రాహుల్ చెప్పిన మాట‌ను చెప్పే ధైర్యం మోడీకి ఉందా?

Update: 2019-04-05 11:05 GMT
24 గంట‌లు కూడా గ‌డ‌వ‌లేదు.. బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి. రాజ‌కీయంగా విభేదించే వారంతా ప్ర‌త్య‌ర్థులే కానీ శ‌త్రువులు ఎంత మాత్రం కాద‌న్న మాట‌ను తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేసి.. త‌న మాట‌ల‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ. స్ప‌ర్ద మంచిదే..కానీ దాన్ని వ్య‌క్తిగ‌తంగా తీసుకోవ‌టం ఏ మాత్రం స‌రికాదు. కానీ.. ఈ విష‌యాన్ని మోడీ అర్థం చేసుకునే స్థాయిలో లేర‌ని చెప్పాలి. ఆయ‌న రాజ‌కీయం మొత్తం.. త‌న‌కు ఎదురు ఉండ‌కూడ‌ద‌నే.

ప్ర‌జాస్వామ్య భార‌తంలో ప్ర‌శ్నించే ప్ర‌తిప‌క్షం ఉండాలి. అది కూడా బ‌లంగా ఉండాలి. అప్పుడే మ‌రింత బాధ్య‌త‌గా ప‌ని చేసే అవ‌కాశం ఉంటుంది. అంతేకానీ.. నాకు న‌చ్చిందే చేయాలి.. నేను అమ‌లు చేసే దాన్ని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌ద‌న్న భావ‌న మంచిది కాదు.ప్ర‌త్య‌ర్థుల్ని శ‌త్రువుల‌గా.. అంత‌కు మించి దేశ‌ద్రోహులుగా అభివ‌ర్ణించే దుష్ట‌సంప్ర‌దాయం బీజేపీకి అస్స‌లు లేద‌న్న మాట అద్వానీ త‌న బ్లాగులో చెప్ప‌టం ద్వారా.. ఇప్పుడున్న బీజేపీ త‌న ప్రాథ‌మిక‌మైన నిబంధ‌న‌ను ఉల్లంఘిస్తుంద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు.

ప్ర‌త్య‌ర్థిని కూడా ప్రేమించాలి. అత‌డిలోని చెడ్డ గుణాన్ని మాత్ర‌మే ద్వేషించాలే త‌ప్పించి.. అత‌డు నాలాంటివాడే అన్న మాన‌వ‌త్వం చాలా అవ‌స‌రం. అలాంటి తీరు త‌న‌లో ట‌న్నులు.. ట‌న్నులు ఉంద‌న్న విష‌యాన్ని రాహుల్ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు చెప్ప‌క‌నే చెప్పేస్తాయి. మ‌హారాష్ట్రలోని పుణెలో విద్యార్థుల‌తో ముఖాముఖిలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఐల‌వ్ న‌రేంద్ర మోడీ. నాకు ఆయ‌న‌పై ఎలాంటి ఆగ్ర‌హం.. ద్వేషం లేదు.. ఆయ‌న్ను నేను ప్రేమిస్తాను. నేను స‌త్యం ఆధారంగా ప‌ని చేస్తా. దాని నుంచే మాన‌వ‌త్వం పుట్టుకొస్తుంది. మాన‌వ‌త్వం నుంచే ధైర్యం వ‌స్తుంది. బ‌ల‌హీన‌వ‌ర్గాల‌నై రైతుల త‌ర‌ఫున నేను నిల‌బ‌డ‌తా.. కనీస ఆదాయ భ‌రోసా ప‌థ‌కంలో భాగంగా పేద‌వారికి ఏడాదికి రూ.72వేలు ఇస్తామ‌న్న హామీని నెర‌వేరుస్తామంటూ త‌న ఎజెండాను చెప్పేశారు రాహుల్.

ఒక మాన‌వ‌తామూర్తి మాట్లాడిన‌ట్లు మాట్లాడుతూనే.. త‌న‌లోని రాజ‌కీయ కోణాన్ని బ‌య‌ట‌పెట్టారు రాహుల్‌. ప్ర‌తి రోజు భార‌త్ 27వేల ఉద్యోగాలు రాకుండా కోల్పోతుంద‌ని.. అనిల్ అంబానీ.. మెహుల్ చోక్సీ వంటి వారి ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలోని ఎంత‌మంది యువ‌త‌కు ఉద్యోగాలు ఇచ్చారు?  ఇప్ప‌టివ‌ర‌కూ ఎంత‌మేర రుణ‌మాఫీ చేశారు? అని ప్ర‌శ్నించారు.

తాము అధికారంలోకి వ‌స్తే పార్ల‌మెంటు.. విధాన స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు వ‌చ్చేలా కృషి చేస్తామ‌ని చెప్పిన రాహుల్.. పెద్ద నోట్ల ర‌ద్దు చాలా ఘోర‌మైన ఆలోచ‌న‌గా చెప్పారు. కోట్లాది ఉద్యోగాలు కోల్పోయామ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాక్ లోని బాలాకోట్ లోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త్ జ‌రిపిన దాడుల గొప్ప‌ద‌నం అంతా వైమానిక ద‌ళానిదేన‌ని.. ఆ విష‌యాన్ని రాజ‌కీయం చేయ‌కూడ‌ద‌న్నారు. ఈ విష‌యంలో రాజ‌కీయం చేస్తున్న ప్ర‌ధాని మోడీ ప‌ట్ల తాను అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్లు చెప్పారు.

తాను ప్ర‌జ‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పే ధైర్యం ఉంద‌న్న రాహుల్.. త‌న మాదిరే ప్ర‌ధాని మోడీ కూడా ప్ర‌జ‌ల ఎదుట నిల‌బ‌డి వారు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నారు? అని ప్ర‌శ్నించారు. మోడీ త‌ప్పుల్ని వ‌రుస పెట్టి చెబుతూ.. ప్ర‌ధాని మీద త‌న‌కు కోపం.. ద్వేషం లేద‌ని.. ప్రేమ ఉంద‌న్నారు. రాహుల్ ప్రేమ మాట‌ల్ని.. ఐల‌వ్యూను మోడీ ఎంత‌లా ఎట‌కారం చేస్తారో చూడాలి. ఏది ఏమైనా ఒక‌టి మాత్రం నిజం.. త‌న ప్ర‌త్య‌ర్థిని హృద‌య‌పూర్వ‌కంగా కౌగిలించుకోవ‌టం.. ఆయ‌న‌కు ఐల‌వ్యూ లాంటివి చెప్ప‌టం మోడీకి మాత్రం సాధ్యం కావ‌న్న మాట వినిపిస్తోంది. అది అబ‌ద్ధ‌మ‌ని మోడీ నిరూపించుకుంటారేమో చూడాలి.


Tags:    

Similar News