అబ‌ద్దం:హోదా ఇస్తామ‌ని తిరుప‌తిలో మోడీ చెప్ప‌నేలేదు

Update: 2018-04-30 13:01 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు తిరుప‌తి దీక్ష‌పై బీజేపీ ఎదురుదాడి మొద‌లుపెట్టింది.  తిరుపతిలో తెలుగుదేశం ప్రభుత్వం తలపెట్టిన ధర్మపోరాట సభ `ధ‌ర్మం’పై చంద్రబాబు చేస్తున్న అధర్మ పోరాటమని బీజేపీ అభివర్ణించింది. చంద్రబాబు పదేపదే చెబుతున్నట్లు నరేంద్ర మోడీ ఒక్క తిరుపతిలోనే కాదు, ఏనాడూ ఎక్కడా ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదని పార్టీ నేతలు స్ప‌ష్టం చేశారు.  బీజేపీ ఎమ్మెల్సీలు సోమువీర్రాజు - మాధవ్ మీడియాతో మాట్లాడుతూ....గత ఎన్నికల నాటి తిరుపతి సభలో మోడీ ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్లింగ్‌ లను వారు ఆదివారం ఇక్కడ విలేఖరులకు ప్రదర్శించి చూపారు. ఈ సందర్భంగా ఎంపీ గంగరాజు మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు - తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఖండించారు.

అబద్ధాలు చెప్పటానికి వెంకన్నను సాక్షిగా వాడుకోవద్దని బీజేపీ ఎమ్మెల్సీలు స్ప‌ష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, ఢిల్లీ తరహా రాజధాని నిర్మాణం చేస్తామని నాడు ప్రధాని మోడీ ఇచ్చిన హామీకి ఇప్పటికీ బీజేపీ కట్టుబడి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే తిరుపతి ఎన్నికల సభలో ప్రత్యేక హోదా ఇస్తామని నాడు నరేంద్రమోడీ ప్రకటన చేయలేదని అయితే వెంకన్న సాక్షిగా ప్రకటన చేసినట్లుగా సీ ఎం చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదారి పట్టించేలా చేస్తున్న ప్రకటనలను మానుకోవాలని కోరారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కావాలని కోరినట్లుగా ఢిల్లీలో విలేఖరుల ముందు ప్రదర్శించిన వీడియోను కూడా ప్రదర్శించారు. నెల్లూరులో నరేంద్రమోడీ చేసిన ప్రసంగంలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం వెనుక వెంకయ్యనాయుడు కృషి ఉందన్న వ్యాఖ్యలను బీజేపీ నేతలు విలేఖరులకు చూపించారు. అదే సమయంలో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ప్రదర్శించిన వీడియోలో ప్రత్యేక హోదా అడిగినట్లుగా ఉన్న క్లిప్పింగ్స్‌ ను బాబు మార్ఫింగ్ చేయించాడని బీజేపీ నేతలు ఆరోపించారు. అలాంటప్పుడు చట్టపరమైన చర్యలపై ఎందుకు దృష్టి పెట్టలేదని విలేఖరులు బీజేపీ నేతలను ప్రశ్నించారు. చట్టపరంకన్నా ప్రజాకోర్టులో తేల్చుకుంటామని సమాధానమిచ్చారు. నరేంద్రమోడీ తిరుపతి ఎన్నికల ప్రచార సభలో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి తిరుపతిలో మోడీ చేసిన నాలుగు పేజీల ప్రసంగం పాఠాన్ని విలేఖరులకు అందించారు. ఇందులో వెనుకబడిన గుజరాత్‌ను ముఖ్యమంత్రిగా తాను ఎలా అభివృద్ధి చేశానో ప్రధానిగా తనను గెలిపిస్తే రాష్ట్రాన్ని అలా అభివృద్ధి చేస్తానని అన్నారన్నారు. అలాగే సీమాంధ్రను హైదరాబాద్ తరహాలో హైటెక్ సిటీగా తయారుచేయడానికి ఏ చర్యలు తీసుకోవాలో మోదీ వివరించిన తీరును తెలియజేశారు. సీమాంధ్రలో ఉన్న విశాఖ సాగర తీరాన్ని ఉపయోగించుకుని విశ్వ వాణిజ్యరంగంలో ఎలా ఎదగవచ్చో వివరించినట్లు చెప్పారు. ఏపీలో సంపదను సృష్టిస్తానని, ప్రపంచం దృష్టి ఏపీవైపు మళ్లేలా చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సోనియా - రాహుల్ గాంధీపై చేసిన విమర్శలను తెలిపారు. గంగా - కావేరి నదుల అనుసంధానం అటల్ బిహారీ వాజ్‌ పాయ్ కలలను సాకారం చేస్తానని మోదీ చెప్పినట్లు వివరించారు.

హోదా ఇచ్చే అవకాశం లేకపోవడంతో దానికి సమానంగా ఇస్తామన్న ప్యాకేజీని ప్రశంసించిన చంద్రబాబు - విపక్షాల ఒత్తిడిని తట్టుకోలేక తిరిగి హోదా పల్లవి అందుకున్నారని బీజేపీ నేత‌లు మండిప‌డ్డారు. హోదా ఇవ్వలేదని కేంద్రాన్ని విమర్శిస్తున్న చంద్రబాబు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వందల హామీల్లో ఒక్కదాన్నీ నెరవేర్చలేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీ - డ్వాక్రా రుణమాఫీ - నిరుద్యోగ భృతి - పేదలకు ఇళ్లు - ఇంటికో ఉద్యోగం - దళితులకు ఎకరా భూమి - బీసీలకు న్యాయం.. ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలనే తన కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రాజధానిలో ఒక్క శాశ్వత భవనాన్నీ నిర్మించలేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికీ చేయనట్లు ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సహాయం చేసిందన్నారు. రాష్ట్రానికి ఎంతో చేస్తున్న కేంద్రాన్ని - మోదీని విమర్శిస్తూ తిరుపతిలో నిరసన సభ నిర్వహించడం తగదని చంద్రబాబుకు సూచించారు. పాలనాపరమైన వైఫల్యాలను ఎదుర్కోలేక ప్రజల దృష్టిని మళ్లించి - కేంద్రంపై బురద చల్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన దీక్షలు చేపట్టారని విమర్శించారు. చంద్రబాబు ఒకరోజు దీక్షకు రూ. 30కోట్లు ఖర్చు చేశారని - అదే మోదీ దీక్ష చేస్తే ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదన్నారు. ఎవరైనా చంద్రబాబు తప్పులను ఎత్తిచూపితే తెలుగువారిపై దాడిగా అభివర్ణించడం సిగ్గుచేటన్నారు. విజయవాడ దీక్షలో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నోటికొచ్చినట్లు ప్రధానిని అసభ్య పదజాలంతో దూషిస్తుంటే చంద్రబాబు కనీసం వారించలేదని విమర్శించారు. చంద్రబాబు అవినీతి కార్యకలాపాలు బయటకు రానీయకుండా ఉద్యోగులు - విద్యార్థులతో బలవంతంగా ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల లెక్కలు అడిగితే కేంద్రం రాష్ట్రంపై కుట్ర చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు.
Tags:    

Similar News