మోడీ మ‌న‌కు 10వేల కోట్ల అప్పున్నాడు..

Update: 2018-02-05 23:30 GMT
ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డ‌క‌ముందే..పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ వేడి తారాస్థాయికి చేరింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కర్ణాటకలో మాటల యుధ్ధం కొనసాగుతుంది. బీజేపీ- కాంగ్రెస్ ల మాటల తూటాలతో కర్ణాటకలో ఎన్నికల హీట్ మొదలైంది. ప్రధాని మోడీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తనదైన స్టయిల్ లో విరుచుకుపడ్డారు. అందరికీ అర్థం అయ్యే భాషలో సిద్ధూ ఇచ్చిన పంచ్ ల కర్నాటక బీజేపీని ఇరుకున పెడుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం 10 శాతం కమిషన్ తీసుకునే ప్రభుత్వమని ప్రధాని మోడీ ఆదివారం ఆరోపించారు. ప్రభుత్వ నీడలోనే క్రిమినల్స్ రాజ్యమేలుతున్నట్లు మోడీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఆరోపణలు నిరాధారమైనవని, తన ఆరోపణల పట్ల ఆధారాలు ఉంటే చూపించాలని - ఆయన ప్రసంగంలో అన్నీ అబద్దాలే ఉన్నాయని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడే ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్నట్లు సీఎం ఆరోపించారు. రాష్ట్రం గురించి అబద్దాలు చెప్పి - కన్నడీయులను మోడీ అవమానించారన్నారు. రాష్ర్టాలకు కావాల్సినన్ని నిధులు ఇచ్చినట్లు మోడీ చెబుతున్నారని, కానీ మన దగ్గర వసూల్ చేసిన పన్నులనే మనకు ఇస్తున్నారని ఆయన అన్నారు. అది కూడా అసంపూర్ణంగా విడుదల చేస్తున్నట్లు సిద్దరామయ్య తెలిపారు.

కర్ణాటకలో రాజకీయాలు విలువలతో చేయాలంటూ మోడీకి పంచ్ ఇచ్చారు. అది ఎలాగంటే అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. మోడీ ప్రధాని స్ధాయి కాదని ఆరోపించారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న 9 సంవత్సరాల్లో లోక్ యుక్త వ్యవస్థ లేదని.. అలాంటి వ్యక్తి కర్నాటకలో లోక్ పాల్ పై మాట్లాడటానికి అర్హత ఉందా అని నేరుగా ప్రశ్నించారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులిచ్చారని తెగ ప్రచారం చేసుకుంటున్నారని, రాష్ట్రం నుంచి వెళ్లిన ట్యాక్స్ లే తిరిగి పంపిచారని లెక్కలతో బీజేపీకి చుక్కలు చూపించారు. మీ సొంత డబ్బులు ఏమైనా ఇచ్చి ఉంటే చెప్పడంటూ బీజేపీపై నేరుగా సెటైర్లు వేశారు. కర్నాటక రాష్ట్రానికి 94వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. కేవలం 84వేల కోట్లు మాత్రమే ఇచ్చారని.. అంటే మన కర్నాటక సొమ్మే మోడీ దగ్గర 10వేల కోట్లు ఉందంటూ చురకలు అంటించారు. అవి ఎప్పుడు ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇక అమిత్ షా ను ఓ మాజీ జైలు పక్షిగా వర్ణించారు. రాష్ట్రంలోని మరో జైలు పక్షి ఉందని.. ఈ ఇద్దరినీ అడవిలోకి పంపించాలంటూ బీజేపీ నేతలకు చురకలు అంటించారు.

మోడీ పర్యటన తర్వాత కూడా బీజేపీలో ఊపు కనిపించకపోగా.. కాంగ్రెస్ ఎదురుదాడి పెంచటంతో కమలం పార్టీలో కంగారు మొదలైందని అంటున్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ లేని విధంగా దూకుడు ప్రదర్శిస్తుండటంతో.. మోడీ - అమిత్ షా టూర్లు మ‌రిన్ని ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తంగా క‌ర్ణాట‌క రాజ‌కీయం రంజుగా మార‌డం ఖాయ‌మ‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News