స్మృతి ఇరానీకి ఇంకో షాక్ ఇచ్చిన‌ మోడీ

Update: 2016-07-14 08:33 GMT
మూలిగే నక్కపై తాటికాయ పడటమంటే ఇదేనేమో. ఇప్పటికే తనకిష్టమైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీ తప్పుకోవాల్సి వచ్చింది. మొన్న కేబినెట్ విస్తరణ సందర్భంగా మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీని జౌళి శాఖకు మార్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ శాఖ బాధ్యతలను మిస్లర్ క్లీన్‌ గా తెరపైకి వచ్చిన ప్రకాశ్ జవదేకర్‌ కు అప్పగించారు. దీంతో షాక్ తిన్న ఇరానీ జవదేకర్‌ కు తన మంత్రివర్గ పగ్గాలు అప్పగించే కార్యక్రమానికి కూడా గైర్హాజరయ్యారు. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ ఈ) చైర్మన్ పదవి కోసం ఆమె ప్రతిపాదించిన వ్యక్తి పేరును మోడీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

2014 డిసెంబర్ నుంచి ఖాళీగా ఉన్న సీబీఎస్ ఈ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని హెచ్ ఆర్డీ మంత్రి హోదాలో గతంలో ఇరానీ కేంద్ర సిబ్బంది - శిక్షణ వ్యవహారాల కమిటీ (డీఓపీటీ)కి లేఖ రాసింది. సదరు పదవికి ముగ్గురు విద్యావేత్తల పేర్లను ప్రతిపాదిస్తూ ఇరానీ ఆ లేఖ రాశారు. ఇరానీ ప్రతిపాదించిన ముగ్గురు వ్యక్తుల్లో ఉత్తర ప్రదేశ్ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్న సర్వేంద్ర బహదూర్ విక్రమ్ బహదూర్ సింగ్‌ - నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మిన్రిస్టేషన్‌ లో ప్రొఫెసర్‌ గా పని చేస్తున్న కమలకాంత బిశ్వాల్ తోపాటు భారత నావికాదళ విద్యా విభాగానికి అదనపు ప్రిన్సిపల్ డైరెక్టర్‌ గా ఉన్న ఖుర్రం షెహజాద్ నూర్ ఉన్నారు. వీరిలో విక్రమ్ సింగ్‌కే సీబీఎస్ ఈ చైర్మన్ పదవి ఇప్పించేందుకు స్మృతి ప్ర‌యత్నించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ ముగ్గురు పేర్లను తిరస్కరిస్తూ ఏసీసీ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు లేఖను తిప్పి పంపింది.సీబీఎస్ ఈ చైర్మన్ వంటి కీలక పదవుల భర్తీ ప్రక్రియతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు సంబంధమేమీ లేదని అపాయింట్‌ మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ (ఏసీసీ) తేల్చిచెప్పింది. ఈ కమిటీ ప్రధాని మోడీ అధ్యక్షతనే పని చేస్తున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News