మోడీ భయపడే పరిస్థితి వచ్చిందా?

Update: 2018-01-01 23:30 GMT
దేశంలో చెదురు మదురుగా వేర్వేరు చోట్ల జరుగుతూ వస్తున్న ఎన్నికల్లో కమల దళానికి అనుకూల ఫలితాలు వస్తున్నంత కాలమూ.. ప్రధాని నరేంద్రమోడీ హవా ఈ దేశంలో తిరుగులేని రీతిలో పరిఢవిల్లు తున్నది అంటూ అనల్పమైన ప్రచారం జరగవచ్చు గాక! కానీ వాస్తవాల్ని పరిశీలించినప్పుడు.. ఆయన పార్టీ మీద ఇదివరకటి రేంజిలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించలేకపోతున్నారా... అనే విమర్శలుకూడా వినిపిస్తున్నాయి. పార్టీ మీద తన పట్టు చేజారి పోకుండా - తన హవాకు గండిపడకుండా.. కనీసం ఆ విషయాన్ని ప్రజానీకం గమనించకుండా ఉండే విధంగా.. ప్రధాని నరేంద్రమోడీ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. లోతుగా గమనిస్తే.. పార్టీలో ధిక్కార స్వరాలు వినిపిస్తే.. ఇదివరలో ఉక్కుపాదంతో అణచివేసే తెగువ పుష్కలంగా ఉన్న నరేంద్రమోడీ.. ఇప్పుడు అలాంటి తిరుగుబాటు ధోరణులకు భయపడే పరిస్థితి వచ్చిందా అని పలువురు అనుమానిస్తున్నారు.

తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని పరిణామాలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రంలో భాజపా గెలుపు సాధించినప్పటికీ.. ఆ విజయమే.. పార్టీ ఇమేజి గంగలో కలుస్తున్నదనడానికి నిదర్శనంగా ఉన్నదని పలువురు పలు సందర్భాల్లో విశ్లేషిస్తూ వచ్చారు. సీట్ల సంఖ్య దారుణంగా తగ్గగా.. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచిందనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. గుజరాత్ లో ప్రభుత్వం ఏర్పాటుకు పూనుకోగానే.. ఎదురైన ధిక్కార స్వరం తిరుగుబాటు వైఖరి.. మోడీకి చికాకు తెప్పించినట్లుగా అర్థమవుతోంది.

ఇదివరకటి సీఎం, డిప్యూటీలనే మళ్లీ ఎంపిక చేసినప్పటికీ.. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కు గతంలో ఉన్న మంత్రిత్వ శాఖల్లో కోతపెట్టడం వివాదంగా మారింది. ఆయన అసలు కేబినెట్ పదవి స్వీకరించకుండా.. మంకు పట్టు పట్టగా, ఈలోగా ఆయన పార్టీని వీడడానికైనా సిద్ధమే అన్నట్లుగా పరోక్ష సంకేతాలు కూడా వెలువడ్డాయి. అసలే అత్తెసరు మెజారిటీతో ఏలుబడిలోకి వచ్చిన పార్టీలో.. ఇలాంటి అసంతృప్తులు రేగితే పుట్టి మునుగుతుందని మోడీ భయపడ్డారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే... సీఎం విజయ్ రూపానీకి నచ్చజెప్పి.. నితిన్ పటేల్ ఆగ్రహం ఉపశమించేలా.. ఆయనకు తిరిగి ఆర్థిక శాఖ కట్టబెట్టేలా పురమాయించారని ప్రజలు అనుకుంటున్నారు. మొత్తానికి ఇలాంటి భయ సంకేతాలు.. పార్టీ మీద మోడీ ప్రభావానికి గండి పడడం మొదలైందనడానికి నిదర్శనాలే ప్రచారం  కూడా జరుగుతోంది.
Tags:    

Similar News