ఎంపీల నిర‌స‌న‌లు టీవీల్లో రావొద్దంతే!

Update: 2018-02-09 05:19 GMT
మోడీ లాంటోడు దేశానికి ప్ర‌ధాని కాకుంటే భార‌త‌దేశానికి జ‌రిగే న‌ష్టం ఎంతంటే.. అంటూ కోట్లాది మంది మాట్లాడుకోవ‌టం చూశాం. నిజ‌మే.. మోడీ లాంటోడు దేశానికి ప్రధాని కాకుంటే దేశ ప్ర‌జ‌లు చాలానే మిస్ అయ్యేవారు. ప్ర‌జాస్వామ్య భార‌తానికి ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా అప్ర‌క‌టిత సెన్సారింగ్ తెచ్చిన ఘ‌న‌త ఆయ‌న‌కు మాత్ర‌మే సొంతం. మీడియాలోను త‌న అదుపులో ఉంచుకోవ‌టంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి.

మాట మాట్లాడ‌కుండా.. క‌నుసైగ బ‌య‌ట‌కు రాకుండా తానేం చేయాల‌నుకుంటారో దాన్ని ఎలాంటి మొహ‌మాటం లేకుండా చేయ‌టంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. పైసా రాల్చ‌కుండానే.. చాలా చేసేశామ‌ని చెప్ప‌గ‌లిగిన గుండె ధైర్యం మోడీకి మాత్ర‌మే చెల్లుతుంది.

బ‌డ్జెట్ లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవికి ఉప‌శ‌మ‌నం ఇచ్చే సంగ‌తి త‌ర్వాత‌.. వాళ్ల‌కు చాలానే చేశామ‌న్న మాట‌ను ఆర్థిక‌మంత్రి చేత స‌భలో చెప్పించే ధైర్యం ఆయ‌న‌కు మాత్ర‌మే ఉంది. అంతేనా.. ఎన్నిక‌ల‌వేళ ల‌క్ష‌లాది జ‌నం మ‌ధ్య‌న తానిచ్చిన హామీల్ని తుంగ‌లోకి తొక్కేయ‌ట‌మే కాదు.. తన‌కు వ్య‌తిరేకంగా మాట్లాడిన మ‌రుక్ష‌ణం కేసుల చిక్కుల్లోకి వెళ్లేలా చేయ‌టంలో ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా.

సాక్ష్యాత్తు ముఖ్య‌మంత్రుల ఆఫీసుల్లోనే కాదు.. ఇళ్ల‌ల్లోకి సైతం త‌నిఖీల పేరుతో దూసుకెళ్లేలా చేసిన అరుదైన రికార్డు కూడా మోడీ పేరిట లిఖించుకున్నారు. తానేం చెబితే దానికి త‌లాడించ‌టం.. తానేం చేస్తే దాన్ని ఓకే అనటం మిన‌హా.. మ‌రింకేం చేసినా ఇష్ట‌ప‌డ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే మోడీలో మ‌రో మ‌నిషి ఉన్నాడ‌ని.. ఆయ‌న‌లాంటి వ్య‌క్తి దేశానికి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌న్న‌ట్లు వాదించే వారు లేక‌పోలేదు. మోడీలో నిజాయితీ పాళ్లు ఎక్కువ‌ని.. అలాంటి వ్య‌క్తి దేశానికి చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్పే వారు.. త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన అమిత్ షా కొడుకు ఆస్తి స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో వంద‌ల రెట్లు ఎలా పెరుగుతుంద‌న్న విష‌యానికి స‌మాధానం చెప్ప‌రు.

ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు చెప్పేదేమంటే.. మోడీ మాష్టారి చుట్టూ ఉన్న వారికి అవినీతి మ‌కిలి అంటింద‌ని. రిమోట్‌కు ప‌ని చేసే మౌన‌సింగ్ లాంటోళ్లు దేశాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించార‌న్న ఆవేద‌న చాలామంది వ్య‌క్తం చేస్తుంటారు. ఒక‌వేళ అదే నిజ‌మ‌నుకుంటే.. క‌నీస స్వేచ్ఛ లేకుండా చేస్తున్న మోడీతో పోలిస్తే.. మౌన‌సింగ్ బెట‌రేమోన‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇప్ప‌టికే వార్త‌ల విష‌యంలో అప్ర‌క‌టిత సెన్సారింగ్ జ‌రుగుతుంద‌న్న విష‌యం కొన్ని వ‌ర్గాల‌కు తెలిసిన విష‌య‌మే.

ఇప్పుడు చ‌ట్ట‌స‌భ‌ల్ని క‌వ‌ర్ చేసే ఛాన‌ల్ సిబ్బందికి ప్ర‌త్యేక ఆదేశాలు వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. బ‌డ్జెట్ లో త‌మ‌కు జ‌రిగిన అన్యాయంపై ఏపీ ఎంపీలు చేస్తున్న నిర‌స‌ల్ని లోక్ స‌భ టీవీ.. రాజ్య‌స‌భ టీవీల్లో అస్స‌లు క‌నిపించ‌కూడ‌ద‌న్న ఆదేశాలు వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. లోక్ స‌భ‌.. రాజ్య‌స‌భ ప్ర‌శాంతంగా ఉండ‌టంతో.. గొడ‌వ జ‌రిగే సీన్ ఒక్క‌టి కూడా బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని తేల్చి చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. వీడియో చూపించ‌కూడ‌ద‌ని డిసైడ్ అయిన స‌ర్కారు.. నిర‌స‌న చేసేస‌భ్యుల ఆడియో కూడా వినిపించ‌కుండా మ్యూట్ చేయాల‌న్న ఆదేశాల్ని ఇవ్వ‌ట‌మే మిగిలింద‌ని చెప్పాలి. ఏమో.. మోడీ రాజ్యంలో ఏమైనా జ‌ర‌గొచ్చ‌నే వారి మాట‌ల్ని న‌మో నిజం చేస్తారంటారా?
Tags:    

Similar News