్రతిపక్షాలుతమ ప్రకటనలో చెబుతున్నాయి. అంతర్జాతీయంగా అందరి మనసుల్ని దోచుకుంటున్న మోడీ.. కొత్త పార్లమెంటు భవనాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించాలని ఎందుకు తపిస్తున్నారు? విశాలత్వానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పే ఆయన మనసులో.. తాను నియమించిన రాష్ట్రపతి దేశ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించటం ఏమిటన్న భావనలో ఆయన ఉన్నారా? అన్నది ప్రశ్న.

రచ్చ గెలిచి విజయగర్వంతో తిరిగి వచ్చే మోడీకి.. ఇంట మాత్రం నిరసన సెగలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయన్నది వాస్తవం. ఇలాంటి వేళలో.. కాస్త తగ్గి రచ్చ గెలిచినట్లే.. ఇంట గెలిచే పని చేస్తే బాగుంటుంది. తాను తీసుకున్న నిర్ణయాలను మొండిగా అమలు చేసే మోడీ.. విపక్షాలు చేసిన మంచి సూచనను ఒప్పుకునేందుకు అంగీకరిస్తారంటారా?

Similar News