పెద్ద నోట్ల రద్దుతో లాభమా.. నష్టమా?

Update: 2016-11-12 05:30 GMT
పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు షాక్.. సామాన్యులకు కష్టాలు.. ఇదీ ఇప్పటి వరకు స్థూలంగా దీని పరిణామాలు. కానీ... అంతకుమించి ఇందులో అనేక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. అయితే... అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితేనే ఇదంతా వర్కవుట్ అయి మోడీది మంచి నిర్ణయం అవుతుంది.. లేదంటే మోడీని కూడా తుగ్లక్ వారసుల లిస్టులో వేసేస్తారు జనం.

 పెద్ద నోట్ల రద్దు వల్ల వ్యవస్థలో మార్పు వస్తుందా అంటే అప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితులు. ప్రస్తుతానికి ఒక కుదుపు వచ్చింది.. ఇది కుదుపుగానే మిగిలిపోతుందా లేదంటే మార్పుగా స్థిరపడుతుందా అన్నది ముందుముందు తెలియాలి.  శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు వెతికే మన భారతీయ అవినీతిపరులు ఈ మోడీ మార్కు షాక్ కు కూడా తమదైన రెమిడీ రెడీ చేసేసినా చేయొచ్చు.

మోడీ నిర్ణయంలో అసలైన ప్రయోజనాల్లో జనం వద్ద ఉన్న డబ్బును బ్యాంకుల్లోకి తేవడం ఒకటి. ఇప్పటికే అది మొదలైంది. దీనివల్ల బ్యాంకుల్లో నగదు నిల్వ పెరుగుతుంది. సీఆర్ ఆర్(క్యాష్ రిజర్వ్ రేషియో) పెరిగితే బ్యాంకులు ఇచ్చే రుణాలు పెరుగుతాయి. దీనివల్ల రుణాలు సులభంగా దొరకడమే కాకుండా వడ్డీ రేట్లు తగ్గుతాయి.

అదే సమయంలో ఇంకో ప్రమాదమూ ఉంది. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతాయన్నది నిజమే అయినా అనుకున్నంత పెరగకపోవడానికీ అవకాశం ఉంది. ఇంతవరకు లెక్కల్లో చూపని ఆ డబ్బును ఇప్పుడు లెక్కల్లోకి చూపించాల్సి వస్తుందనే కారణంతో చాలామంది భారీమొత్తాలు డిపాజిట్ చేయకపోవచ్చు. డబ్బును నాశనం చేసే అవకాశాలూ ఉన్నాయి. బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇది ఎక్కువైతే మార్కెట్లో నగదు లభ్యత తగ్గి ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది.

నిజానికి నోట్ల రద్దుతో పాటు అవినీతి నియంత్రణకు గట్టి చర్యలు - పన్నుల్లో తగ్గుదల ఉంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

- దేశంలో అనేక రంగాల్లో ఆదాయ పన్ను ఎగవేత భారీగా ఉంది. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ - బంగారు ఆభరణాల రంగంలో ఇది ఎక్కువగా ఉంది. అదేసమయంలో సామాన్య ఉద్యోగులు తాము జీతంగా తీసుకునే ప్రతి రూపాయీ లెక్కల్లో కనిపిస్తుండడంతో భారీగా పన్ను చెల్లించాల్సి వస్తోంది.

- ముఖ్యంగా అధికార వ్యవస్థలో అవినీతి కూడా నల్లధనం పెరగడానికి కారణం అవుతోంది. పన్ను ఎగవేతలకు దారి చూపుతోంది. ఉదాహరణకు ఒక పారిశ్రామికవేత్త నెలకు కోటిరూపాయల విలువైన ఎయిర్‌ కూలర్లను ఉత్పత్తి చేస్తే దానిపై రకరకాల పన్నులన్నీ కలిపి రూ.35లక్షల వరకు చెల్లించాలి. కానీ... అవినీతిపరులైన అధికారులకు రెండుమూడు లక్షల లంచం ఇచ్చి ఆ పన్నుల మొత్తం మిగుల్చుకుంటాడు.

