మీడియా మీద మోడీ ఎలాంటి జోకులేస్తారు?

Update: 2019-10-23 04:41 GMT
ప్రముఖులు చాలామందితో ప్రధాని మోడీ తరచూ భేటీ అవుతుంటారు. ప్రధానమంత్రి స్థానంలో ఉన్నోళ్లు చేసే పని అదే కదా? అని క్వశ్చన్ మీరు వేయొచ్చు. కానీ.. మిగిలిన ప్రధానులకు మోడీకి చాలానే వ్యత్యాసం ఉంది. మూస పద్ధతిలో సాగే మీటింగ్స్ ను బ్రేక్ చేసే సత్తా మోడీ సొంతంగా చెప్పాలి. వర్తమానంలో కరెంట్ టాపిక్ గా ఉన్న వారిని కలుసుకునేందుకు మోడీ ఆసక్తిని ప్రదర్శిస్తారు.

వారితో మీటింగ్ కోసం వినూత్నంగా ప్రయత్నాలు చేస్తారు. సదరు ప్రముఖులు తన వద్దకు వచ్చేలా చేసుకుంటారు. వార్తల్లో ఉండే వ్యక్తులు మాట్లాడే మాటలకు ఉండే విలువ అంతా ఇంతా కాదు. అలాంటి వారి చేత తన విధానాలు భేష్ అనేలా చేయటం మోడీ టాలెంట్ లో అనూహ్యంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. ప్రముఖులతో భేటీ అయ్యే సందర్భంగా వారి మధ్య చాలా విషయాలు ప్రస్తావనకు వస్తాయని చెబుతారే కానీ.. ఇప్పటివరకూ ఏ ఒక్కరూ స్పెసిఫిక్ గా చెప్పింది లేదు.

మీడియాను ఉద్దేశించి మోడీ తీరు ఎలా ఉంటుంది? ఆయన ఎలాంటి భావనలో ఉంటారు? మీడియా మీద మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారనన ఆసక్తి ఉన్నప్పటికీ.. ఇప్పటివరకూ ఎవరూ ఆ విషయాల్ని రివీల్ చేసింది లేదు. తాజాగా.. ఆ కొరతను తీర్చేశారు ప్రవాస భారతీయుడు కమ్ నోబెల్ పురస్కార విజేత అభిజిత్ బెనర్జీ.  

మోడీ పాలనా విధానాలపై ఆయన విమర్శలు చేస్తారన్న పేరుంది. అలాంటి ఆయన ప్రధానితో భేటీ కావటంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమైంది. మీడియా సైతం వీరి భేటీని ఎంతో ఉత్కంటతో చూసింది. ఈ సందర్భంగా అభిజిత్ తో భేటీ వేళ.. మీడియా మీద ప్రధాని వేసిన జోకుల గురించి.. ఎటకారం ఆడిన వైనాన్ని అభిజిత్ బయట పెట్టేశారు. మీడియాను ఉద్దేశించి మోడీ మాటలు ఇలా ఉంటాయని చెప్పిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో అభిజిత్ ఒకరిగా చెప్పక తప్పదు.

ఇంతకూ మీడియా మీద మోడీ మాష్టారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్నది చూస్తే.. ప్రధానిని తాను కలిసిన తర్వాత మీడియా మీద ఆయన బోలెడన్ని జోకులు వేసినట్లుగా వెల్లడించారు. మోడీకి వ్యతిరేకంగా మీరేమైనా చెబుతారేమోనని బయట మీడియా కాచుకొని కూర్చుంది.. మీ నుంచి అలాంటి వ్యాఖ్యల్ని రాబట్టాలని ప్రయత్నిస్తుందని మోడీ తనతో నవ్వుతూ చెప్పిన విషయాన్ని అభిజిత్ చెప్పేశారు.

అంతేకాదు.. మీడియా ప్రతినిధులు ఏం చేస్తారన్న విషయాన్ని మోడీ గమనిస్తూ ఉంటారని.. తన విషయంలో మీడియా ఏం చేస్తుందన్నది ఆయనకు బాగా తెలుసన్న అభిజిత్.. మోడీ టీవీ చూస్తుంటారని పేర్కొన్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా..మీడియా విషయంలో మోడీ ఆలోచనలు ఎలా ఉంటాయన్న విషయాన్ని అభిజిత్ నోట రావటం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News