ఓ పక్క పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి.....ఏపీకి జరిగిన అన్యాయంపై తెలుగు ఎంపీలు తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు....మరో పక్క రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరడానికి ముందు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాకు వెల్లడించారు. తన దైనందిన జీవితం గురించిన విషయాలను మోదీ....శుక్రవారం సాయంత్రం మీడియాతో పంచుకున్నారు. గత 20 సంవత్సరాల నుంచి తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని మోదీ చెప్పారు.
తన బంధువులు - మిత్రుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు - వేడుకలకు తనను ఆహ్వానిస్తుంటారని - కానీ వాటికి హాజరయ్యేందుకు కూడా తాను ఏనాడు సెలవు పెట్టలేదని మోదీ తెలిపారు. తనకు ఆరోగ్యం సహకరించకపోయినా, కొద్దిపాటి అనారోగ్యంతో ఉన్నప్పటికీ పని చేయడానికే ఇష్టపడతానని చెప్పారు. గుజరాత్ సీఎంగా పనిచేసినపుడు రాష్ట్రమంతా పర్యటించానని - అదేవిధంగా ప్రధాని కాబోయే ముందు, అయిన తర్వాత కూడా దేశంలోని నలుమూలలా అలుపెరుగకుండా పర్యటించానని తెలిపారు. ఆ పర్యటనలలో భాగంగా ఆయా ప్రాంతాలలో లభించే స్థానిక వంటకాలను రుచిచూసేవాడినని - వాటిని తాను ఆస్వాదిస్తానని - అవే తనను సెలవులకు దూరంగా ఉంచాయని చెప్పారు. అంతేకాకుండా, విదేశీ పర్యటనలలో కూడా తనతో పాటు వంట మనిషిని తీసుకెళ్లనని స్పష్టం చేశారు.
ఉదయాన్నే యోగా చేయడంతో తన రోజు ప్రారంభమవుతుందని, ఆ తర్వాత కొన్ని సంపాదకీయాలను చదువుతానని చెప్పారు. ఆ తర్వాత తన మెయిల్స్ - నమో యాప్ ను చెక్ చేసుకుంటానని - యాప్ లో ప్రజలు చేసిన సూచనలు - సలహాలను నోట్ చేసుకుంటానని అన్నారు. ప్రతిరోజూ నిద్రకు ఉపక్రమించే ముందు ముఖ్యమైన ఫైల్స్ - డాక్యుమెంట్లు పరిశీలిస్తానని - అవసరమైన ఫైళ్ల పై సంతకం పెట్టి సత్వరమే సంబంధిత శాఖలకు చేరేవిధంగా చూస్తానని అన్నారు. ఆ తర్వాతే తన తర్వాతి రోజు ప్రణాళికను నిర్దేశించుకుంటానని అన్నారు. సాధారణంగా తాను రోజుకు 4 గంటలు మాత్రమే నిద్రపోతానని, అయితే, తాను కనీసం 4-6 గంటల పాటు నిద్రపోవాలని సూచించారని అన్నారు. తన దృష్టిలో ప్రతి రోజూ ముఖ్యమైనదేనని అన్నారు. ఇంతటి క్రమశిక్షణ, నిబద్ధత ఉంది కాబట్టే మోదీ....ఒక దేశ ప్రధానిగానే కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా కూడా ఎందరికో ఆదర్శప్రాయుడయ్యారు.