ఏడాదంతా మోదీ... ఎలక్షన్లొస్తే అపరిచితుడే

Update: 2017-12-11 09:42 GMT
ఎన్నికలొస్తే ప్రధాని నరేంద్ర మోదీలో కొత్త మనిషి బయటకొస్తాడు. ఆయన అన్ని హద్దులూ దాటేసి ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. ప్రత్యర్థి పార్టీల నుంచి ఏ ఒక్కరు ఏమాత్రం టంగ్ స్లిప్ అయినా మోదీ దాన్ని అనుకూలంగా మార్చేసుకుంటారు. తాజాగా మణిశంకర్ అయ్యర్ మాటలను ఆయన ఎంతగా వాడుకున్నారో... చివరకు రాహుల్ గాంధీ మణిశంకర్‌ను క్షమాపణలు చెప్పమనడం - పార్టీ నుంచి సస్పెండ్ చేసేవరకు వెళ్లడం తెలిసిందే. ఇలాంటి ట్విస్టులు ఇవ్వడమేకాదు... ఎక్కడి నుంచి ఎక్కడకైనా ముడిపెట్టి ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడంలోనూ మోదీని మించినవారు లేరు. తాజాగా గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకుంటోందని మోదీ ఆరోపించడం ఇందుకు పెద్ద ఉదాహరణ. అందుకే... ఎన్నికలొస్తే మోదీ అపరిచితుడు అయిపోతారని... ఆయన ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరని అంటున్నారు.
    
గుజరాత్‌ లోని పాలన్‌ పూర్‌ లో మోదీ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ నేతలతో కాంగ్రెస్ అగ్రనేతలు భేటీ అయ్యారని ఆరోపించారు. పాక్ నేతలతో భేటీ అయిన మరుసటి రోజే మణిశంకర్ అయ్యర్ తనను ‘నీచమైన వ్యక్తి’ అని అన్నారని మోదీ ఆరోపించారు. మణి శంకర్ అయ్యర్ నివాసంలో పాక్ హై కమిషనర్ - పాకిస్థాన్ మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి - భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ - మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశమైనట్లు ఆయన ఆరోపించారు. దీనికి పాక్ కూడా స్పందించింది. తమకా అవసరం లేదని - తమపై బురద జల్లడం మానుకుని - తమ సొంత బలంపై నరేంద్రమోడీ దృష్టిపెట్టడం మంచిదని పాక్‌ విదేశాంగ శాఖ చెప్పింది.
    
ఇదంతా ఎలా ఉన్నా మోదీ ఆరోపణలు గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను గుర్తు చేస్తున్నాయి. ఆ ఎన్నికల సందర్భంగా అమెరికా చిరకాల ప్రత్యర్థి రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలొచ్చాయి. ఆ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. మోదీ తాజాగా పాక్ ప్రస్తావన తేవడం కూడా ఇలాంటిదే. ఇది ఎంతగా సెంటిమెంట్లను రగిలిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
    
ఇంతకుముందు జీఎస్టీ విషయంలో గోలగోల చేస్తున్న కాంగ్రెస్‌ విషయంలో ఇలాగే ఆయన అసలు విషయం వెల్లడించి ఆ పార్టీ మళ్లీ దానిపై గట్టిగా నోరెత్తకుండా  చేశారు. ‘‘జీఎస్టీ నిర్ణయం నా ఒక్కడిదికాదు. కాంగ్రెస్‌ తోపాటు దాదాపు 30 రాజకీయ పార్టీలు మద్దతు పలకడం వల్లే చట్టం రూపొందింది. కాంగ్రెస్ పార్టీ జీఎస్టీపై దుష్ప్రచారం చేస్తోంది. మతతత్వం - వర్గవిభేదాలు - ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే కాంగ్రెస్ లక్ష్యాలు’ అంటూ మోదీ ఇంతకుముందు ప్రచార సభల్లో అన్నారు.
    
అంతేకాదు... ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల రుణమాఫీని భారం అని చెప్పిన మోదీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంలో రుణమాఫీకి ఓకే అనడమే కాకుండా ఆ తరువాత రూ.49 వేల కోట్ల మేర అక్కడి రుణమాఫీ భారాన్నీ భరించడానికి  సిద్ధపడడమూ తెలిసిందే. ప్రజల సెంటిమెంట్లు - మెజారిటీ వర్గాల అవసరాలు గుర్తించి మాట్లాడడం.. ఆరోపణలు చేయడం.. హామీలివ్వడంలో మోదీ పండిపోయారనే చెప్పాలి.
    
అయితే.. అన్నిసార్లూ ఇది వర్కవుట్ అవుతుందా అంటే దానికి అవునన్న సమాధానం చెప్పలేం. అందుకు కారణం బీహార్ ఉదాహరణ. బీహార్ ఎన్నికల సందర్భంలో మోదీ ఆ రాష్ర్ట ప్రజలకు ఇచ్చిన ఆఫర్ అలాంటిలాంటిది కాదు. అయినా, వారు బీజేపీని తిరస్కరించారక్కడ. బిహార్‌ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన...మీకు 500 వేల కోట్లు కావాలా.. 60 వేల కోట్లు కావాలా.. అంటూ ఏకంగా రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని ప్రకటించారు. అయినా... బీహార్ ప్రజలు మాత్రం మోదీకి నో చెప్పారు.
Tags:    

Similar News