ఢిల్లీకి ముఖ్య‌మంత్రిలా మాట్లాడుతున్న మోడీ!

Update: 2020-02-05 15:30 GMT
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తీవ్ర క‌స‌ర‌త్తే చేస్తూ ఉన్నారు. ఢిల్లీ ప్ర‌చార ప‌ర్వంలో మోడీ చాలా క్రియాశీల‌కంగా క‌నిపిస్తూ ఉన్నారు. ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు ర‌క‌ర‌కాల మాట‌లు చెబుతూ అక్క‌డ త‌న పార్టీని గెలిపించుకునేందుకు మోడీ ప్ర‌య‌త్నాలు సాగిస్తూ ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగినా అక్క‌డ భార‌తీయ జ‌న‌తా పార్టీకి మోడీనే అంతా తాను అవుతున్న సంగ‌తి తెలిసిందే. మోడీ ప్ర‌ధాని అయిన‌ప్ప‌టి నుంచి చాలా రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీ అస‌లు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థినే ప్ర‌క‌టించ‌డం లేదు. మోడీనే ముఖ్య‌మంత్రి అవుతాడు అన్న‌ట్టుగా బీజేపీ ప్ర‌చార ప‌ర్వాలు సాగుతున్నాయి. వాటిల్లో చాలా వ‌ర‌కూ తేడా కొడుతున్నాయి.

అయినా బీజేపీ వ్యూహాలు మాత్రం మార‌డం లేదు. ఢిల్లీలో కూడా అదే క‌థ న‌డుస్తూ ఉంది. ఇప్పుడు అక్క‌డు జ‌ర‌గుతున్న ఎన్నిక‌ల విష‌యంలో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ని బీజేపీ ప్ర‌క‌టించ‌లేదు. అర‌వింద్ కేజ్రీవాల్ కు ధీటైన సీఎం అభ్య‌ర్థి బీజేపీ వ‌ద్ద లేన‌ట్టే అని స్ప‌ష్టం అవుతోంది. గెలిస్తే.. ఎవ‌రో ఒకిరిని కూర్చోబెట్ట‌వ‌చ్చు.


అయితే విద్యాధికులు ఎక్కువ‌గా ఉండే.. చోట ఇలాంటి వ్యూహం ఎంత వ‌ర‌కూ చెల్లుతుంది అనేది సందేహ‌మే. బీజేపీ ఎవ‌రో ఒక‌రిని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి ఉంటే.. వారి విష‌యంలో ఢిల్లీ ఓట‌ర్ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేవారు. అయితే త‌న జీవితం ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు అంకితం అని మోడీ అంటున్నారు. మ‌రి ప్ర‌ధాన‌మంత్రి హోదాలో ఉన్న ఆయ‌న త‌నే ఢిల్లీకి ముఖ్య‌మంత్రి కాబోతున్న‌ట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. మోడీకి ఆల్రెడీ ప‌ద‌వి ఉంది. ఆయ‌న అంకితం ఇవ్వ‌డానికి చాలా దేశం ఉంది. అదంతా వ‌దిలేసి.. ఢిల్లీకే త‌న జీవితం అంకిత‌మ‌న్న‌ట్టుగా ఆయ‌న మాట్లాడ‌టం అంత మెప్పిచేదిలా లేద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ ప‌డుతున్నారు.

ఇక ఆప్ స‌ర్కారుపై మోడీ ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు చేస్తూ ఉన్నారు. ఆప్ వ‌ల్ల ఢిల్లీకి న‌ష్టం అని అంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీనే గెలిచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని మోడీ అంటున్నారు. అయితే మెజారిటీ మీడియా వ‌ర్గాలు మాత్రం త‌మ త‌మ స‌ర్వేల్లో ఆప్ దే ఢిల్లీ అని అంటున్నాయి! అస‌లు క‌థ ఏమిటో ఫిబ్ర‌వ‌రి 11న తేల‌బోతోంది. ఆ రోజున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.
Tags:    

Similar News