రాజకీయ పార్టీలకు మోడీ బంపర్ ఆఫర్

Update: 2016-12-17 09:30 GMT
దేశంలో ప్రజలకు లేని సరికొత్త మినహాయింపును రాజకీయ పార్టీలకు ఇస్తూ మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నల్లధనానికి చెక్ పెడుతూ.. నల్ల కుబేరులకు చుక్కలు చూపించేందుకే పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్న మోడీ సర్కారు తాజాగా పొలిటికల్ పార్టీలు పండగ చేసుకునేలా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రాజకీయ పార్టీలకు భారీ లబ్థిని చేకూరేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమయ్యేలా తాజా నిర్ణయం ఉండటం గమనార్హం.

నల్లకుబేరులు తమ వద్దనున్న బ్లాక్ మనీని వెల్లడించేందుకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన మోడీ సర్కారు.. అదే క్రమంలో రాజకీయ పార్టీలకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో కీలకమైన అంశం ఏమిటంటే.. రద్దు చేసిన రూ.వెయ్యి.. రూ.500 నోట్లను డిసెంబరు 30లోపుల రాజకీయ పార్టీలు పార్టీ బ్యాంకు ఖాతాలో ఎంత మొత్తం డిపాజిట్ చేసినప్పటికీ.. వాటి వివరాల్నివెల్లడించాల్సిన అవసరం లేదని రెవెన్యూ కార్యదర్శి హన్ ముఖ్ ఆథియా పేర్కొన్నారు.

పార్టీలు డిపాజిట్ చేసే మొత్తాలకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకున్నా.. ఆ మొత్తాల్ని చెల్లించిన దాతల వివరాల్ని మాత్రం పార్టీలు వెల్లడించాల్సి ఉంటుంది. ఇది కాస్త ఇబ్బందికరమైన అంశమే అయినప్పటికీ.. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా.. దేశంలో మరెవరికీ లేని మినహాయింపుల్ని రాజకీయ పార్టీలకు ఇస్తూ నిర్ణయం తీసుకోవటం ద్వారా.. మోడీ సర్కారు పొలిటికల్ పార్టీలకు ఫేవర్ చేసిందన్న అభిప్రాయం కలగక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News