మోడీ వారి 'వార్త‌ల ప‌థ‌కం'.. వింత‌గా ఉందా మీరే చ‌ద‌వండి!!

Update: 2023-01-19 12:30 GMT
ప‌థ‌కం అంటే ఏంటి?  ముఖ్యంగా అధికారంలో ఉన్న‌వారు అమ‌లు చేసే ప‌థ‌కాల వెనుక ల‌క్ష్యం ఏంటి? అంటే.. అర‌టి పండు ఒలిచి చేతిలో పెట్టినంత ఈజీగా చెప్పుకోవ‌చ్చు. సో.. ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి చేకూరుస్తున్న‌ట్టు ఉండే ప‌థ‌కాలు.. త‌మ‌కు ఎన్నిక‌ల్లో ల‌బ్ధి చేకూర్చేలా ఏర్పాటు చేసుకోవ‌డ‌మే ఈ ప‌థ‌కాల వెనుక ఉన్న కీల‌క సూత్రం. అంటే.. ఒక ర‌కంగా.. క్విడ్ ప్రో కో! మీకు ప‌థ‌కం.. మాకు ఓటు అనే!!

ఇక‌, ఈ ప‌థ‌కాల‌ను ఎవ‌రు నిర్దేశిస్తారు?  ఎవ‌రు వండి వారుస్తారు? అంటే.. పాల‌కులే క‌దా!  దీనిలో ప్ర‌జ‌ల ఇష్టం ఏమీ ఉండ‌దు. వారికి న‌చ్చింది ఇస్తారు.. అలాగే.. ఇప్పుడు కేంద్రంలోని మోడీ స‌ర్కారు కూడా ప‌రోక్షంగా 'వార్త‌ల ప‌థ‌కం'  తీసుకువ‌చ్చింది. అంటే.. ఇప్ప‌టికే అర్ధ‌మై ఉంటుంది. తాము చెప్పింది.. తాము రాసింది మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు చేరాల‌న్న మాట‌!!

ఎవ‌రైనా.. ఒక‌వేళ.. ఏదైనా విమ‌ర్శో.. ప‌థ‌కాన్ని త‌ప్పుబ‌ట్ట‌డ‌మో చేస్తే.. వెంట‌నే కేంద్రంలోని అన్ని విభాగాలూ మూకుమ్మ‌డిగా రంగంలోకి దిగిపోయి.. స‌ద‌రు వార్త‌పై 'ఫేక్‌' అని ముద్ర వేసేసి.. కంటెంట్‌ను తొల‌గించేస్తాయి.  దీనిని ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. 2024 ఎన్నిక‌ల ముందు.. తీసుకున్న ఈ నిర్న‌యంపై.. దేశ‌వ్యాప్త మీడియా రంగం గ‌గ్గోలుపెడుతుండ‌డం గ‌మ‌నార్హం.

అస‌లేంటిది?

ప్రభుత్వానికి చెందిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ)లోని నిజనిర్ధారణ విభాగానికి కొన్ని అధికారాలు ఉన్నాయి. ఏదైనా ఒక వార్త‌, లేదా.. ఒక క‌థనంలో లోపాలు ఉన్నా.. త‌ప్పుగా ఉన్నా..వెంట‌నే దానిని 'ఫేక్‌'గా నిర్ధారిస్తుంది. దీనికి గ‌ల కార‌ణాలు పేర్కొంటూ.. స‌ద‌రు వ్య‌వ‌స్థ‌ల‌ను అలెర్ట్ చేసి..  తొల‌గించేలా ప్ర‌య‌త్నిస్తుంది. అయితే.. ఇప్పుడు  'ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌-2021కు కేంద్ర ఐటీ శాఖ  సవరణను ప్రతిపాదించింది.

దీని ప్ర‌కారం పీఐబీ మాత్రమే కాదు.. ప్రభుత్వానికి చెందిన ఇత‌ర విభాగాలు కూడా  ఒక వార్త నిజం కాదని ప్రకటిస్తే అలాంటి వార్తలను సామాజిక మాధ్యమాల నుంచి, ప్రధాన మీడియా నుంచి కూడా తొలగించా ల్సిందే. దీనికి కార‌ణం కూడా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇది అమల్లోకి వస్తే.. ప్రభుత్వ తప్పిదాలను, ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎత్తిచూపుతూ వచ్చే కథనాలను 'నిజనిర్ధారణ' పేరుతో తొలగించేయ‌డం అత్యంత ఈజీఅన్న‌మాట‌.

త‌మ‌కు న‌చ్చిన‌.. తాము మెచ్చిన వార్త‌ల‌నే ప్ర‌జ‌ల‌కు అందించే(వార్త‌ల ప‌థ‌కం టైపులో)లా ఒక‌ర‌క‌మైన హుకుం జారీ చేసే అవ‌కాశం ఉంటుంది. దీనిపై ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఐటీ శాఖకు ఒక లేఖ రాసింది. ప్రభుత్వంపై చేసే సహేతుకమైన విమర్శల గొంతు నొక్కే సవరణగా దీన్ని అభివర్ణించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సవరణ ద్వారా భావ ప్ర‌క‌ట‌నా హ‌క్కు హ‌రించిన‌ట్టేన‌ని పేర్కొంది. మ‌రి మోడీ వారి పాల‌న‌లో ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News