పార్లమెంటులో అప్పుల లెక్క.. ఏపీకి షాకిచ్చిన మోడీ సర్కార్

Update: 2021-12-21 05:06 GMT
తరచూ చర్చకు వస్తున్న ఏపీ అప్పులకు సంబంధించిన కీలక పరిణామం తాజాగా చోటు చేసుకుంది. జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుంటే.. అందుకు భిన్నంగా వైసీపీ నేతల సమర్థించుకుంటున్న తీరు తెలిసిందే. ఇలాంటి వేళ.. అదే పనిగా అప్పులు చేస్తున్న జగన్ సర్కారుపై తాజాగా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ పరిణామం ఏపీకి షాకిచ్చేలా మారిందంటున్నారు.
కేంద్రం ఇచ్చిన అప్పులు తీసుకునే ఎఫ్ ఆర్బీఎం కూడా దాటేయటంతో.. భవిష్యత్తులో తీసుకునే అప్పులపై ఆంక్షలు విధిస్తున్నట్లుగా సోమవారం పార్లమెంటులో కేంద్రం ప్రకటించింది.

ఇటీవల మరణించిన మాజీ ముఖ్యమంత్రి కమ్ గవర్నర్ రోశయ్య ఆర్థికమంత్రిగా ఉన్న వేళలో.. ఓవర్ డ్రాఫ్టుకు వెళ్లటం కూడా అవమానంగా భావించేవారు. అప్పు తీసుకునే అవకాశం ఉంది కదా? అని అదే పనిగా అప్పుకు వెళతామా? అని వ్యాఖ్యానించేవారు. ఆర్థిక అంశాల విషయంలో క్రమశిక్షణతో ఉండే నాటి ఏపీకి.. ఇప్పటికి ఏపీకి ఏ మాత్రం సంబంధం లేని రీతిలో మారింది.

తాజాగా అప్పులు తీసుకునే విషయంలో కేంద్రం ఓకే చెబితే కానీ కుదరదన్న వరకు వెళ్లటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్న. తాజాగా పార్లమెంటులో ఏపీకి సంబంధించి కీలక ప్రకటన కేంద్రం చేసింది. ప్రతి ఏడాది తీసుకునే రుణాలపై ఎఫ్ఆర్బీఎం పరిమితులు విధిస్తుంటుంది. రెండేళ్లుగా ఏపీ సర్కారు పలుమార్లు ఈ పరిమితుల్ని ఉల్లంఘిస్తుందన్న వేళ.. పార్లమెంటులో విపక్ష ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది.

ఏపీ ప్రభుత్వం రూ.17వేల కోట్ల మేర పరిమితిని మించి అప్పులు చేసినట్లు తేల్చేసింది. దీనిపై తీసుకుంటున్న చర్యల్ని సైతం పేర్కొంటూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎఫ్ ఆర్బీఎం పరిమితిని దాటి తీసుకున్న అప్పులకు ప్రతిఫలంగా వచ్చే మూడేళ్ల పాటు అప్పుల పరిమితుల్లో కోతలు విధిస్తామని కేంద్రం చెప్పింది.

ఏపీకి చెందిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ.. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిత్యనందరాయ్ సమాధానమిచ్చారు. ఇకపై ఎఫ్ ఆర్బీఎం పరిమితి దాటకుండా చూసుకోవాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామం ఏపీకి ఇబ్బంది కలిగించేదిగా చెప్పక తప్పదు.


Tags:    

Similar News