జనంతో జాతర చేసినా మోడీ పలుకే బంగారమాయే...

Update: 2022-11-12 07:44 GMT
పాపం వైసీపీ నేతలు. రొటీన్ పాలిటిక్స్ చేశారా. మోడీ వంటి ఢక్కా మెక్కీలు తిన్న రాజకీయ నాయకుడుని ఈజీగా బుట్టలో వేసుకుందామనుకుని  అతి ఉత్సాహానికి పోయారా. ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే మోడీ ముందు ఇవేవీ సాగక చివరికి చతికిలపడ్డారా. అంటే విశాఖ వేదికగా  జరిగిన పరిణామాలు చూస్తే అవును అనే అనిపిసోందిట.

ఇంతకీ వైసీపీ నేతలకు ఏమి జరిగింది, మోడీ మాస్టార్ ఇచ్చిన షాక్ ఏంటి అంటే చాలానే ఉంది కధ. విశాఖ ఏయూలో లక్షల మంది జనంతో సభ పెట్టి మోడీని ఫుల్ గా ఇంప్రెస్ చేయాలనుకుంది వైసీపీ. దానికి తగినట్లుగానే పది రోజుల ముందు నుంచి విజయసాయిరెడ్డి నానా కష్టాలు పడ్డారు. అటు ప్రభుత్వం ఖర్చు పదిహేను కోట్లుగా ఈ సభకు కార్యక్రమానికి అయింది. అంతేనా ప్రత్యేకించి మోదీ సభ కోసం యాప్స్ కూడా తయారు చేసిన విజయసాయిరెడ్డి పార్టీ జనాలా జేబుకూ ఖర్చు రాసేశారు.

అలా అంతా కష్టపడి జనాలను పోగేసి విశాఖలో జన సంద్రాన్ని సృష్టించారు. శ్రీకాకుళం నుంచి విశాఖ దాకా తరలివచ్చిన జనంతో మోడీ సభ కిటకిటలాడింది. ఈ దెబ్బకు మోడీ సార్ ఏపీ సర్కార్ ని శభాష్ అంటారని, ప్రశంసలతో ముంచెత్తుతారని వైసీపీ పెద్దలు భావించారు. కానీ అరగంట పాటు మాట్లాడిన మోడీ ఎక్కడా వైసీపీ ప్రభుత్వం గురించి కానీ ముఖ్యమంత్రి జగన్ గురించి కానీ పేరెత్తితే ఒట్టు అన్నట్లుగా ప్రసంగం చేశారు.

అంతే కాదు ఆయన ఎక్కడా కూడా ఏపీ సర్కార్ చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే వాటిని ప్రస్థావించలేదు. ఎంతసేపూ కేంద్ర ప్రభుత్వం గురించి మాత్రమే  గొప్పగా చెప్పుకున్నారు. ఒక విధంగా చూస్తే ఇది బీజేపీ సభలా ఎన్నికల సభలాగా మోడీ చేసుకుని వచ్చిన జనాల మీద కాషాయ మంత్రాన్ని జపించి వదిలారు అన్న చర్చ అయితే సాగుతోంది.

మీ ముఖ్యమంత్రి జగన్ అంటూ ఒక్క మాట చెప్పినా దానికి చిలవలూ పలవలూ అల్లుకుని సంబరపడవచ్చు అని వైసీపీ పెద్దలు అనుకున్నా అది మోడీ దగ్గర  కుదిరింది కాదు. రాజకీయ గండర గండడు అయిన మోడీ ముందు ఇలాంటి కుప్పిగెంతులా అన్నట్లుగా ఆయన తీసి పక్కన పడేసారు.

అందుకే ఎంతో కష్టపడి రాత్రీపగలు శ్రమించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా వేదిక మీద చోటు లభించలేదు. ఆయన ఎక్కడో ఉండిపోయారు. ఇక మోడీ సభకు  ఒక్క పైసా ఖర్చు లేదు, బీజేపీ నేతలకు ఆయాసం అంతకంటే లేదు హ్యాపీగా లక్షలాది మంది జనాల ముందు మోడీ ఎంచక్కా మాట్లాడేసి కేంద్రం గొప్పలు చెప్పేసి బై బై చెప్పి వెళ్లిపోయారు.

దీంతో ఇదేంట్రా బాబూ అని అనుకునే పరిస్థితి వైసీపీ పెద్దలది అయింది. ఇదిలా ఉంటే ఇంతమంది జనాలను పోగు చేసి తనను ఖుషీ చేయాలనుకున్న వైసీపీ పెద్దల ప్లాన్ వెనక వేరే ఉద్దేశ్యాలు ఉన్నాయని అనుకున్నారో ఏమో కానీ ఏ మాత్రం చడీ చప్పుడూ లేకుండా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే లేదు అన్నట్లుగా మోడీ ప్రసంగించేసి చల్లగా వెళ్ళిపోయారు. మొత్తానికి కష్టం ఖర్చూ పోగా మైలేజ్ ఏమీ రాలేదని వైసీపీ పెద్దల వేడి నిట్టూర్పులే ఇపుడు మిగిలాయని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News