ఓటు కోసం ఏ చాన్సూ వ‌దులుకోని మోడీ

Update: 2019-03-11 17:30 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఓట్ల ఎత్తుగ‌డ‌ను రాజ‌కీయ‌వ‌ర్గాలు ఆస‌క్తిక‌రంగా విశ్లేషిస్తున్నాయి. లోక్‌ సభ ఎన్నికలకు ఏ క్షణంలోనైనా నగారా మోగుతుందని ముందుగానే గ్రహించిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చివరి నిమిషంలో మేల్కొని సుడిగాలి పర్యటనలతో హడావుడి చేశారని అంటున్నారు. ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదివారం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ను ప్రకటించడానికి ముందు నెల రోజుల వ్యవధిలో ఆయన దేశవ్యాప్తంగా 28 పర్యటనలు జరిపి కనీవినీ ఎరుగని రీతిలో 157 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించిన వెంటనే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. దీంతో ప్రభుత్వం విధానపరమైన ఎటువంటి ప్రకటనలు చేసేందుకు వీలుండదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న మోడీ.. చివరి నిమిషంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఎన్నిక‌ల షెడ్యూల్ దృష్టిలో ఉంచుకొని గత నెల 8 నుంచి ఈ నెల 9వ తేదీ వరకు వరుసగా అనేక ప్రాజెక్టులను ప్ర‌ధానమంత్రి ప్రారంభించారు. వీటిలో రహదారులు, రైల్వే లైన్లు, వైద్య కళాశాలలు, దవాఖానలు, పాఠశాలలు, గ్యాస్ పైప్‌ లైన్లు, విమానాశ్రయాలు, నీటి కనెక్షన్లు, విద్యుత్ ప్లాంట్లు తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే గత లోక్‌ సభ ఎన్నికల సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యవహరించిన తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అప్పటికి రెండోసారి ప్రధాన మంత్రి పదవిలో కొనసాగుతున్న మన్మోహన్ సింగ్ 2014లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి ముందు నెల రోజుల వ్యవధిలో ఎటువంటి పర్యటనలు జరుపలేదని అంటున్నారు.

ఈ ఏడాది జనవరి 8 నుంచి ఫిబ్రవరి 7 వరకు నరేంద్రమోడీ 57 ప్రాజెక్టులను ప్రారంభించగా.. ఆ తర్వాత నాలుగు వారాల్లో వాటి సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటనలతోపాటు ప్రధాన మంత్రి కార్యాలయ (పీఎంవో) అధికారిక వెబ్‌ సైట్‌ లో ఉన్న గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మోడీ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో కొన్ని పాత ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇటీవల మోడీ ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని అమేథీలో జాతికి అంకితం చేసిన కలష్నికోవ్ అసాల్ట్ రైఫిళ్ల తయారీ కర్మాగారమే ఇందుకు ఉదాహరణ. భారత్, రష్యా సంయుక్త భాగస్వామ్యంలో నెలకొల్పిన ఈ ప్లాంట్ వాస్తవానికి 2007లోనే ప్రారంభమవడంతోపాటు 2010 చివరి నుంచే కార్బైన్లు, రైఫిళ్లు, మెషీన్‌ గన్లను తయారు చేస్తున్నట్టు గతంలో ప్రభుత్వమే ప్రకటించింది. అలాగే బీహార్‌ లోని కర్మాలిచక్‌ లో గత నెల 17న ఓ మురుగునీటి పారుదల వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. అయితే ఇదే ప్రాజెక్టుకు రెండేళ్ల‌ క్రితం స్వయంగా మోడీయే శంకుస్థాపన చేయడం గమనార్హం.

ఇలాంటి చిత్రాల‌ను ప‌క్క‌న‌పెడితే, గత నెల రోజుల వ్యవధిలో మోడీ ప్రారంభించిన 157 ప్రాజెక్టుల్లో దాదాపు 140 ప్రాజెక్టులు చాలా చిన్నచిన్నవే ఉన్నాయి. చెన్నై మెట్రోలోని ఓ సెక్షన్‌ లో ప్రారంభించిన ప్యాసింజర్ సర్వీసు, కర్ణాటకలోని చిక్జాజుర్-మయకొండ రైల్వేలైన్ డబ్లింగ్ పనులు, జాతీయ రహదారిని ఆరులేన్ల రహదారిగా మార్చే పనులను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చున‌ని అంటున్నారు.


Tags:    

Similar News