ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు మోడీ రెడీ...లెక్కలు వేరే!

Update: 2017-03-20 06:26 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌య్యారా? ఇటీవలి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఊపును దేశ‌వ్యాప్తం చేయాల‌ని అనుకుంటున్నారా? ఇందులో భాగంగా త‌న‌ సొంత రాష్ట్రమైన‌ గుజరాత్‌ లో ముందస్తు ఎన్నికల‌కు వెళ్ల‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. గుజ‌రాత్‌ లో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అదే స‌మ‌యంలో చిత్రంగా ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ సైతం దీనికి సిద్ధంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌ లో గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే  ఇటీవ‌లి యూపీ ఫ‌లితాల‌తో బీజేపీలో జోష్ పెరిగింది. ఉత్త‌ర‌ప్రదేశ్ వంటి కులాల కుంప‌ట్లు, బీజేపీకి అనుకూల‌త లేని రాష్ట్రంలోనే బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించిన నేప‌థ్యంలో సొంత రాష్ట్రం అందులోనూ త‌మ పార్టీ అధికారంలో ఉన్న గుజ‌రాత్‌ లో బీజేపీకి అంతా బాగుండే అవ‌కాశమే ఎక్కువ అని కాషాయ‌ వ‌ర్గాలు అంటున్నాయి. ఎన్నిక‌ల‌కు ఇదే స‌రైన‌ సమయంగా మోడీ భావిస్తున్నట్టు క‌మ‌ళ‌నాథులు అంటున్నారు. ఈ ఏడాది జులై లేదా సెప్టెంబర్‌ లోనే గుజ‌రాత్‌ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేకపోలేదని ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కూడా అంచనా వేస్తోంది. అందుకే త‌న‌దైన శైలిలో ఎన్నికలు వ‌స్తే ఎదుర్కునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది.

అయితే, ఈ ఊహాగానాలను గుజరాత్ రాష్ట్ర సీఎం విజయ్‌ రూపానీ తిరస్కరించారు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు. కాగా, గుజ‌రాత్‌ లో ఓబీసీ రిజర్వేషన్లు కోరుతూ పటేల్‌ సామాజిక వర్గం చేపట్టిన ఆందోళన నేపథ్యంలో ఆ వర్గం బీజేపీకి దూరమైనట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు దళితులపై ఆ రాష్ట్రంలో జరిగిన దాడులు కూడా అక్కడి బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచినట్టుగా భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీకి ఒక‌ప్ప‌టి అంత సానుకూల ప‌రిణామాలు లేవ‌ని తెలుస్తోంది. మొత్తానికి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని మోడీకి ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయనేది కాద‌న‌లేని అంశం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News