మతపరంగా రెచ్చగొడుతున్న మోడీ

Update: 2023-05-03 10:38 GMT
కర్నాటకలో జనాలను ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఓటర్లను మతపరంగా రెచ్చగొట్టేందుకు నరేంద్రమోడీ ప్రయత్నిస్తున్నారా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. హోస్ పేట, రాయచూర్ ప్రాంతాల్లో జరిగిన సభల్లో మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై అనేక ఆరోపణలు చేశారు. వీటిల్లో ముఖ్యమైనది ఏమిటంటే హనుమంతుడిపై కాంగ్రెస్ కు అంత ద్వేషం ఎందుకని నిలదీశారు. కాంగ్రెస్ తన ప్రచారంలో ఇప్పటివరకు ఎక్కడా పురాణాల గురించి ప్రస్తావనే తేలేదు.
 
కాంగ్రెస్ చెప్పింది ఏమిటంటే ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ ను మాత్రమే నిషేధిస్తామని. సమాజంలో మతకలహాలకు కారణమని ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆర్ఎస్ఎస్, భజరంగదళ్ ను నిషేధించమని ఎప్పటినుండి డిమాండ్లు వినిపిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలన్నారు.

కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పై రెండు సంస్ధలను నిషేధిస్తామని మాత్రమే చెప్పింది. ఆర్ఎస్ఎస్ పై నిషేధం ఇదే మొదటిసారి కాబోదు. గతంలో కూడా ఈ సంస్ధపై నిషేధం వేటుపడింది.
 
భజరంగదళ్ నిషేధానికి హనుమంతుడికి ఏమిటి సంబంధం ? మోడీ కూడా ఇంత చవకబారుగా మాట్లాడటం ఏమీబాగాలేదు. భజరంగదళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ చెబితే హనుమంతుడంటే కాంగ్రెస్ కు ద్వేషమని మోడీ చెప్పటంలో ఏమన్నా సంబంధముందా ? హనుమంతుడిపై నిషేదం అనగానే వెంటనే శ్రీరాముడు, సీత, లక్ష్మణుడంటు గోల మొదలవుతుంది. ఎన్నికలకు ముందు ఇలాంటి గోలనే మోడీ కోరుకుంటున్నారా ? ఎందుకు మతపరమైన విధ్వేషాలకు మోడీ ప్రయత్నిస్తున్నారు ?
 
ఎందుకంటే కర్నాటక ఎన్నికల్లో బీజేపీ పరిస్ధితి ఏమీ బావోలేదు కాబట్టే. ఇప్పటివరకు వెలువడిన చాలా ప్రీ పోల్ సర్వేల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ మాత్రమే అదికూడా మంచి మెజారిటితో అని తేలింది. కొన్ని సర్వేల్లో మాత్రమే హంగ్ అసెంబ్లీ తప్పదని జోస్యాలు వినిపించాయి.

దాంతో బీజేపీలో కలవం పెరిగిపోతున్నట్లుంది. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్న అగ్రనేతలు చివరకు మతపరమైన చిచ్చు పెడితే తప్ప ఓట్లుపడవని అనుకున్నట్లున్నారు. అందుకనే హనుమంతుడంటే కాంగ్రెస్ కు ద్వేషమనే వాదన మొదలుపెట్టారు. దీనికి మోడీనే స్వయంగా ఆజ్యంపోయటమే ఆశ్చర్యంగా ఉంది.

Similar News