ప్రాక్టికల్ గా అయ్యే మాటల్ని ప్రధాని మోడీ చెప్పట్లేదా?

Update: 2021-04-12 04:16 GMT
ప్రధాని మోడీ అంటే నమ్మకం. ఆయన నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే..కొండ మీద ఉన్న కోతి కూడా కిందకు దిగినట్లుగా ఫీలయ్యేవారు ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. ఆయన ఛరిష్మా అలాంటిది. ఆయన మాటలకు ప్రజల్లో ఉండే విశ్వాసం అలాంటిది. ఇలాంటివేళలో.. మోడీ లాంటి పెద్ద మనిషి నోటి నుంచి వచ్చే మాటలు ఎంత ఆచితూచి అన్నట్లు ఉండాలి? అందుకు భిన్నంగా ఆయన అలవోకగా చెప్పే చాలామాటలు.. ప్రాక్టికల్ గా ఏ మాత్రం సాధ్యం కాని రీతిలో ఉంటున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

ఇటీవల కాలంలో మోడీ మాట్లాడుతూ.. ఆర్టీపీసీఆర్ టెస్టుల్ని భారీగా పెంచేయాలని చెప్పారు. రాష్ట్రాలు తాము చేసే టెస్టుల్లో 70 శాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయటం సాధ్యమా? అంటే.. కాదని చెబుతున్నారు. ఎందుకంటే.. అన్ని పరీక్షలు చేసేంత మిషనరీ ఏ రాష్ట్రం వద్దా లేదన్నది మోడీ మాష్టారికి ఎందుకు తెలీదు. అంతేకాదు.. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెరిగే కొద్దీ.. దాని ఫలితాలు వచ్చే సమయం అంతకంతకూ పెరుగుతుంది. తక్కువ కేసులు వచ్చినప్పుడు గరిష్ఠంగా 24 గంటల సమయం పడితే.. కేసులు పెరుగుతున్న కొద్దీ ఈ సమయం 48 గంటల నుంచి 72 గంటలు పట్టే పరిస్థితి.

పరీక్షలు మరిన్ని చేసిన పక్షంలో ఈ సమయం పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే.. రోగికి పరీక్ష ఫలితం వచ్చేసరికి.. రోగం మరింత ముదిరిపోయే ప్రమాదం ఉంది. అందుకే ర్యాపిడ్ టెస్టులతోనే మేలు అన్నది మర్చిపోకూడదన్నది నిపుణుల మాట. ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితం మూడు రోజులకు వచ్చి.. ఆ లోపు ఊపిరితిత్తులు దెబ్బ తింటే.. ప్రాణాలకే ప్రమాదమన్నది మర్చిపోకూడదు. మరి.. ఈ విషయాలేవీ మోడీకి తెలీవా? అన్నది ప్రశ్న.

దేశంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే యంత్రాలు ఎన్ని ఉన్నాయి? ఏ రాష్ట్రం ఎంతమేర పరీక్షలు చేసే సామర్థ్యం ఉందన్న విషయం ప్రధానికి తెలియంది కాదు. అలాంటప్పుడు.. చేసే టెస్టుల్లో 70 శాతం ఆర్టీపీసీఆర్ చేయమని ఎలా చెబుతారన్నది ప్రశ్న. తెలంగాణ విషయానికే వస్తే.. ప్రస్తుతం రోజుకు లక్ష పరీక్షలు చేస్తున్నారు. ప్రధాని చెప్పినట్లుగా అయితే.. 70 పరీక్షలు ఆర్టీపీసీఆర్ చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రాన్నే ఉదాహరణగా తీసుకుంటే.. ప్రభుత్వ పరంగా ఆర్టీపీసీఆర్ ఏడు వేలు చేసే సరికి కిందామీదా పడిపోతున్నారు. అలాంటిది ఏకంగా 70వేల టెస్టులు చేయటం అంటే.. అందుకు భారీ ఎత్తున యంత్రసామాగ్రి అవసరం అవుతుంది. దీనికి తోడు.. ఫలితాలు వెల్లడయ్యే విషయంలో ఉన్న ‘టైం’ ఇబ్బంది నేపథ్యంలో ప్రధాని మోడీ చెప్పిన ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయటం ప్రాక్టికల్ గా సాధ్యం కాదనే మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News