మోడీ సర్కారు మరో కీలక నిర్ణయం.. పార్లమెంటులో ధర్నాకు నో

Update: 2022-07-15 09:30 GMT
మోడీ ప్రభుత్వమా మజాకానా? నిన్నటికి నిన్ననే పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభ్యుల నోటి నుంచి రాకూడని మాటలకు సంబంధించిన జాబితా బయటకు రావటం.. దీనిపై మీడియాలో పెద్ద చర్చ జరగటంతో పాటు.. ప్రజలు సాదాసీదాగా వాడే మాటల్ని సైతం పార్లమెంటు సమావేశాల సందర్భంగా మాట్లాడకూడదని పేర్కొనటంపై విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడటం తెలిసిందే. ఈ విమర్శలతో మోడీ సర్కారు కాసింత ఆత్మరక్షణలో పడిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఇదే అంశంపై పార్లమెంటు సెక్రటరీ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజాగా మరో కీలక నిర్ణయాన్ని మోడీ సర్కారు తీసుకుంది. దీని వివరాల్ని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ వీటిని జారీ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావటానికి ముందు వెలువడిన ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించటం ఖాయం. కారణం.. పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు ధర్నా.. ప్రదర్శన.. నిరాహార దీక్ష.. సమ్మె.. ఏదైనా మతపరమైన వేడుక కోసం పార్లమెంటును వాడుకోవద్దంటూ సభ్యుల్ని కోరుతున్నట్లుగా పేర్కొన్నారు.

తాజా ఆదేశాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశ్వగురు నుంచి మరో కొత్త ఆయుధం వచ్చింది.. ఇకపై ధర్నాపై నిషేధం అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య భారతంలో తమ నిరసనను.. తమకున్న అభ్యంతరాల్ని.. పాలకపక్షంపై తమ వాదనల్ని ప్రజలకు తెలియజేయటానికి వీలుగా చట్టసభల్లో నిరసన చేపట్టటం.. ఆందోళనను నిర్వహించటం మామూలే.

కొన్నిసార్లు ఇలాంటివి పక్కదారి పట్టించినా.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై నిరసననువ్యక్తం చేయటానికి చట్టసభలకు మించింది మరొకటి ఉండదు. అలాంటిది.. పార్లమెంటులో ధర్నా.. నిరసన.. లాంటి ఆందోళనలకు అనుమతి లేదంటూ ఉత్తర్వులు జారీ చేయటం సంచలనంగా మారింది.

చూస్తుంటే.. ఏదో ఒక నియంత్రణను తీసుకొచ్చే పనిలో మోడీ సర్కారు పడినట్లుగా చెప్పాలి. ఇలాంటి తీరుతో మోడీ సర్కారు మీద వ్యతిరేకత మరింత పెరుగుతుందని చెప్పాలి. వ్యక్తిత్వ వికాస నిపుణుడి మాదిరి స్పీచులు ఇచ్చే ప్రధాన మంత్రి మోడీ.. చట్ట సభల్లో చట్టబద్ధంగా ప్రజల చేత ఎన్నికైన వారు ఏమేం చేయాలన్న దానిపైనా నియంత్రణ ఎంతవరకు సబబు? అన్నది అసలు ప్రశ్న.

తాజా ఉత్తర్వుల్ని చూస్తే.. మోడీ సర్కారు అన్నాక ఆ మాత్రం ఉండొద్దా? అన్న భావన కలుగక మానదు. చూస్తుంటే.. ఈ నిర్ణయంపై రానున్న రోజుల్లో మరింత వివాదాస్పదంగా మారటంతో పాటు.. మోడీ సర్కారు ఇమేజ్ ను డ్యామేజ్ చేసే అవకాశమే ఎక్కువగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News