హాట్ టాపిక్ గా మోడీ పూల చొక్కా

Update: 2016-07-10 05:03 GMT
గడిచిన కొన్నేళ్లలో భారత ప్రధానిగా వ్యవహరించిన నేతలకు సంబంధించిన డ్రెస్సింగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిందీ అంటే అది.. ప్రధాని మోడీ గురించేనని చెప్పక తప్పదు. తనదైన శైలిలో ఎప్పటికప్పుడు.. కార్యక్రమానికి తగినట్లుగా డ్రెస్ లు మార్చటం ఆయనకే చెల్లుతుంది. ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఒబామా సతీమణి కంటే ఎక్కువసార్లు డ్రెస్సులు మార్చి వార్తల్లోనిలవటం మోడీకి మాత్రమే చెల్లుతుంది.  భారత ప్రధాని డ్రెస్సుల గురించి ప్రత్యేకంగా వార్తలు రాయటం మోడీతో మొదలైందని చెప్పాలి. ఈ కారణంతోనే కావొచ్చు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ మోడీ కుర్తా పేరుతో డ్రెస్ ను తీసుకొచ్చేశారు.

ఖాదీ తో డిజైన్ చేసే కుర్తా.. పైజమాలపై జాకెట్ ను మోడీ స్టైల్ ఐకాన్ గా పలువురు చెబుతుంటారు. స్వదేశీ కార్యక్రమాల్లో మాదిరి తన విదేశీ పర్యటనల సందర్భంగా.. డ్రెస్ ను మార్చేసే మోడీ.. తాజాగా తన దక్షిణాఫ్రికా పర్యటనలో పూల చొక్కా వేసుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడాయన వేసుకున్న పూల చొక్కా హాట్ టాపిక్ గా మారింది. తన మార్క్ అయిన కుర్తా.. పైజమా.. కోటుకు స్థానే.. పూల చొక్కాలో మెరిసిపోయిన మోడీ డ్రెస్సింగ్ పై రకరకాల అభిప్రాయాలు.. వాదనలు మొదలయ్యాయి.

దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా ధరించే మదీబా తరహా షర్ట్ ను మోడీ ధరించటం విశేషం. ఇలాంటి పూల చొక్కాల్లో మండేలా తరచూ దర్శనమిచ్చేవారు. తాజాగా ఆయన మాదిరే డ్రెస్ వేసుకున్న మోడీ.. హవాయ్ డ్యాన్స్ వేస్తారా? అంటూ సోషల్ మీడియాలో జోకులేసుకున్న వారూ ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. జపాన్ కు వెళ్లినప్పుడు.. అక్కడి వాయిద్యాన్ని వాయించిన మోడీని గుర్తు తెచ్చుకుంటూ ఈ సరదా వ్యాఖ్య చేసి ఉండొచ్చు. మరికొందరు బ్లూ కలర్ పూల చొక్కాలో మోడీ బాగున్నారంటూ రియాక్ట్ అయితే.. జౌళిశాఖ కొత్త మంత్రి తెచ్చిన కొత్త సంస్కరణా?అంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీని పూలచొక్కా ఎపిసోడ్ లోకి తీసుకొచ్చి ఎటకారం చేసినోళ్లూ ఉన్నారు. మొత్తంగా.. మోడీ పూల చొక్కా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యిందనటంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News