ఆ సీఎంను తప్పించడానికే మోడీ అండ్‌ కో రెడీ!

Update: 2015-06-27 05:43 GMT
లలిత్‌ మోడీ వ్యవహారంలో విమర్శలను ఎదుర్కొంటూ వివాదంలో కూరుకుపోయిన రాజస్థాన్‌ సీఎం వసుంధర రాజేను తప్పించడానికే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మొగ్గుచూపుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉండటం.. మీడియాలో కూడా రాజే వ్యవహారంపై రకరకాల కేసులు వస్తూ ఉండటంతో.. ఆమెపై చర్యలు తీసుకోవడానికే భారతీయ జనతా పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయని.. రాజేపై చర్యలు తీసుకోవాలని సంఘ్‌ సూచించిందని తెలుస్తోంది.

    అవినీతి మరకలు పడ్డ ఆమెను వెనకేసుకురావడం కన్నా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో బీజేపీకి మంచి పేరు ఉంటుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలాంటి వ్యవహారాల్లో ఇన్‌వాల్వ్‌ అయిన వారిని సంఘ్‌ ఎలాగూ క్షమించలేదు. దీంతో రాజేను తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

    అయితే.. ఇప్పటికిప్పుడు రాజేను తప్పిస్తే అది కాంగ్రెస్‌ విజయం అవుతుందని.. మీడియాకు భయపడి మోడీ చర్యలు తీసుకొన్నాడనే పేరు వస్తుందని కమలనాథులకు భయం ఉంది. అందుకే ప్రస్తుతానికి కొంత సైలెంట్‌గానే ఉండి.. ముందు ముందు మాత్రం రాజేపై చర్యలు తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది.

    ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకొంటే కాంగ్రెస్‌కు ఛాన్స్‌ ఇచ్చినట్టవుతుంది. అలాగే.. ఎప్పటికీ చర్యలు తీసుకోకపోయినా కాంగ్రెస్‌కు ఛాన్స్‌ ఇచ్చినట్టవుతుంది. అందుకే మధ్యేమార్గంగా కొన్ని రోజుల అయిన తర్వాత రాజేను రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి వేరే నేతను ఆ పదవిలో నియమించడం భారతీయ జనతా పార్టీ వ్యూహంగా తెలుస్తోంది.

Tags:    

Similar News