2ల‌క్ష‌ల కోట్లు హార‌తి క‌ర్పూర‌మేనా మోడీజీ?

Update: 2017-10-25 07:20 GMT
మోడీ అంత మొన‌గాడు.. ఇంత మొన‌గాడంటూ వాడిన పొగ‌డ్త వాడ‌కుండా పొగిడేసిన తీరు మ‌ర్చిపోలేం. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించిన త‌ర్వాత జ‌నాలు నానా క‌ష్టాలు ప‌డుతూనే.. మొన‌గాడు మోడీ అంటూ పొగిడేశారు. అంత సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యంతో దేశంలో బ్లాక్ మ‌నీని వైట్ చేసేయ‌ట‌మో.. అక్ర‌మార్కుల ఆట క‌ట్టించ‌టం లాంటివి చేస్తార‌న్న గంపెడాశ స‌గ‌టుజీవిలో క‌నిపించింది.

ఈ కార‌ణంతోనే చేతికి అవ‌స‌ర‌మైన నాలుగువేల కోసం గంట‌ల కొద్దీ స‌మ‌యాన్ని ఏటీఎం క్యూల కోసం వెచ్చించారు. అయితే.. తాము చేసిన త్యాగాల‌కు ఎంత‌పాటి విలువ అన్న విష‌యం కొత్త నోట్ల క‌ట్టలు భారీ ఎత్తున బ‌య‌ట‌ప‌డుతున్న‌ప్పుడు కానీ నోట్ల ర‌ద్దుతో లాభ‌ప‌డిందెవ‌ర‌న్న‌ది అర్థం కాలేదు.

ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఆ మ‌ధ్య‌న బ్యాంకుల‌కు భారీగా బ‌కాయిలు ప‌డిన పెద్దోళ్ల లెక్క‌లు కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అలాంటి వారిలో లిక్క‌ర్ కింగ్ మాల్యా వేలాది కోట్ల‌ను బ్యాంకుల‌కు ఎగ్గొట్టి ఎంచ‌క్కా బ్రిట‌న్‌ కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నా ఎవ‌రూ ఏం చేయ‌లేని ప‌రిస్థితి. క‌ర‌కుగా క‌నిపించే చ‌ట్టం సైతం మాల్యా లాంటోళ్ల విష‌యంలో ఏమీ చేయ‌లేన‌ట్లుగా చేష్ట‌లుడిగిపోవ‌టం స‌గ‌టుజీవి జీర్ణించుకోలేని ప‌రిస్థితి.

మాల్యా లాంటోళ్ల‌కు వేల కోట్లు అప్పులు ఇచ్చేందుకు ఉత్సాహం ప్ర‌ద‌ర్శించే బ్యాంకుల‌కు ముకుతాడు వేయ‌టంలో మోడీ స‌ర్కారు ఇప్ప‌టివ‌ర‌కూ చేసిందేమీ లేదు. ఆ మాట‌కు వ‌స్తే మాల్యా త‌ర‌హాలో బ్యాంకుల‌కు ఎగ్గొట్టిన బ‌డాబాబుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌టం.. బ్యాంకుల‌కు క‌ట్టాల్సిన ప్ర‌జాసొమ్ము విష‌యంలో లెక్క తేల్చింది లేదు.

కానీ.. తాజాగా రూ.2.11 ల‌క్ష‌ల కోట్ల మొత్తాన్ని బ్యాంకుల‌కు ఇవ్వాల‌ని మోడీ స‌ర్కారు భావిస్తున్న‌ట్లుగా వ‌చ్చిన ఒక సారాంశం చూసిన‌ప్పుడు అవాక్కు అవ్వాల్సిందే. ఇప్ప‌టికే పెద్దోళ్ల బొక్క‌సాల్లో ఇరుక్కుపోయిన వేలాది కోట్లువెన‌క్కి వ‌స్తాయా?  లేదా? అన్న సందేహాల‌పై ఒక స‌మాధానం రాని వేళ‌.. మ‌ళ్లీ ఇంత భారీ మొత్తాన్ని బ్యాంకుల‌కు కేంద్రం ఇవ్వాల‌నుకోవ‌టంలో అర్థం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగింది మ‌ర్చిపోయినా.. రానున్న రోజుల్లో బ్యాంకుల‌కు ఇచ్చే రూ.2.11ల‌క్ష‌ల కోట్ల‌లో బ‌డా వ్యాపార‌స్తుల‌కు.. పారిశ్రామిక‌వేత్త‌ల‌కే త‌ప్పించి బ‌డుగు జీవికి.. స‌గ‌టు జీవికి ఇచ్చేదేమీ ఉండ‌ద‌న్న‌ది స్ప‌ష్టం.ల‌క్ష రూపాయిల లోన్ అడిగిన మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవి నుంచి బోలెడ‌న్ని ఆధారాలు తీసుకొని కానీ రుణం ఇవ్వ‌ని స్థానే.. వేలాది కోట్ల‌ను ఏ గ్యారెంటీ పెట్టుకొని ఇస్తారో అంద‌రికి తెలిసిందే. పెద్దోళ్ల ద‌గ్గ‌ర పోగుప‌డిన వేలాది కోట్ల‌ను రిక‌వ‌రీ చేయ‌టం మీద దృష్టి పెట్ట‌కుండా.. బ్యాంకుల‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఇచ్చే రూ.2.11 ల‌క్ష‌ల కోట్లు చివ‌ర‌కు ఎక్క‌డి వెళ‌తాయ‌న్న‌ది అర్థం కానంత అమాయ‌కులు ఎవ‌రూ ఉండ‌రు. అంటే.. ఇప్ప‌టికే ఇరుక్కుపోయిన వేలాది కోట్ల స్థానే.. మ‌ళ్లీ రూ.2ల‌క్ష‌ల కోట్ల‌ను సైతం పెద్దోళ్ల బొక్క‌సాల‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నం జ‌రుగుతుందా? అన్న సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు.

పెద్దోళ్ల‌కు అప్పులు ఇచ్చిన త‌ర్వాత రిక‌వ‌రీ కోసం కిందామీదా ప‌డ‌టం.. దానికి మిన‌హాయింపులు ఇవ్వ‌టం.. రీషెడ్యూల్ చేయ‌టం.. ఇలా ఎన్నివిధాలుగా చేయాలో అన్ని విధాలుగా చేసుకుంటూ పోవ‌ట‌మే త‌ప్పించి.. ఇచ్చిన రుణాన్ని బ్యాంకుల‌కు తీసుకొచ్చే స‌త్తా లేన‌ప్పుడు ఇంత భారీ ఎత్తున ప్ర‌జాధ‌నాన్ని బ్యాంకుల్లో కుమ్మ‌రించ‌టం ఎందుకంటారు?
Tags:    

Similar News