మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా మోడీ ప్ర‌భుత్వం!

Update: 2022-10-03 12:04 GMT
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంద‌నే వార్త ఇప్పుడు రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. ప్ర‌స్తుతం కేంద్రంలో ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ‌గా ఉన్న మైనార్టీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌ను మోడీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేస్తుంద‌ని ఒక ఆంగ్ల ప‌త్రిక ప్రచురించిన క‌థ‌నం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దేశంలో మైనార్టీలుగా ఉన్న‌ క్రైస్తవులు, ముస్లింలు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీల సంక్షేమం కోసం యూపీఏ (కాంగ్రెస్ కూట‌మి) ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ‌ను ఏర్పాటు చేసింది. అంత‌కుముందు వ‌ర‌కు మైనార్టీ మంత్రిత్వ శాఖ.. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ప‌రిధిలో ఉండేది. అయితే యూపీఏ ప్ర‌భుత్వం 2006లో మైనార్టీల సంక్షేమం కోస‌మంటూ ఆ శాఖ‌ను సామాజిక న్యాయం, సాధికారిక శాఖ నుంచి విడ‌గొట్టి ప్ర‌త్యేక శాఖ‌ను ఏర్పాటు చేసింది.

అయితే ఓటు బ్యాంకును సృష్టించుకోవ‌డం కోసం, ఆయా వ‌ర్గాల ఓట్ల‌ను కొల్ల‌గొట్ట‌డానికే ఈ శాఖ‌ను ఏర్పాటు చేశార‌ని మోడీ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అందువ‌ల్ల మైనార్టీ మంత్రిత్వ శాఖ‌ను ర‌ద్దు చేసి య‌థావిధిగా సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వ శాఖ‌లో క‌లిపేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మేర‌కు ఒక ఆంగ్ల ప్ర‌తిక ప్ర‌చురించిన క‌థ‌నం సంచ‌ల‌నం రేపుతోంది.

ఈ మేర‌కు త్వ‌ర‌లోనే మైనార్టీ మంత్రిత్వ శాఖ‌ను న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌నుంద‌ని చెబుతున్నారు. అయితే మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను రద్దు చేసినా, దీని ద్వారా ప్ర‌స్తుతం అమలు చేస్తున్న అన్ని పథకాలు విలీనం తర్వాత కూడా కొనసాగుతాయని అంటున్నారు. అయితే ఈ విషయంపై సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులు స్పందించడానికి నిరాకరించార‌ని పేర్కొంటున్నారు.

కాగా మైనార్టీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌గా గ‌తంలో బీజేపీకి చెందిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప‌నిచేశారు. అయితే ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం ఈ ఏడాది జూలైలో ముగియ‌డంతో మ‌ళ్లీ ఆయ‌న‌కు రెన్యువ‌ల్ ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ప్ర‌స్తుతం మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిత్వ శాఖ బాధ్య‌త‌ల‌ను కూడా కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చూస్తున్నారు.

కాగా మైనార్టీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌ను రద్దు చేస్తార‌ని వ‌చ్చిన వార్త‌ల‌పై కాంగ్రెస్ పార్టీ ధ్వ‌జ‌మెత్తింది. ఈ చ‌ర్య‌ల‌ను సమాజాన్ని విభజించేందుకు బీజేపీ చేసిన మరో ప్రయత్న‌మ‌ని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ మండిప‌డ్డారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంద‌ని విమ‌ర్శించారు. ప్రతి అవకాశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News