అందుకే మోడీ ఔరంగ‌జేబు మాట వాడారా?

Update: 2017-12-05 03:59 GMT
వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌ధాని మోడీ నోట మాట‌లు తూటాల మాదిరి పేలుతున్నాయి. అంతా త‌న‌కు అనుకూలంగా ఉండి.. త‌న‌కు తిరుగులేద‌న్న రీతిలో ఉన్న‌ప్పుడు నాలుగు మంచి మాట‌లు చెప్ప‌టం తెలివైనోళ్లు చేసే ప‌ని. అదే స‌మ‌యంలో త‌మ‌ను తాము ఫ్రూవ్ చేసుకోవాల‌నుకునేట‌ప్పుడు అప్ప‌టివ‌ర‌కూ సుద్దులు చెప్పే నోటితోనే సీరియ‌స్ కామెంట్లు చేసేస్తుంటారు. ప్ర‌ధాని మోడీ తీరు ఇప్పుడు అచ్చం అలానే ఉంద‌ని చెప్పాలి.

ప్ర‌స్తుతం గుజ‌రాత్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. ఆయ‌న వ్య‌క్తిత్వ వికాస లెక్చ‌ర్ల‌కు పుల్ స్టాప్ పెట్టేశారు. సుత్తి కొట్ట‌కుండా సూటిగానే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని ఉతికి ఆరేస్తున్నారు. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నిక ఖాయ‌మైన వేళ‌.. మోడీ నోట అనూహ్య వ్యాఖ్య ఒక‌టి వ‌చ్చింది.

ఇది ఔరంగ‌బేజుల రాజ్య‌మ‌న్న ఆయ‌న‌.. మొగ‌లుల పాల‌న‌లో ఎన్నిక‌లు జ‌రిగాయా? జ‌హంగీర్ త‌ర్వాత షాజ‌హాన్ వ‌చ్చారు.. ఇలాంటి ఔరంగ‌జేబుల రాజ్యం మ‌న‌కొద్దు అంటూ మోడీ మండిప‌డ్డారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్య‌కు టైమ్లీగా స్పందించిన మోడీ.. కాంగ్రెసోళ్లు ఊహించ‌ని రీతిలో పంచ్ వేశారు.

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ ఓ సంద‌ర్భంలో చేసిన వ్యాఖ్య‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న మోడీ.. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా రాహుల్ ఎన్నిక‌పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శించారు. అప్పుడేమైనా ఎన్నిక‌లు నిర్వ‌హించారా?  షాజ‌హాన్ త‌ర్వాత ఔరంగ‌జేబే వ‌స్తారంటూ చేసిన వ్యాఖ్య‌ను ప్ర‌స్తావించిన మోడీ.. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ల‌ది కుటుంబ పార్టీ అని అంగీక‌రిస్తుందా? ఈ ఔరంగ‌జేబు రాజ్యం మ‌న‌కొద్దు అంటూ గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు.

మోడీ.. ఔరంగ‌జేబు వ్యాఖ్య‌ల్లో మ‌రో శ్లేష కూడా వినిపిస్తోంద‌ని చెబుతున్నారు. తిరుగులేని రీతిలో సాగిన మొగ‌లుల సామ్రాజ్యం.. ఔరంగ‌జేబు త‌ర్వాత అంత‌మైపోయింది. అంటే.. కాంగ్రెస్ సైతం రాహుల్ గాంధీ త‌ర్వాత మొగ‌లుల రాజ్యం మాదిరి మారుతుంద‌న్న మాట‌ను మోడీ చెప్ప‌క‌నే చెప్పారా? అన్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాల్ని రాహుల్ గాంధీ చేప‌ట్టే వేళ‌.. మోడీ చేసిన ఔరంగ‌జేబు వ్యాఖ్య అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News