ఇదంతా ఎప్పటి నుంచో స్థిరపడిపోయిన అవినీతి వ్యవస్థ. ప్రస్తుతం మోడీ తీసుకున్న నిర్ణయం ఆ వ్యవస్థలోని మనుషులు భారీగా పోగేసుకున్న డబ్బుకు నష్టం కలిగించిన మాట నిజమే. కానీ.. వ్యవస్థకు మాత్రం ఈ నిర్ణయం మందేసినట్లు కాదు. అవినీతి వ్యవస్థ అలాగే ఉండడంతో కొత్త నోట్ల దందా మళ్లీ మొదలయ్యే ప్రమాదమూ ఉంది.

- అదేవిధంగా నకిలీ నోట్లు ఆగిపోతాయని చెబుతున్నారు. కానీ.. ఎలా? వీటిని తయారు చేస్తున్న పాక్. ఇక నుంచి ఈ కొత్త నోట్లను తయారు చేస్తుంది. నకిలీ నోట్లు రాకుండా అరికట్టాలంటే చొరబాట్లు ఆగాలి.

ఇలా చేస్తే బెటర్..

నల్ల ధనం తగ్గి - ప్రజలకు పన్ను ఆదాయం పెరిగితే ప్రజల స్థితిగతులను మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

- ఆదాయం పెరిగితే ప్రభుత్వం రహదారి వ్యవస్థను మెరుగుపరచొచ్చు. రవాణా సౌకర్యం పెరిగితే గ్రామీణ ప్రాంతాలకు కూడా మార్కెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చి సంపద సృష్టించడం సాధ్యమవుతుంది.

- ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలను పెంచవచ్చు. ఉపాధి హామీ పథకం కింద వేతనాలు పెరగడం వల్ల సామాన్యుల కొనుగోలు శక్తి మరింతగా పెరుగుతుంది.

- అప్పుడు అధిక పన్నుల కారణంగా ధరలు పెరిగి వస్తువులనూ పెద్దగా కష్టం లేకుండానే కొనుగోలు చేయగలుగుతారు.

- నిజానికి అభివృద్ధి చెందిన చాలాదేశాల్లో ఇలాంటి వ్యవస్థే ఉంటుంది. అక్కడ పన్నులు అధికంగానే ఉంటాయి... పైగా వాటిని పక్కాగా వసూలు చేస్తారు. అదేసమయంలో ప్రజలకు మంచి ఆదాయ వనరులు ఉంటాయి.. సంపాదన అవకాశాలు ఉంటాయి. మెరుగైన జీతాలుంటాయి. ఈ కారణాల వల్ల వారిపై పన్ను ల భారం కనిపించదు.

- అక్కడ ప్రజలకూ మంచి ఆదాయం ఉంటుంది.. ప్రభుత్వానికీ మంచి ఆదాయం ఉంటుంది. వెరసి పేదరిక సమాజం తక్కువగా ఉంటుంది.

 - ప్రభుత్వం తొలుత పన్నురేట్లను తగ్గించి - ప్రభుత్వ యంత్రాంగంలో కింది స్థాయిలోని అవినీతిని నియంత్రించి పెద్ద విలువగల కరెన్సీనోట్లను రద్దు చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

తేడా చేస్తే తంటాలే..

- ప్రస్తుత చర్యలతో ప్రభుత్వానికి అన్ని రకాలుగా పెరిగిన ఆదాయాన్ని సక్రమ మార్గంలో వెచ్చించకపోతే దారుణమైన ప్రభావం పడుతుంది.

- ఈ సంపదను ఉత్పాదక రంగంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

- అలా కాకుండా నిరర్ధక ఖర్చులు చేస్తే కష్టాలు మొదలవుతాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News