ఈ ఇష్యూను కెలకకుండా ఉండాల్సింది మోడీ.. చెలరేగిన కాంగ్రెస్..

Update: 2022-04-28 05:30 GMT
ఎంత అద్భుతంగా పని చేసే ప్రభుత్వమైనా.. ప్రజల మద్దతు ఉన్న సర్కారుకైనా కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి.  అలాంటివేమీ లేని ప్రభుత్వాలు ఏమీ ఉండవు. కేంద్రంలోని మోడీ సర్కారు పరిస్థితి ఇదే తీరులో కనిపిస్తుంటుంది. బలమైన ప్రతిపక్షం లేకపోవటం.. మోడీని ప్రశ్నించి.. ఉక్కిరిబిక్కిరి చేసేంత జాతీయ నేత ఎవరూ లేకపోవటం ఆయనకు కలిసి వచ్చిందని చెప్పాలి. ఈ కారణంగా ఆయన అప్పుడప్పుడు అవసరం లేని కొన్ని అంశాల్ని ప్రస్తావిస్తుంటారు.అలా చేయటం ద్వారా ఆయన విపక్షాలకు అవకాశం ఇస్తుంటారు. అయినప్పటికీ ఆయన ఇమేజ్ తగ్గిన పరిస్థితి కనిపించదు.

ఎక్కడిదాకానో ఎందుకు.. మోడీ సర్కారు మీద అవినీతి ఆరోపణలు చేయటానికి ఏ ఒక్క విపక్షం కానీ సిద్ధంగా ఉండదు. అదే సమయంలో పెట్రోల్.. డీజిల్ మీద బాదుడు విషయంలో ప్రతిపక్షం దాకా అక్కర్లేదు.. దేశంలోని చిన్నపిల్లాడ్ని అడిగినా.. ప్రశ్నల వర్షం కురిపిస్తారు. సామాన్యులైతే.. పెట్రోల్.. డీజిల్ విధానంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న వైనాన్ని తీవ్రంగా తప్పు పడుతుంటారు. అలాంటి ఇష్యూను తాజాగా టచ్ చేసిన ప్రధాని మోడీ కొత్త చర్చకు తెర తీశారు.

రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన మోడీ మాష్టారి తీరును ఏ ఒక్కరు సమర్థించే పరిస్థితి లేదు. కరోనాకు సంబంధించిన రివ్యూ పేరుతో ముఖ్యమంత్రులతో సమావేశమైన ఆయన.. సంబంధం లేని పెట్రోల్.. డీజిల్ ధరల విషయాన్ని.. పన్ను అంశాల్ని చర్చకు తీసుకొచ్చారు. సందర్భానికి ఏ మాత్రం సూట్ కాని పెట్రోల్.. డీజిల్ పన్నుల మీద ఆయన మాట్లాడకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంధన ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించలేదన్న ఆయన మాటపై కాంగ్రెస్ కాసింత ఘాటుగానే రియాక్టు అయ్యింది. మోడీ సర్కారు హయాంలో పెంచిన పెట్రోల్.. డీజిల్ ధరలతో వసూలు చేసిన రూ.27లక్షల కోట్ల రూపాయిల్ని ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించింది.  దీనికి సంబంధించి వరుస ట్వీట్లతో ప్రధాని మోడీ వాదన తేలిపోయేలా ట్వీట్లు చేశారు.

2014కు ముందు లీటరు పెట్రోల్ పై ఎక్సైజ్ పన్ను రూ.9.48,  లీటర్ డీజిల్ మీద రూ.3.56 మాత్రమే ఉండేది. కానీ.. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీటరు పెట్రోల్ పై ఎక్సైజ్ పన్ను రూ.27.90, లీటరు డీజిల్ పై రూ.21.80 చొప్పున పెంచేశారని మండిపడిన కాంగ్రెస్.. ముడిచమురు ధరలు 2014తో పోలిస్తే ప్రస్తుతం చాలా తక్కువగానే ఉన్నాయన్నారు. 2014 మే 26న మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళలో బ్యారెల్ ముడి చమురు ధర 108 డాలర్లు ఉంటే.. దేశంలో లీటరు పెట్రోల్ రూ.71.41, లీటరు డీజిల్ రూ.55.49గా ఉండేదన్నారు.

ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 100.20 డాలర్లు ఉందని.. ఢిల్లీ మహానగరంలో లీటరు పెట్రోల్ రూ.105.4, లీటరు డీజిల్ రూ.96.67కు పెరిగిపోయినట్లుగా వెల్లడించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల కాలంలో పెట్రోల్.. డీజిల్ మీద కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రెట్టింపు అయిన పరిస్థితి. వాస్తవాలు ఇలా ఉంటే.. మోడీ మాత్రం రాష్ట్రాల మీద పడిపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రస్తావించిన లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలు ఢిల్లీవి. అదే తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఉన్న పరిస్థితి. నిత్యం ప్రజలు పెట్రోల్.. డీజిల్ ధరల విషయంలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న వేళ.. అందుకు భిన్నంగా మోడీ టచ్ చేసిన ఇష్యూ ఆయన సర్కారు మీద మరింత మండిపాటు పెరిగేలా చేస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News