మోడీ ఏడాది పాల‌న‌: విశ్లేష‌ణ‌

Update: 2015-05-25 07:30 GMT
బంప‌ర్ మెజార్టీతో 2014 ఎన్నిక‌ల్లో బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన న‌రేంద్ర దాస్ మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం నేటితో ఏడాది పూర్తి చేసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేందుకు బీజేపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఇంత‌కీ మోడీ ఏడాదిలో ఏం చేశారు...ఆయ‌న పాల‌న‌లోని వివాదాలేంటి. సంస్క‌ర‌ణ‌ల‌తో దేశానికి ఆయ‌నేం మేలు చేకూర్చారు?  తుపాకి పాఠ‌కుల‌ కోసం ప్ర‌త్యేక క‌థ‌నం...

ప్ర‌జ‌ల‌ను తాకిన ప‌థ‌కాలు....
పేద ప్ర‌జ‌ల బాగుకోసం ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌ధాన‌మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న ద్వారా పేద‌లంద‌రికీ ఖాతాలు తెరిచే సౌల‌భ్యం క‌ల్పించ‌డం, వాటికి రుణాలు ఇప్పిండం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్త‌మైంది. అతి త‌క్కువ ప్రీమియంతో పేద‌ల‌కు బీమా అందించ‌డం కూడా మంచి అభిప్రాయాన్ని క‌లిగించాయి. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చ‌ట్టాల‌ను స‌వ‌రించి కార్మికుల‌కు చేరువ చేయ‌డం వారిలో హ‌ర్షం నింపింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో వెన‌క‌డుగు వేయ‌డం, ఆదాయ‌పు ప‌న్ను ప‌రిమితిని రూ.5 ల‌క్ష‌ల‌కు పెంచుతామ‌ని ప్ర‌క‌టించి వెన‌క్కు పోవ‌డం, ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపును నిర‌సించి ఇపుడు అదే రీతిలో ముందుకుపోవ‌డం ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌కు కార‌ణం అయింది. కార్పొరేట్ల‌కు అండగా ఉంటూ కొన్ని ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకోవ‌డం న‌ష్టం క‌లిగించింది. మేకిన్ ఇండియా ద్వారా దేశీయ సంస్థ‌ల‌కు పున‌రుజ్జీవ‌నం అందిస్తామ‌ని హామీ విజ‌య‌వంతం అవుతుంద‌నే భావ‌నలో ఉన్నారు.

వివాదాలు ఎన్నెన్నో....
మోడీ పాల‌న‌లో అతిపెద్ద వివాదాస్పదాంశం భూసేకరణ చట్టసవరణ బిల్లు. ఎప్పుడో బ్రిటిష్‌ కాలం నాటి భూసేకరణ చట్టానికి కోరలు తొడుగుతూ 2013లో కాంగ్రెస్‌ చేసిన చట్టాన్ని సవరిస్తూ ఎన్డీయే సర్కారు తెచ్చిన సవరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కార్పొరేట్లకు మేలు చేసేందుకే మోదీ సర్కారు ఈ సవరణలను ప్రతిపాదించిందన్నది ప్ర‌ధాన‌ ఆరోపణ. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిన కాంగ్రెస్‌ పార్టీకి సభలో మళ్లీ జీవం పోసింది ఈ బిల్లేనంటే అతిశయోక్తి కాదు. ప్రణాళిక సంఘం.. రెండుమూడు తరాల వారు చిన్నప్పటి నుంచి వింటున్న, పాఠాల్లో చదువుకున్న ఈ సంఘాన్ని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన మూడోరోజునే రద్దుచేశారు. దాని స్థానంలో భారతీయ నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రాల మీద కర్రపెత్తనం చేసే ప్రణాళిక సంఘం విధానాలు కాలం చెల్లినవని.. ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో అది నిరర్ధకమన్నది మోడీ సర్కారు మాట. కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం.. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర అభివృద్ధికి నిధులిచ్చింది ప్రణాళిక సంఘమేనని గుర్తుచేస్తోంది. ఇక ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కాంగ్రెస్‌ నేత అయిన‌ప్ప‌టికీ మోదీ సర్కారు ఆయన్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నంలో దాదా పు విజయం సాధించింది. కాంగ్రెస్‌ హయాంలో నెహ్రూ కుటుంబసభ్యులకు తప్ప స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న జాతీయోద్యమ నేతలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. నెహ్రూకు బదులు పటేల్‌ మనదేశానికి మొదటి ప్రధాని అయి ఉంటే బాగుండేదనుకునేవారు చాలా మంది ఉండడం.. మోదీ సర్కారు పనిని సులువు చేశాయి.  కోర్టుల విష‌యంలోనూ మోడీ వేలుపెట్టారు. దేశవ్యాప్తంగా 24 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు సంబంధించి 22 ఏళ్లుగా అమల్లో ఉన్న కొలీజయం వ్యవస్థను రద్దుచేసి దాని స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ)ను ఏర్పాటు చేయడం పెను సంచలనమే సృష్టించింది. అయితే.. ఎన్‌జేఏసీ కూడా లోపభూయిష్టంగానే ఉందన్నది పలువురు న్యాయనిపుణుల ఆవేదన. ఏ మాత్రం కసరత్తు చేయకుండా ఆదరాబాదరా దీన్ని ఏర్పాటు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో కంటే విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లోనే ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌టం వివాదాస్ప‌దం అయింది.

సుపరిపాలనే ధ్యేయం అనే నినాదాలతో దేశ ప్రజలను ఆకట్టుకున్న మోడీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఆగ్రాలో మతమార్పిడులు, ఘర్‌ వాపసీ కార్యక్రమాలు మొదలయ్యాయి. మంత్రులు, బీజేపీ ఎంపీలు, సంఘ్‌ పరివార్‌, వీహెచ్‌పీ తదితర హిందూ సంస్థల నేతలు ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలతో తేనెతుట్టెను కదిలించారు. ప్రతి హిందూ మహిళ నలుగురు బిడ్డలకు జన్మనివ్వాల‌ని, దేశంలో పుట్టిన వారంతా హిందువులే వీహెచ్‌పీ నేత  సాధ్వి ప్రాచీ వ్యాఖ్యానించారు.  రాజీవ్‌ గాంధీ ఓ నైజీరియా దేశస్థురాలిని వివాహం చేసుకుని ఉంటే.. ఆమెకు తెల్లటి చర్మం లేకుంటే కాంగ్రెస్‌పార్టీ ఆమెను తమ నాయకురాలిగా అంగీకరించేదా అని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్ ప్ర‌శ్నించారు. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.
Tags:    

Similar News