లేడీస్ దెబ్బకు మోదీ సర్కారు దిగొచ్చినట్టేనా?

Update: 2019-10-31 14:00 GMT
దేశంలో అవినీతిని అంతం చేస్తానంటూ అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ... అందులో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని - ఇప్పుడు కొత్తగా జనం వద్ద ఉన్న బంగారం పైనా ఆయన కన్ను పడిందని రెండు రోజులుగా వస్తున్న వార్తలు దేశంలో కొత్త చర్చకు తెర లేపాయనే చెప్పాలి. అయితే ఈ దిశగా మోదీ ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని - అసలు బంగారం పరిమితులపై మోదీ దృష్టి పెట్టారన్న మాటే ఊహాజనితమని ఇప్పుడు కొత్తగా వచ్చేసిన వార్త... దేశ ప్రజలకు భారీ ఊరటనిచ్చే వార్తగానే చెప్పాలి. ఊరటే కాకుండా... అసలు ఏటికేడు బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతున్న పెద్ద పెద్ద తలకాయలకు ఈ వార్త భారీ ఉపశమనం ఇచ్చే వార్తగానే ఈ కొత్త వార్తను చెప్పక తప్పదు. మోదీ సర్కారు వెనుకంజలో మహిళల నుంచి పెద్ద ఎత్తున ఎదురుకానున్న వ్యతిరేకతే ప్రధానమన్న వాదన కూడా వినిపిస్తోంది.

దేశంలో నల్ల ధనాన్ని నియంత్రించే క్రమంలో మోదీ సర్కారు గడచిన ఐదేళ్లలో చాలా కీలక - కఠిన నిర్ణయాలను తీసుకుంది. అప్పటిదాకా చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా బడాబాబుల సంగతి ఎలా ఉన్నా... సామాన్య జనం మాత్రం నానా ఇబ్బందులు పడ్డారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న చిన్నపాటి మొత్తాన్ని తీసుకునేందుకు కూడా గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. ఆ తీసుకునే మొత్తాన్ని ఖర్చు చేసే విషయంలోనూ జనం బాగానే ఇబ్బంది పడ్దారు. ఆ తర్వాత నోట్ల రద్దు కంటే కూడా మరింత కఠినమైన జీఎస్టీని అమల్లోకి తెచ్చేసిన మోదీ సర్కారు... నల్లధనం నియంత్రణలో ఎంతమేర వ్యతిరేకత వచ్చినా కూడా వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం జాతీయ మీడియాతో పాటుగా లోకల్ మీడియాలోనూ ఓ బాంబు లాంటి వార్త వచ్చి చేరింది. అదేంటంటే... ప్రజల వద్ద బంగారం పరిమితికి మించి ఉండరాదని, అలా ఉన్న బంగారంపై జరిమానాలు కూడా వేసేందుకు రంగం సిద్ధమవుతోందన్నదే ఈ బాంబు లాంటి వార్త సారాంశం.

అసలే బంగారం అంటే... అత్యంత ప్రీతిని చూపే వాళ్లలో ప్రపంచంలోనే మనమే తొలి స్థానంలో ఉన్నాం కదా. మనంలో కూడా పురుషుల కంటే మన లేడీస్ కే బంగారం అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పండగొచ్చిందంటే చాలు... చిన్నదో - పెద్దదో నగ కొనకుండా ఉండటం కుటుంబ యజమానులకు తప్పనిసరిగా మారింది. అలా చేయకపోతే... ఆ ఫ్యామిలీలో లేడీస్ నుంచి ఎదురయ్యే వ్యతిరేకత ఓ రేంజిలో ఉంటుందని కూడా చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో బంగారంపై పరిమితులు అంటేనే జనం బెంబేలెత్తిపోయారు. మోదీ సర్కారు ప్రవేశపెట్టే బంగారం పరిమితి స్కీంలో క్షమాభిక్ష ఎలా ఉంటుంది? జరిమానాలు ఎలా ఉంటాయి? అన్న విషయాలపై అప్పుడు పెద్ద చర్చకు తెర లేసింది. అయితే ఈ వార్తలన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని, అసలు బంగారం పరిమితిపై మోదీ సర్కారు ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని కూడా జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. ఇలా కొత్తగా ప్రవేశపెట్టనున్న గోల్డ్ స్కీంపై మోదీ సర్కారు వెనుకంజ వేయడానికి మహిళల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతే ప్రధాన కారణమన్న వాదనలు వినిసిస్తున్నాయి.


Tags:    

Similar News