మిత్రుడంటే ఎలా ఉండాలో చెప్పిన ముఫ్తీ

Update: 2015-11-02 08:48 GMT
మిత్రుడు అనే వాడు ఎలా ఉండాలి? అధికరపక్షమైన బీజేపీ నేతలకు ఇప్పుడు తెలిసి వచ్చే అవకాశం ఉంది. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మీద గత కొద్ది రోజులుగా ‘‘పరమత సహనం’’ తగ్గిపోతుందన్న ఆందోళన పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దేశంలో చోటు చేసుకుంటున్న సంఘటనలకు ప్రధాని మోడీనే కారణమని.. కేంద్ర సర్కారు తీరుతోనే ఇలాంటివి జరుగుతున్నాయంటూ రాజకీయ పక్షాలు.. విద్యావంతులు.. వ్యాపారులు.. మేధావులు.. సెలబ్రిటీలు.. చివరకు పారిశ్రామికవేత్తల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయే మిత్రపక్షాల్లో ఏ ఒక్క మిత్రపక్షానికి చెందిన అధినేత కూడా ఈ విషయాల మీద పెదవి విప్పటం లేదు. నిజానికి ఈ అంశంపై మాట్లాడి మైనార్టీలకు ఎక్కడ దూరం అవుతామోనన్నభయంతో జాగ్రత్తగా ఉంటున్న పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఎన్డీయేలోని మిగిలిన మిత్రపక్షాలకు భిన్నంగా జమ్మూకాశ్మీర్ లో బీజేపీతో చట్టాపట్టాలు వేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పీడీపీ నుంచి ఊహించని విధంగా సానుకూల సందేశం ఒకటి వెలువడింది.  మోడీకి బలమైన మద్ధతును ఆయన ఇచ్చేశారు. ఎలాంటి సందేహం లేకుండా మాట్లాడేసిన జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయూద్  మిత్రుడంటే ఎలా ఉండాలో చేతల్లో చేసి చూపించాడు.

తన మాటలతోమోడీకి పూర్తి మద్దతు ప్రకటించిన ఆయన.. తమ మధ్య బంధం చాలా బలంగా ఉందని.. తమ కూటమికి వచ్చే నష్టం ఏమీ లేదని తేల్చి చెప్పారు. జమ్మూకాశ్మీర్ లో పర్యటించే ప్రధాని మోడీ.. శ్రీనగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో తనపై వస్తున్న విమర్శలకు కచ్ఛితమైన సందేశాన్ని ఇస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా మాట్లాడే నేతల మాటలకు.. మత ఉద్రిక్తతలు పెంచే పార్టీ నేతలకు మోడీ కళ్లెం వేయటం ఖాయమని నమ్మకంగా చెబుతున్నారు.

త్వరలో కాశ్మీర్ పర్యటించనున్న మోడీ.. జమ్మూకాశ్మీర్ కు వాజ్ పేయ్ హయాంలో మాదిరి ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందన్న ఆయన.. పాకిస్థాన్ తో స్నేహ హస్తాన్ని అందించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అసలుసిసలైన మిత్రుడిగా వ్యవహరించి.. కూటమిలోని మిగిలిన మిత్రులకు ముఫ్తీ సందేశాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి.. ముఫ్తీ మహమ్మద్ మాదిరి మాట్లాడే సాహసం ఎన్డీయే కూటమిలోని మిగిలిన నేతలు చేస్తారా..?
Tags:    

Similar News