చిన్నమ్మకు మోడీ పంపిన సందేశం ఏమిటి?

Update: 2017-02-08 04:29 GMT
ఆదివారం మధ్యాహ్నం.. అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం జరిగి.. చిన్నమ్మను అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవటం.. అప్పటివరకూ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన పన్నీరు సెల్వం.. తాను వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఒక లేఖ రాసి ఇచ్చేయటం తెలిసిందే. సీన్ ఇక్కడ కట్ చేస్తే.. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో అమ్మ సమాధి వద్దకు చేరుకున్న పన్నీరు సెల్వం ధ్యానం చేసి.. ఆమ్మ ఆత్మ ఆదేశాల్ని దేశ ప్రజలకు మీడియా ద్వారా వెల్లడించటం తెలిసిందే.

పైకి కనిపించే ఈ ఉదంతాల వెనుక చాలానే జరిగిందన్న మాట వినిపిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం రాత్రి వరకూ జరిగిన పరిణామాలు ఒక ఎత్తు అయితే.. మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలు మరో ఎత్తుగా అభివర్ణిస్తున్నారు. సీఎంగా పదవీ బాధ్యతల్ని చిన్నమ్మ స్వీకరించటాన్ని ప్రధాని మోడీ అండ్ కో ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సందేశాన్ని చిన్నమ్మకు ప్రధాని మోడీ నేరుగా పంపినట్లుగా తెలుస్తోంది.

సీఎం పదవిని చిన్నమ్మకు కట్టబెట్టే విషయంలో కేంద్రం చాలా క్లారిటీగా ఉందని.. తాను అనుకుంటున్న విషయాన్ని లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ద్వారా చిన్నమ్మకు సందేశాన్ని పంపినట్లు చెబుతున్నారు. అయితే.. వీటిని లైట్ తీసుకున్న చిన్నమ్మ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. దీంతో కేంద్రం తన ఆటను షురూ చేసి.. సీఎంగా శశికళ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్న వేళ.. తనదైన రీతిలో వ్యవహరించి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగకుండా అడ్డుకున్నట్లుగా చెబుతున్నారు.

చిన్నమ్మ మీద ఉన్న అక్రమాస్తుల కేసుపై తీర్పు వచ్చే వరకూ తమిళనాడు వైపు వెళ్లొద్దంటూ గవర్నర్ విద్యాసాగర్ రావుకు చెప్పిన కేంద్రం.. చిన్నమ్మను సీఎం కాకుండా విజయవంతంగా అడ్డుకున్నట్లుగా చెప్పొచ్చు. అదేసమయంలో బలవంతంగా పన్నీర్ చేత రాజీనామా చేయించిన చిన్నమ్మకు మరో షాకిచ్చేలా ఆయనకు తమ మద్దతు ఉంటుందన్న సందేశాన్ని పంపి.. కార్యోన్ముఖుల్ని చేసినట్లుగా సమాచారం.

ఇదే సమయంలో.. ప్రభుత్వాన్ని కానీ ఏర్పాటు చేసిన పక్షంలో తాము మద్దతు ఇస్తామని డీఎంకే నేత స్టాలిన్ రెఢీ అయినట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే తమ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి  దురై మురుగున్ ద్వారా పన్నీర్ కు రాయబారం పంపినట్లుగా చెబుతున్నారు. ఇలా వేర్వేరు వర్గాల నుంచి వేర్వేరుగా వచ్చిన సందేశాలే.. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలకు కారణంగా చెబుతున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News