సీఎం బెడ్రూంలోకి అధికారుల్ని పంపిన మోడీ?

Update: 2019-02-04 09:56 GMT
గ‌తంలో మ‌రే ప్ర‌ధాన‌మంత్రి మీద రాని ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు ప్ర‌ధాని మోడీ మీద వ‌స్తున్నాయి. వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిగా స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇచ్చే పెద్ద‌మ‌నిషికి పార్టీ ప్ర‌యోజ‌నాలంటే మ‌హా పిచ్చి. పార్టీకి పేరు ప్ర‌ఖ్యాతులు.. ప‌వ‌ర్ కోసం దేనికైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం మోడీకి అల‌వాటుగా ప‌లువురు విమ‌ర్శిస్తుంటారు.  దేశం ప‌లువురు ప్ర‌ధాన‌మంత్రుల్ని చూసింది కానీ.. రాజ‌కీయ శ‌త్రుత్వంలో భాగంగా.. స‌ద‌రు నేత‌ల్ని అధికార వ్య‌వ‌స్థ‌ల చేత వెంటాడి.. వేధించే ప‌నిని మోడీ మాదిరి చేయ‌లేద‌ని చెబుతారు.

ఆ మాట‌కు వ‌స్తే.. ఇలాంటి ద‌రిద్రాల‌కు మూలం కాంగ్రెస్సే అయినా.. వారి తీరు కాస్త భ‌యం.. భ‌యంగానే ఉంటుంది. విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన వెంట‌నే వివాదాల జోలికి వెళ్లేందుకు భ‌య‌ప‌డే తీరుకు మోడీ పూర్తి విరుద్ధం. ఎవ‌రేం అనుకుంటే మాత్రం.. తాను అనుకున్న‌ది పూర్తి అయ్యే వ‌ర‌కూ దేన్ని ప‌ట్టించుకోరు. లోకం మొత్తం ఒక‌టైనా.. తాను అనుకున్న‌ది పూర్తి కావాల్సిందేన‌న్న‌ట్లుగా మోడీ తీరు ఉంటుంది.

త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించే క్ర‌మంలో ఆ మ‌ధ్య‌న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు  కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి ఉన్న వేళ‌లో.. సీబీఐని వారింట్లో త‌నిఖీలు చేయించ‌టం ఒక సంచ‌ల‌నం అయితే.. అది కూడా స‌ద‌రు సీఎం కుమార్తె పెళ్లి వేడుక జ‌రుగుతున్న రోజులోనే కావ‌టం గ‌మ‌నార్హం. తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌త‌తో మోడీకి ల‌డాయి న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా కోల్ క‌తా న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ను శార‌ద కుంభ‌కోణంలో భాగంగా విచార‌ణ‌ను ఎదుర్కోవ‌టం.. ఆయ‌న్ను ప్ర‌శ్నించేందుకు సీబీఐ అధికారులు హుటాహుటిన రావ‌టంపై దీదీకి కోపం రావ‌టం.. త‌ర్వాత ఆమె తీసుకున్న చ‌ర్య‌ల‌న్ని అంద‌రికి తెలిసిన‌వే.

ఈ ఉదంతం నేప‌థ్యంలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ నోరు విప్పారు. గ‌తంలో త‌న విష‌యంలో ఏం జ‌రిగిందో బ‌య‌ట‌పెట్టారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న ఇంట్లో కూడా పోలీసుల‌తో సోదాలు చేయించార‌ని.. త‌నిఖీల్లో భాగంగా పోలీసులు త‌న బెడ్రూం.. వంట‌గ‌దిలోకి వ‌చ్చార‌న్నారు. భార‌త స‌మాఖ్య విధానాన్ని మోడీ దెబ్బ తీసేలా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా మండిప‌డ్డారు.సీబీఐ.. ఈడీ, ఐటీ విభాగాల‌ను ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ పార్టీ నేత‌ల‌పై ఊసిగొల్పుతూ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాన్ని పొందుతున్న‌ట్లుగా ఆరోపించారు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. ఒక ముఖ్య‌మంత్రి వంటింట్లోకి.. బెడ్రూంలోకి అధికారులు సోదాల పేరుతో చొచ్చుకు రావ‌టంఅభ్యంత‌ర‌క‌ర విష‌య‌మే. ఒక సామాన్యుడికి.. ఒక ప్ర‌ముఖుడికి.. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రికి మ‌ధ్య వ్య‌త్యాసం లేక‌పోవ‌టం నిజంగా శోచ‌నీయం. నీతులు చెప్పే నోటితో.. ప్ర‌త్య‌ర్థుల‌పై ఆ స్థాయిలో విరుచుకుప‌డ‌మ‌ని మోడీ ఎలా చెబుతార‌న్న‌ది ఎప్ప‌టికి బిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News