మోడీకి పేద‌త‌ల్లి మ‌ళ్లీ గుర్తుకు వ‌చ్చింది

Update: 2018-04-07 05:26 GMT
ప్ర‌ధాని మోడీకి మ‌రోసారి త‌న త‌ల్లి గుర్తుకు వ‌చ్చింది.  కాదు.. వ‌చ్చేలా చేశాయి విప‌క్షాలు. మోడీకి త‌ల్లంటే ఎంత ప్రేమో తెలియంది కాదు. తాను అమితంగా ఆరాధించే అమ్మ‌.. ఆయ‌న‌ సోద‌రుల ఇంట్లో ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఆర్నెల్ల‌కో.. ఏడాదికో ఒక‌సారి త‌న త‌ల్లిని చూసుకోవ‌టానికి వెళ్ల‌టం.. త‌న పుట్టిన రోజునో.. మ‌రో సంద‌ర్భంలోనో ఆమె వ‌ద్ద‌కు వెళ్ల‌ట‌మో.. ఆమెను త‌న ద‌గ్గ‌ర‌కు తెచ్చుకోవ‌ట‌మో చేస్తుంటారు.

దేశానికి అంకిత‌మైన మోడీ లాంటి నేత‌కు నిత్యం త‌ల్లిని గుర్తుంచుకోవ‌టం సాధ్యం కాదు.త‌న జీవితాన్ని దేశానికి ప‌ణంగా పెట్టేసిన నేప‌థ్యంలో.. ఆయ‌న‌కు త‌ల్లిని చ‌టుక్కున గుర్తుకు వ‌చ్చేలా చేసిన విప‌క్షాల‌కు థ్యాంక్స్ చెప్పాల్సిందేగా?

త‌న‌పై క‌త్తి దూసే ప్ర‌త్య‌ర్థుల‌పై భావోద్వేగ క‌త్తిని దూయ‌టం మోడీకి అల‌వాటే. ఎప్ప‌టిక‌ప్పుడు తాను వాడే క‌త్తుల్ని అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా మార్చేయ‌టంలో మోడీ మొన‌గాడ‌న్న విష‌యం అదే ప‌నిగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గ‌డిచిన నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో ఆయ‌న శ‌క్తియుక్తుల్ని.. ఎప్పుడెలా ఆయ‌న రియాక్ట్ అవుతార‌న్న విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌మ స‌ర్కారు మీద వ్య‌తిరేక‌త వెల్తువెత్తుతున్న వైనం విప‌క్షాల సృష్టిగా ఆయ‌న మాట‌ల్లో వినిపించ‌టం క‌నిపిస్తుంది. ఈ సంద‌ర్భంగా ఎప్ప‌టిలానే త‌న మూలాల్ని ప్ర‌స్తావించారు. త‌నలాంటి సాధార‌ణ వ్య‌క్తి దేశ ప్ర‌ధాని కుర్చీలో కూర్చోవ‌టం సంప్ర‌దాయ రాజ‌కీయ నేత‌ల‌కు అస్స‌లు ఇష్టం ఉండ‌ద‌న్నట్లుగా చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు.

మ‌న‌లో ఒక‌డు ప్ర‌ధాని కుర్చీలో కూర్చుంటే.. విప‌క్షాలు ఓర్వ‌లేక‌పోతున్నాయే అన్న భావ‌న‌ను క‌లుగ‌జేసేలా మాట్లాడ‌టంలో మోడీ త‌ర్వాతే ఎవ‌రైనా. తాజాగా త‌న‌ను తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్న విప‌క్షాల‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు మోడీ.

వెనుక‌బ‌డిన కులాల వారు ఉన్న‌త‌స్థానాలకు చేరుకోవ‌టాన్ని జీర్ణించుకోలేని ప్ర‌త్య‌ర్థులు త‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త పెంచుకుంటున్నార‌ని.. ఈ వ్య‌తిరేక‌త హింసాత్మ‌కంగా మారుతోంద‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. పేద త‌ల్లి కుమారుడు ప్ర‌ధాని కావ‌టాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని.. ఓబీసీ వ‌ర్గానికి చెందిన త‌న‌ను ఆమోదించ‌లేక‌పోతున్నట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు.

వెనుక‌బ‌డిన కులాల్లో పుట్టిన వారు కూడా ఉన్న‌త స్థానాల‌కు చేరుకోగ‌ల‌ర‌న్న విష‌యాన్ని వారు ఆమోదించ‌లేక‌పోతున్నార‌న్న మోడీ.. మ‌నం  ఏమైనా త‌ప్పు చేశామా అంటే లేద‌ని.. కార‌ణం అది కాద‌ని.. పెరుగుతున్న బీజేపీ బ‌లాన్ని ప్ర‌త్య‌ర్థులు జీర్ణించుకోలేక‌పోవ‌ట‌మే అంటూ త‌న వైఫ‌ల్యాల్ని క‌వ‌ర్  చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌పై ప్ర‌త్య‌ర్థులు దాడి చేసిన ప్ర‌తిసారీ త‌న పేద నేప‌థ్యాన్ని.. తాను టీ అమ్మిన వైనాన్ని చెప్పుకునే మోడీ.. విభ‌జ‌న కార‌ణంగా  దారుణ‌మైన ఆర్థిక ఇబ్బందుల్లో ప‌డిన ఏపీకి ఎందుకు సాయం చేయ‌టానికి నిరాక‌రిస్తున్నారు?  సాయం చేయ‌గ‌లిగే స్థానంలో ఉండి.. చ‌ట్ట‌బ‌ద్ధంగా ఇవ్వాల్సిన హోదా విష‌యంలో మీన‌మేషాలు ఎందుకు లెక్క పెడుతున్న‌ట్లు?  ఒక పేదవాడికి మ‌రో పేద‌వాడి క‌ష్టం.. వాడి ఇబ్బంది తెలుస్తుందంటారు. మ‌రి.. పేద నేప‌థ్యం నుంచి వ‌చ్చిన మోడీకి.. తీవ్ర‌మైన ఆర్థిక ఇబ్బందుల‌తో త‌ల్ల‌డిల్లుతోన్న ఏపీ ఎందుకు ప‌ట్ట‌టం లేదు?  ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష‌లు ఎందుకు అర్థం కావ‌టం లేదు?  త‌న వేద‌న‌ను ప్ర‌జ‌లు వినాలే కానీ.. వారి ఆవేద‌న‌ను తాను వినాల‌ని మోడీ అనుకోరా?
Tags:    

Similar News